Begin typing your search above and press return to search.

రివర్సయిన పవన్ రాజకీయం ?

By:  Tupaki Desk   |   2 Nov 2021 4:54 AM GMT
రివర్సయిన పవన్ రాజకీయం ?
X
తానొక్కడే పెద్ద మేధావి అయినట్లు, తనొకక్కడికే ఆత్మాభిమానం ఉన్నట్లు జనసేన అధినేత పెద్ద బిల్డప్ ఇచ్చారు. వైజాగ్ స్టీల్స్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో జరిగిన బహిరంగసభలో పవన్ మాట్లాడారు. నిజానికి కార్మిక సంఘాలు, స్ధానికులు ఆశించింది ఒకటైతే పవన్ చేసింది మరొకటి. ఆశించిందానికి వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా జనాలెవరికీ ఆత్మాభిమానం లేదన్నట్లుగా మాట్లాడటం, కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడకపోవటంతో పవన్ రాజకీయమంతా రివర్సు కొడుతోంది.

కార్మిక, ఉద్యోగ సంఘాల దీక్షకు సంఘీభావం తెలిపిన పవన్ తన ప్రసంగమంతా రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయటంతోనే సరిపెట్టారు. పవన్లో నిజంగానే చిత్తశుద్ది ఉంటే నిలదీయాల్సింది కేంద్రప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్రమోడిని మాత్రమే. ఎందుకంటే స్టీల్ ఫ్యాక్టరీకి రాష్ట్రప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదు. ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నది మోడి అయినపుడు జగన్మోహన్ రెడ్డిపై బురదచల్లుదామని పవన్ చూడటంలో అర్ధమేలేదు. ఇక్కడే పవన్ రాజకీయం అందరికీ అర్ధమైపోయింది.

నిజానికి పవన్ను కార్మికసంఘాలు బహిరంగసభకు పిలవటంలో ఉద్దేశ్యం ఏమిటంటే కార్మిక, ఉద్యోగసంఘ నేతల్లో కొందరిని ఢిల్లీకి తీసుకెళ్ళి మోడినో లేకపోతే హోంశాఖ మంత్రి అమిత్ షా తోనే మాట్లాడిస్తారని. అంతేకానీ రాష్ట్రప్రభుత్వంపై తనకున్న అక్కసును తీర్చుకుని సభను కంపు చేస్తాడని మాత్రం కాదు. ఇదే విషయంపై సీపీఐ నేత జేవీ సత్యనారాయణ మాట్లాడుతు కార్మికసంఘాల నేతలు ఒకటి ఆలోచిస్తే పవన్ మాట్లాడింది వేరన్నారు. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు రాష్ట్రప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని స్పష్టంగా చెప్పారు.

ఆత్మగౌరవం లేని ఆంధ్రులు చచ్చిపోవటమే మేలన్న పవన్ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇదే పవన్ ఒకపుడు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ దేశవ్యాప్తంగా తీసుకున్న కేంద్రం పాలసీలో భాగమే అని చెప్పిన విషయాన్ని జేవీ గుర్తుచేశారు. అప్పుడు అలా మాట్లాడిన పవన్ ఇపుడు మాత్రం ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్నట్లు మాట్లాడుతున్నారంటే ఆయనకు కూడా ఆత్మగౌరవం లేదనే అనుకోవాలా ? అంటు నిలదీశారు. రాజకీయాలకు అతీతంగా దీక్షలు చేస్తున్న కమిటీకి ప్రభుత్వంతో అఖిలపక్షం ఏర్పాటు చేయించే శక్తుంటుందా అని ప్రశ్నించారు. కార్మిక నేతలెవరు పవన్ స్పీచుతో సంతృప్తిగా లేరన్నారు.

తనను ఓడించిన గాజువాక నియోజకవర్గం ప్రజలపై పవన్ కు ఇంత కసి ఉంటుందని ఎవరు ఊహించినట్లు లేదు. అందుకనే వైసీపీకి ఓట్లేసి తనను పనిచేయమంటే ఎలాగంటు పదే పదే ప్రశ్నిస్తున్నారు. దీంతోనే గాజువాక ప్రజలపై పవన్ కు ఎంత కసుందో అర్ధమైపోతోంది. ఇపుడు కూడా వైసీపీనే మరోసారి ఇక్కడ నుండి గెలిపించుకోండని పవన్ ఎద్దేవా చేయటమే ఆయనలో పేరుకుపోయిన కసికి నిదర్శనం. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్న కనీసం ఇంగితం కూడా లేకుండా ప్రజలను నిందిస్తుంటే పవన్ ఎప్పటికీ గెలిచి చట్టసభలోకి అడుగుపెట్టలేరేమో.