Begin typing your search above and press return to search.

పాదయాత్రలు చేస్తే బరువు తగ్గటం తప్ప ప్రయోజనం లేదంటున్న రోజా

By:  Tupaki Desk   |   17 Jan 2023 4:43 AM GMT
పాదయాత్రలు చేస్తే బరువు తగ్గటం తప్ప ప్రయోజనం లేదంటున్న రోజా
X
అవకాశం కోసం ఎదురుచూడకుండా.. అవకాశాన్ని అందిపుచ్చుకోవటం కాదు లాక్కొని మరీ తగువు పెట్టుకోవటంలో ఉన్న ఆనందాన్ని ఎంజాయ్ చేస్తుంటారు ఏపీ మంత్రి ఆర్కే రోజా. తమ రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఆమె తీరు ఎలా ఉంటుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లను తరచూ టార్గెట్ చేసే ఆమె జాబితాలో ఉండే మరో పేరు లోకేశ్. అవసరం ఉన్నా లేకున్నా ఆమె మాత్రం ఈ ముగ్గురిపై తరచూ ఒంటికాలిపై విరుచుకుపడుతుంటారు.

గతంలో రోజా విషయాన్ని పెద్దగా పట్టించుకోని పవన్ కల్యాణ్ ఈ మధ్యన ఆమెపై ఘాటు వ్యాఖ్యలు చేయటం.. డైమండ్ రాణి పేరుతో ఆమెపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారటం తెలిసిందే. ఎప్పుడూ తాను అనటమే తప్పించి.. తాను అనిపించుకునే అలవాటు లేని రోజాకు.. పవన్ ఘాటు వ్యాఖ్యలు కాస్తంగా బలంగానే తగిలాయి. దీంతో ఆమె మరింతగా చెలరేగిపోవటం.. ఆమెపై పవన్ అభిమానులు విరుచుకుపడటం తెలిసిందే.

తాజాగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా భవానీ ద్వీపానికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. త్వరలోనే రాష్ట్ర పర్యటనకు జనసేనాని వారాహితో సిద్ధం కావటం.. మరికొద్ది రోజుల్లోనే టీడీపీ యువనేత లోకేశ్ పాదయాత్రకు రెడీ అవుతున్న వేళ.. వీరిద్దరికి ఉమ్మడిగా పంచ్ లు వేశారు రోజా. పవన్ కల్యాణ్ వారాహితో వచ్చినా.. యువగళంతో నారా లోకేశ్ వచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.

పాదయాత్రలు చేస్తే బరువు తగ్గటం తప్పించి మరెలాంటి ప్రయోజనం లేదన్న ఆమె మాటలు జనసేన.. టీడీపీ వర్గాలకు మంట పుట్టిస్తున్నాయి. చరిత్రను రోజా మర్చిపోయినట్లున్నారన్న మాట వినిపిస్తోంది.

జనం జీవితాల్ని బాగు చేయాలన్న సంకల్పంతో యాత్రలు చేస్తే.. వారు నమ్ముతారా? లేదా? అన్న దానిపై జోస్యాలు చెప్పే కన్నా.. కాలానికి వదిలేస్తే మరింత బాగుంటుంది కదా? ఆ పని చేయకుండా అనవసరంగా నోరు పారేసుకోవటం భవిష్యత్తులో మరిన్ని కష్టాలు కొని తెచ్చుకోవటం తప్పించి మరెలాంటిప్రయోజనం ఉండదన్న విషయాన్ని రోజా గుర్తిస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.