Begin typing your search above and press return to search.

జగన్ కంటే రాహులే స్పీడు

By:  Tupaki Desk   |   24 July 2015 9:43 AM GMT
జగన్ కంటే రాహులే స్పీడు
X
ఆంధ్రప్రదేశ్ లో యాత్రలకు ట్రేడ్ మార్కు వైసీపీ నేత జగన్... ఆయన ఓదార్పు యాత్ర తెలుగు టీవీ సీరియల్ లా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయనకు వీలున్నప్పుడు వీలున్న చోట ఓదార్పు యాత్ర చేస్తుంటారు. తన తండ్రి వైఎస్ మృతితో గుండె పగిలి చనిపోయినవారి కుటుంబాలకు సాయం చేసేందుకు చేపట్టిన ఈ ఓదార్పు యాత్ర ఏళ్లుగా ఏపీలో కొనసాగుతోంది. సందర్భం వేరైనా కానీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు దేశంలో పాదయాత్ర చేస్తున్నారు. మృతిచెందిన రైతుల కుటుంబాలను ఆయన తన పాదయాత్రలో భాగంగా పరామర్శించి సాయం చేస్తున్నారు.

అయితే... జగన్, రాహుల్ గాంధీలిద్దరూ యువనేతలే. జగన్ పై ఏపీలో చాలా మందిలో హోప్స్ ఉండగా.. రాహుల్ పైనా చాలాకాలంగా దేశంలో అంచనాలున్నా మొన్నటి ఎన్నికలతో అవన్నీ పటాపంచలయ్యాయి. అయితే.. ఆయన మళ్లీ ఇమేజి బిల్డప్ చేసుకోవడానికి.. నాయకుడిగా పార్టీలో, ప్రజల్లో స్థానం సంపాదించుకోవడానికి కష్టాలు పడుతున్నారు. అందులో భాగమే ఈ పాదయాత్ర. రాహుల్ మన రాష్ట్రంలోని అనంతపురంలో పది కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు.

శుక్రవారం ఉదయం సుమారు 10 గంటలకు మొదలైన రాహుల్ పాదయాత్ర మధ్యాహ్నానికి ముగించారు. ఓబుల‌దేవ‌ర‌చెరువు నుంచి కొండ‌క‌మ‌ర్ల‌ వరకు పది కిలోమీటర్ల దూరాన్ని అవలీలగా నడిచిన కాంగ్రెస్ యువనేత మార్గమధ్యంలో 45 రైతు కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. వారికి చెక్కులిచ్చారు. అంతేకాదు.. పాదయాత్ర మార్గంలో ఉపాధి కూలీలు, డ్వాక్రా మ‌హిళ‌ల‌తో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు.

మొత్తానికి రాహుల్ గాంధీ ఇదంతా సుమారు 4 గంటల సమయంలోనే పూర్తి చేయగలిగారు. కొద్ది గంటల్లోనే 10 కిలోమీటర్లు నడవడంతోపాటు, 45 కుటుంబాలను పరామర్శించడం చూస్తుంటే జగన్ ఓదార్పు యాత్ర కంటే రాహుల్ పాదయాత్ర వెయ్యి రేట్టు వేగంగా సాగిందని అర్థమవుతుంది. దీంతో కాంగ్రెస్ నేతలు రాహుల్ జగన్ కంటే చాలా స్పీడని అంటున్నారు.