Begin typing your search above and press return to search.

ఓడినా వైఖరి మార్చుకోని టీ కాంగ్రెస్

By:  Tupaki Desk   |   6 Feb 2019 8:21 AM GMT
ఓడినా వైఖరి మార్చుకోని టీ కాంగ్రెస్
X
తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెల్సిందే. ఈ ఓటమిపై టీపీసీసీ పోస్టుమార్టం నిర్వహించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి నివేదించారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటమికి టీ కాంగ్రెస్ నేతల వైఖరే కారణమైనా రాహుల్ వద్ద మాత్రం ఓటమికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడే అని వారు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

తొలుత టీ కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగ్గే కారణమని అరిచి గగ్గోలు పెట్టారు. ఇలాంటివి ప్రజలను నమ్మించడానికి బాగుంటుందని.. కానీ రాహుల్ వద్ద చెబితే కామెడీగా ఉంటుందని ఈ కారణాన్ని చెప్పలేదని వినికిది. ఆ తరువాత టీఆర్ ఎస్ డబ్బులు పంచడం వల్లే కాంగ్రెస్ ఓడిందని చెప్పారట. అందుకు రాహుల్ మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ లో బీజేపీ భారీగా డబ్బులు పంచినా ఓడింది కదా అని ప్రశ్నించారట.. దీంతో ఓటమికి అంతిమంగా టీ కాంగ్రెస్ నేతలు సారీ చెప్పారని తెల్సింది.

మరికొందరు నేతలు రాహుల్ తో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీగా టీ కాంగ్రెస్ ఎలాంటి ఉద్యమాలు చేయలేదని దీని వల్లే ఓడిపోయిందని తేల్చారు. ఇంకొందరు తెలంగాణలో చంద్రబాబు నాయుడు ప్రచారం చేయడం వల్ల ఓటమి పాలయ్యామని చెప్పారట. ఎన్నికల పోరాటం చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ గా మారటం వల్ల ఫలితం వ్యతిరేకంగా వచ్చిందని రాహుల్ కు వివరించేందుకు ప్రయత్నించగా ఆయన ఆసక్తి కనబర్చలేదని సమాచారం.

ప్రస్తుతం రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడు బాగా దగ్గరైపోయారు. రాహుల్ కు పలు విషయాల్లో సలహాలు ఇస్తూ మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇక రాహుల్ ను కలిసినప్పుడల్లా శాలువాలు, సత్కారాలతో ఆకట్టుకుంటున్నారు. దీంతో రాహుల్ కూడా ఆయన పట్ల ఫిదా అయిపోయారు. దీంతో బాబు విషయంలో ఆయన స్పందించకుండా మిన్నకుండిపోతున్నారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు కాంగ్రెస్ తో దోస్తీ చేస్తూనే ఆ పార్టీ నేతలను తనవైపు తిప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడిని అంతలా నమ్ముతున్న రాహుల్ గాంధీని సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏం చేస్తారో చూడాలి. అవసరం ఉన్నంత వరకు వాడుకోని అవసరం తీరాక కరివేపాకులా పక్కకు పడేసే బాబు పట్ల రాహుల్ కొంత జాగ్రత్తగా ఉండాలని పలువురు కాంగ్రెస్ నేతలు ఆయన హితవు పలుకుతున్నారట. చూడాలి మరీ రాహుల్ గాంధీ ఏం చేస్తారో..