Begin typing your search above and press return to search.

అక్కడ ఆ పార్టీ గెలిస్తే ఫ్రీగా వాషింగ్ మెషీన్లు..

By:  Tupaki Desk   |   13 May 2016 12:26 PM IST
అక్కడ ఆ పార్టీ గెలిస్తే ఫ్రీగా వాషింగ్ మెషీన్లు..
X
దూకుడు రాజకీయాలు మొదలయ్యాక అధికారమే ప్రధానమైంది తప్పించి విలువలు.. ప్రజాసంక్షేమం లాంటివి ఎవరికి పట్టటం లేదు. పవర్ లోకి వచ్చేందుకు వెనుకా ముందు చూసుకోకుండా హామీలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకూ ఎన్నికల సమయంలో ఉచితంగా టీవీలు ఇచ్చే వరకూ వెళ్లటం తెలిసిందే. తాజాగా.. తమిళనాడులో అధికారపక్షం ప్రకటించిన ఉచిత తాయిలాలు (మహిళలకు 50 శాతం రాయితీతో స్కూటర్ వగైరా) రేంజ్ లోనే పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికల్లోనూ ఉచిత హామీలతో అదరగొట్టేస్తున్నారు.

తమ పాలన మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న విషయాన్ని సర్వేలు వెల్లడిస్తున్న సమయంలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి తాజాగా ప్రకటించిన ఎన్నికల హామీలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తాము కానీ అధికారంలోకి వస్తే.. ప్రతి ఒక్కరికి వాషింగ్ మెషీన్లు ఇస్తామంటూ ఆయన ప్రకటించారు. అంతేకాదు.. ఉచితంగా సెట్ ఆప్ బాక్సుల పంపిణీతో పాటు.. విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇస్తామని హామీ ఇస్తున్నారు.

ఎన్నికలకు మూడురోజుల ముందు తన ఎన్నికల హామీని ప్రకటించిన రంగస్వామి ఇస్తున్న తాయిలాలు కొత్త తరహా రాజకీయానికి తెర తీసినట్లుగా ఉందని చెబుతున్నారు. నిత్యవసరాలను ఉచితంగా ఇస్తామన్న స్థాయి నుంచి కొందరికి మాత్రం నిత్యవసరమని భావించే వాషింగ్ మెషీన్లను కూడా ఉచితంగా ఇస్తామని ప్రకటించటం ఏమిటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రంగస్వామి విడుదల చేసిన ఎన్నిక హామీల్ని చూస్తే..

= ఉచితంగా వాషింగ్ మెషీన్.. సెట్ టాప్ బాక్స్.

= ఇప్పుడు నెలకు ఇస్తున్న 10 కేజీల బియ్యం స్థానే 20 కేజీలు.. 5 కేజీల గోధుమలు.

= ఇళ్లు లేని వారికి ఉచిత ఇల్లు లేదంటే ఇంటి స్థలం.

= పదో తరగతి నుంచి ప్లస్ టూ విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ లు.

= విద్యారుణాలు వడ్డీతో సహా ప్రభుత్వమే చెల్లించటం.

= ఉద్యోగులకుఏడో వేతన సంఘం సిఫార్సులు.. సమరయోధుల పింఛన్ ను రూ.10వేలకు పెంపు.