Begin typing your search above and press return to search.

చిన్నారిపై అత్యాచారం.. 103 ఏళ్ల వృద్ధుడికి 15 ఏళ్ల జైలుశిక్ష

By:  Tupaki Desk   |   19 March 2022 7:27 AM GMT
చిన్నారిపై అత్యాచారం.. 103 ఏళ్ల వృద్ధుడికి 15 ఏళ్ల జైలుశిక్ష
X
చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఓ 103 ఏళ్ల వృద్ధుడికి కోర్టు షాకిచ్చింది. 15 ఏళ్ల జైలు శిక్షతోపాటు 45వేల రూపాయల జరిమానా విధిస్తూ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కోర్టు న్యాయమూర్తి సుభద్ర తీర్పు వెలువరించారు.

తిరువళ్లూరు జిల్లా పూందమల్లికి చెందిన పరుశురామన్ (103) విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు. ఇతడి ఇంట్లో ఓ ప్రైవేటు ఉద్యోగి భార్యా పిల్లలతో కలిసి అద్దెకు ఉండేవాడు.

ఈ నేపథ్యంలో 2018లో ఇంట్లో ఆడుకుంటున్న పదేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పిన పరుశురామన్ ఒంటరిగా తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. తల్లిదండ్రులకు చెబితే హత్య చేస్తానని బెదిరించాడు.

అయితే ఆ బాలికకు రెండు రోజుల తర్వాత ఆరోగ్య సమస్యలు రావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వైద్యశాలకు తీసుకెళ్లి పరీక్షలు చేయించగా బాలికపై అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

అనంతరం బాధితులు అవడి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరుశురామన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేసు విచారణ తిరువళ్లూరు మహిళా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సాగుతోంది.

విచారణ పూర్తయిన నేపథ్యంలో న్యాయమూర్తి సుభద్ర తీర్పు వెలువరించారు. బాలికపై లైంగికదాడికి దిగిన పరుశురామన్ కు 15 ఏళ్ల జైలు శిక్షతోపాటు 45 వేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరునెలలు అదనంగా శిక్షను అనుభవించాలని న్యాయమూర్తి ఆదేశించారు.