Begin typing your search above and press return to search.

పెనుకొండ టీడీపీలో సార‌థి అల‌క‌.. పార్టీని న‌డిపించేవారేరీ?

By:  Tupaki Desk   |   20 July 2022 12:30 AM GMT
పెనుకొండ టీడీపీలో సార‌థి అల‌క‌.. పార్టీని న‌డిపించేవారేరీ?
X
ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని అత్యంత కీల‌క‌మైన‌ పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండగానే టికెట్‌పై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్ప‌డింద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే పార్టీ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లడంలో ఆయన పూర్తిగా డీలా పడినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

కొన్నాళ్ల కింద‌ట చంద్రబాబు సోమందేపల్లికి వ‌చ్చారు. ప్ర‌భుత్వంపై నిర‌స‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేస్తార‌ని, చేయాల‌ని బీకే పార్థసారథి ఆశించారు.

అయితే.. స్థానికంగా.. ఉన్న పార్టీ నేత‌ల విభేదాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఈ విష‌యాన్ని త‌ర్వాత చూద్దామ‌ని.. చెప్పి.. అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. 2024లో పెనుకొండ టికెట్‌పై చంద్రబాబు గానీ, లోకేష్‌ గానీ హామీ ఇవ్వలేద‌ని.. బీకే వ‌ర్గం చెబుతోంది.

అంతేకాదు.. ఈ సారి యువతకే అవకాశమని స్పష్టం చేయడంతో బీకే దిక్కుతోచని స్థితిలో పడ్డారని చర్చ జరుగుతోంది. ఈ విషయంపై బీకే పార్థసారథి ఇప్పటికే 2, 3 సార్లు చంద్రబాబును, లోకేష్‌ను కలసినా ఆశించిన ఫలితం కనిపించకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. అందువల్లే నెల రోజులుగా పట్టణంలోని టీడీపీ కార్యాలయాన్ని కూడా ఎక్కువగా తెరవడం లేదని తెలుస్తోంది. దీంతో నాయకులు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.

నిజం చెప్పాలంటే.. పెనుకొండలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. బీకే వ్యవహారశైలి, ఆయన అల్లుడి అజమాయిషీ నచ్చని తెలుగు తమ్ముళ్లు రెండుగా విడిపోయారు. గతంలో బీకేకు అనుకూలంగా ఉన్న వారే ప్రస్తుతం తిరుగుబాటు చేస్తున్నారు.

ఈ ప‌రిణామాల‌పై రాజ‌కీయంగా ఇక్క‌డ చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. అయితే.. బీకే క‌న్నా.. బ‌ల‌మైన నాయ‌కుడు పార్టీకి క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీనిని బ‌ట్టి.. చంద్ర‌బాబు ఇప్ప‌టికైనా.. పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గంపై ఒక నిర్ణ‌యం తీసుకోవాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.