Begin typing your search above and press return to search.

నాలుగు రాజ్యసభ ఎంపీల సెలెక్షన్ విజయసాయిరెడ్డిదేనా...?

By:  Tupaki Desk   |   18 May 2022 7:30 AM GMT
నాలుగు  రాజ్యసభ ఎంపీల సెలెక్షన్ విజయసాయిరెడ్డిదేనా...?
X
ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వాటిని నిన్న ఏపీ సీఎం జగన్ పేర్లు ప్రకటించి అభ్యర్ధుల జాబితాను కన్ ఫర్మ్ చేశారు. అయితే ఈ మొత్తం సెలెక్షన్ అంతా చెత్తగా ఉన్నాయని వైసీపీ వర్గాలు అంటున్నాయి. వాటిలో తెలంగాణా నుంచి వచ్చిన ఆర్ క్రిష్ణయ్య వల్ల ఏపీలో ఉన్న బీసీలకు ఏమి జరుగుతుందని అంటున్నారు. ఇక తెలంగాణాలోనే క్రిష్ణయ్య ఈ మధ్య చూస్తే అవుట్ డేటెడ్ లీడర్ అయిపోయారు అని అంటున్నారు.

ఇక అతని మీద చాలా ఆరోపణలు కూడా ఉన్నాయని చెబుతారు. ప్రతీ సారి అధికారం కోసం ఆయన వివిధ పార్టీల నాయకులను పొగుడుతారు అని అంటారు. ఒకసారి కేసీయార్ ని, టీయారెస్ ని పొగుడుతారు. అలాగే మరోసారి సీఎం క్యాండిడేట్ గా తనను ముందు పెట్టిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుని పొగిడి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2018లో కేసీయార్ కి వ్యతిరేకంగా పిలుపు ఇచ్చినా కూడా నాటి రాజకీయ పరిస్థితులు, పరిణామాలలో ఆయన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. నాడు టీయారెస్ ని గెలిపించారు కూడా.

ఇక మరో బీసీ నేత బీద మస్తాన్ రావు కరడు కట్టిన తెలుగుదేశం వాదిగా చెబుతారు. అతనికి శ్రీకాకుళం నుంచి చెన్నై వరకూ పెద్ద ఎత్తున ఫిషరీస్ కి సప్లై చేసే ఫుడ్ మెటీరీల్ బిజినెస్ లు ఉన్నాయి. ఇక 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పెద్ద ఎత్తున చంద్రబాబుకు ఆర్ధిక సాయం చేశారు అని కూడా అంటున్నారు.

ఇక జగన్ ఒకవేళ 2019 ఎన్నికల్లో ఓడిపోతే అతను వైసీపీలోకి వచ్చేవారా అని కూడా అన్న వారు ఉన్నారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక తన బిజినెస్ ల కోసం పార్టీలో చేరిన మస్తాన్ రావు రాజ్య సభ ఎంపీ అయిపోతే వైసీపీలో ఉన్న అసలైన బీసీ లీడర్ల సంగతేంటి, వారు ఏమి కావాలని కూడా అంటున్నారు.

ఇక అసలు విషయం చూస్తే నెల్లూరు జిల్లాకు చెందిన మస్తాన్ రావు తమ్ముడు జగన్ని ప్రతీ రోజూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు అని అంటారు. మరి ఈ రకంగా బిజినెస్ ల కోసం పార్టీలో చేరిన వారిని అవసరార్ధం అధికార పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇస్తూ పోతే వైసీపీలో ఉన్న అసలైన బీసీలు జగన్ని ఎలా నమ్ముతారు అని కూడా అంటున్నారు.

ఇక నిరంజన్ రెడ్డి. ఈయన జగన్, విజయసాయిరెడ్డిల సీబీఐ, ఈడీ కేసులు చూసే పెద్ద లాయర్. హైదరాబాద్ లో ఉండే పేరు మోసిన లాయర్ ఈయన. అతని చార్జీలను భరించాలి అంటే కష్టమని చాలా మంది అంటూంటారు. ఇక అతనికి రాజ్యసభ టికెట్ ఇస్తే జగన్, విజయసాయిరెడ్డిల కేసులకు సంబంధించిన కేసులకు ఏ రకమైన‌ చార్జి చేయకుండా ఉంటారనే ఇచ్చారు అని అంటున్నారు. ఇంతకంటే అతని వల్ల వైసీపీకి కానీ, ఏపీలో పార్టీకి కానీ ఎలాంటి ఉపయోగం లేదని అంటున్నారు. ఒక వేళ రెడ్డి కోటాలో ఎంపీ సీటు ఇవ్వాలీ అంటే రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు, నెల్లూరు, ప్రకాశం నుంచి పెద్ద నాయకులు రెడ్లు చాలా మంది ఉన్నారు కదా అన్నది పార్టీలో మాట.

ఇక నాలుగవ సీటు విజయసాయిరెడ్డికి రెన్యూవల్ చేశారు. ఈయన పార్టీకి పట్టుకొమ్మలాంటి వారు. వైసీపీలో నంబర్ టూ స్థానం ఇతనిదే అని అంతా అంటూ ఉంటారు. ఇది వాస్తవం కూడా. ఎందుకు అంటే ఈ నాలుగు ఎంపీ సీట్లు కూడా ఆయన కోటాలోనే ఇచ్చారు అని పార్టీలో వినిపిస్తున్న మాట. బీద మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి అతని మనుషులే. ఇక బీసీ నేత ఆర్ క్రిష్ణయ్యకు ఇవ్వాలన్న ఐడియా కూడా విజయసాయిరెడ్డిదే అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే వైసీపీలో విజయసాయిరెడ్డి హవా జోరుగా సాగుతోంది అంటున్నారు. పార్టీలో ఎవరికైనా ఏ సీటు అయినా రావాలీ అంటే విజయసాయిరెడ్డి దర్శనం కోసం చూడాలి, ఆయన మాటతోనే దక్కించుకోవాలి అన్న మాట అయితే పార్టీ వర్గాలలో ఉంది. ఇదీ వైసీపీలో నాలుగు రాజ్యసభ సీట్ల కధ.