Begin typing your search above and press return to search.

అంతేగా.. బాబు పరిస్థితి ఇంతేగా..

By:  Tupaki Desk   |   25 May 2019 12:56 PM IST
అంతేగా.. బాబు పరిస్థితి ఇంతేగా..
X
అంతా అయిపోయింది.. టీడీపీ నావ నిండా మునిగిపోయింది.. బాబు ఆశలు ఆవిరయ్యాయి. కేంద్రంలో చక్రం తిప్పుదామని.. అవసరమైతే పీఎం అవుదామని ఎన్నో కలలు.. ఇందుకోసం కాలికి బలపం కట్టుకొని తిరిగేశారు బాబు. మే 23 ఫలితాలకు ఒక్కరోజు ముందు సైతం బెంగాల్ వెళ్లి మమతను హంగ్ వస్తే కాంగ్రెస్ కూటమిలోకి ఆహ్వానించి.. అనంతరం బెంగళూరు వెళ్లి కర్ణాటక సీఎం కుమారస్వామితో చర్చలు జరిపారు. రాత్రనక, పగలనక తిరిగి తిరిగిన చంద్రబాబుకు ఇప్పుడు 5 ఏళ్లు ఫుల్ రెస్ట్ దొరికింది. ఇంటిని పట్టించుకోకుండా భార్యతో సరిగా మాట్లాడకుండా.. మనవడితో ఆడుకోకుండా అతడి బాల్యపు చేష్టలకు దూరమైన చంద్రబాబుకు ఇప్పుడు మనవడితో ఆడుకునే టైం దొరికేసింది.

చంద్రబాబు ఓటమిని ఆయన , టీడీపీ అభిమానులు, ఎమ్మెల్యేలు జీర్ణించుకోవడం లేదు. కేంద్రంలో చక్రం తిప్పుదామనుకున్న బాబు ఇంత ఘోరంగా ఓడిపోతాడని.. రాష్ట్రంలోనూ ఏ చక్రం తిప్పలేడని తెలిసి ఖంగుతింటున్నారు.

ఇక బాబు ఓటమిని ప్రత్యర్థులు పండుగ చేసుకుంటున్నారు. రాంగోపాల్ వర్మ అయితే ప్రతి గంటకోసారి బాబు పరిస్థితిపై సెటైరికల్ జోక్స్ తో ట్విట్టర్ ను నింపేస్తున్నారు. వికటట్టహాసం చేస్తూ ఆనందిస్తున్నారు. తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను ఏపీలో ఆపినందుకు బాబును ఆ ఎన్టీఆరే చిత్తుగా ఓడించాడని ట్విట్టర్ లో సెటైర్లు వేస్తున్నారు.

ఇక అందరూ తమ క్రియేటివిటీతో ఓడిన బాబును సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు.తాజాగా ఆయన మనవడితో కలిసి ఆడుకున్న ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. ‘థ్యాంక్యూ జగన్.. మా తాతను ఓడించి నాకు ఆడుకునే అవకాశామిచ్చావని.. ఓ పదేళ్ల పాటు మా తాతతో ఇలానే ఆడుకునేలా చూడవా’ అంటూ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.

ఒకటి కాదు.. రెండు కాదు.. చంద్రబాబును ఎద్దేవా చేస్తూ ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఇక ఉండరని.. ఖాళీగా ఏమేం చేస్తారానన్న దానిపై బోలెడు కార్టూన్ లు, చిత్రాలు జోడిస్తూ తమదైన శైలిలో క్రియేటివ్ ఆలోచనలు చేస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు ఇప్పట్లో వచ్చేలా లేరు. ఆయన మీడియాకు ముఖం చూపడానికి సంశయిస్తున్నారు. టీడీపీ నేతల పరిస్థితి అంతే.. అందుకే ఇప్పుడు విమర్శకులకు కూడా ఏం అనలేని కౌంటర్ ఇవ్వలేని పరిస్థితి. అందుకే నిజంగానే మనవడితో ఆడుకోవడం తప్ప బాబుకు ఆప్షన్ లేనట్టే కనిపిస్తోంది.