Begin typing your search above and press return to search.

రిషి సునాక్ ప్రస్థానం: వెయిటర్ నుంచి బ్రిటన్ ప్రధాని వరకూ..

By:  Tupaki Desk   |   25 Oct 2022 6:42 AM GMT
రిషి సునాక్ ప్రస్థానం: వెయిటర్ నుంచి బ్రిటన్ ప్రధాని వరకూ..
X
భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించాడు. మొదట ఎన్నికల్లో లిజ్ ట్రస్ చేతిలో ఓడి ఇప్పుడు ఆమె రాజీనామాతో అనూహ్యంగా బ్రిటన్ ప్రధానిగా రిషి ఎన్నికయ్యాడు. కేవలం రెండు నెలల్లోనే యూకేకు అనూహ్యంగా ప్రధాని అయ్యారు. బ్రిటన్ ప్రధానిగా మొదటి భారతీయ సంతతికి చెందిన ప్రధానమంత్రిగా ఎన్నికయ్యే వరకూ రిషి సునక్ ఎన్నో కష్టాలు అనుభవించాడు. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కో మెట్టు ఎక్కుతూ అత్యున్నత పదవి చేపట్టారు.

ఇంగ్లండ్ లోని సౌథాంప్టన్ నగరంలో రిషి 1980 మే 12న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఉష, యశ్ వీర్. భారత్ లోని పంజాబ్ లో రిషిసునాక్ తల్లిదండ్రుల మూలాలున్నాయి. వారు టాంజానియా, కెన్యా నుంచి బ్రిటన్ కు వలసవచ్చారు. సునాక్ తండ్రి యశ్ వీర్ వైద్యులు కాగా.. తల్లి మెడికల్ షాప్ నిర్వహించేవారు.

ఆక్స్ ఫర్డ్ లో ఫిలాసఫీ, ఎకనామిక్స్ అభ్యసించారు. మన భారత ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతా మూర్తిని రిషి సునాక్ వివాహం చేసుకున్నారు. 2009లో వీరికి పెళ్లి అయ్యింది. ఇద్దరు కుమార్తెలున్నారు. తొలిసారి 2015లో రిచ్ మండ్ ఎంపీగా రిషి సునాక్ ఎన్నికయ్యారు. 2017, 2019లలోనూ తిరిగి ఎన్నికయ్యారు. 2020 ఫిబ్రవరిలో బోరిస్ జాన్సన్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా నియమితులై ఈ ఏడాది జులై వరకూ కొనసాగిన విషయం తెలిసిందే.

సునాక్ తన పాఠశాల విద్యను వించెస్టర్ కళాశాల నుంచి పూర్తి చేశారు. ఇది ఆరుగురు ఛాన్సలర్ లను తయారు చేసి ఇచ్చిన పాఠశాల కావడం విశేషం. రిషి వేసవి సెలవుల్లో సౌతాంప్టన్ లోని ఇండియన్ రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేశాడు. తత్వశాస్త్రం, రాజకీయాలు, ఆర్థిక శాస్త్రాలను అధ్యయనం చేయడానికి ఆయన ఆక్స్ ఫర్డ్ కు వెళ్లారు.

2001లో ఆక్స్ ఫర్డ్ నుంచి పట్టభద్రుడయ్యాడు. గోల్డ్ మన్ సాచ్స్ కు విశ్లేషకులు అయ్యారు. 2004 వరకూ బ్యాంకింగ్ కంపెనీలో పనిచేశాడు. అనంతరం స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేశారు. ఇక్కడే రిషి, నారాయణమూర్తి కుమార్తె అయిన అక్షతామూర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

2015లో రిచ్ మండ్ (యార్క్స్) నియోజకవర్గం నుంచి రిషి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రెండు సార్లు గెలిచి థెరిసా మే ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా పనిచేశారు. 2019లో బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ట్రెజరీకి ప్రధాన కార్యదర్శిగా నియామకమై ఫిబ్రవరి 2020లో ఛాన్సలర్ పదవికి పదోన్నతి పొందాడు. ఇప్పుడు ఏకంగా అత్యున్నత పదవి అయిన బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ నియమితులయ్యాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.