Begin typing your search above and press return to search.

వావ్ వావ్ : కోన‌సీమ కుర్రోడా సెబ్బాస్ రా..! అదిరిపోయే ఆదాయం !

By:  Tupaki Desk   |   14 April 2022 3:47 AM GMT
వావ్ వావ్ : కోన‌సీమ కుర్రోడా సెబ్బాస్ రా..! అదిరిపోయే ఆదాయం !
X
ఆహా ! అనండిక ఈ కుర్రాడి గురించి వింటే..! సెబ్బాస్ రా బుడ్డోడా అని కూడా అనండిక ! ఈ కుర్రాడి ప్ర‌తిభ గురించి చ‌దివేక ! విన్నాక ! వివ‌రం తెలుసుకున్నాక ! ఇప్ప‌టిత‌రం స్మార్ట్ ఫోన్ల తో కుస్తీలు ప‌డుతూ త‌ల్లిదండ్రుల మాట విన‌ని సంద‌ర్భాలే ఎక్కువ కానీ ఈ బుడ్డోడు వాళ్లకు భిన్నం.

ఇప్ప‌టి త‌రం చ‌దువు క‌న్నా ఆన్లైన్ గేమ్ లు, ప‌బ్జీ ఆట‌లు ఇంకా వగైరా వ‌గైరా వైరాగ్యాల‌తో కాలం నెట్టుకు వ‌స్తుంటే ఈ కుర్రాడు వరుస విజ‌యాల‌ను సాధించి కొన‌సాగించి కోన‌సీమ‌కే త‌ల‌మానికం అవుతున్నాడు. అది క‌దా కావాలి. వివరాల్లోకి వెళ్లొద్దాం రండి!

ఆ కుర్రాడి పేరు సాకా ప్ర‌వీణ్. ప‌దోత‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ఊరు ఐ పోల‌వ‌రం.. అంటే నిన్న‌టి దాకా ఉమ్మ‌డి తూగో అంటే తూర్పుగోదావ‌రి జిల్లా. ఇప్పుడది అమలాపురం కేంద్రంగా ఏర్పాట‌యిన జిల్లాలో ఉంది. కోన‌సీమ జిల్లాగానే పేరు పెట్టారు. ఈ ప్రాంతానికి ఓ విశిష్ట‌త ఉంది.

ప‌చ్చంద‌నాల‌ను పోగేసుకుని నిత్యం హ‌రిత అందాలతో అల‌రించే ఆ శోభ‌కు త‌గ్గ‌ట్టుగానే ఆ కుర్రాడి నైపుణ్య‌మూ ఉంది. చ‌దువుతూ సోమ‌రిపోతులా మార‌క, చ‌దువుతూ బ‌చ్చా బ్యాచ్ ల‌తో తిరుగుతూ కాలం వృథా చేయ‌క వండ‌ర్ కిడ్ అనిపించుకుంటున్నాడు. అది క‌దా కావాలి. త‌ల్లిదండ్రుల‌కు మంచి పేరు తీసుకు రావ‌డంతో త‌న బాధ్య‌త మ‌రింత పెరిగింద‌ని కూడా చెబుతున్నాడు.

అవును కంప్యూట‌ర్ కోర్సులు త‌నంత‌ట తానే నేర్చుకుని, ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ లు కూడా త‌నంత‌ట తానే అభ్యసించి సంబంధిత రంగంలో దూసుకుపోతున్నాడు. కొన్ని కంపెనీల‌కు ప్రొగ్రామ‌ర్ గా ప‌నిచేస్తున్నాడు. ఆన్లైన్ ఆధారిత ప్రాజెక్టుల‌కు రూప‌క‌ల్ప‌న చేసి పిట్ట కొంచెమే అయినా త‌న కూత మ‌రియు రాత ఘ‌నమే అని చాటుకుంటున్నాడు.

ఇప్ప‌టిదాకా 37 ర‌కాల ప్రాజెక్టులు పూర్తి చేశాడ‌ని ఇవాళ ప్ర‌ధాన మీడియా వెల్ల‌డిస్తోంది. తద్వారా 26.80 ల‌క్ష‌ల రూపాయ‌లు ఆర్జించాడు. అంతేకాదు ఉక్రైన్ క్రైసెస్ ఫండ్ కు త‌న త‌ర‌ఫున 35వేల రూపాయ‌ల విరాళాన్ని అందించి మాన‌వ‌త‌ను చాటాడు.