Begin typing your search above and press return to search.

బాబులా రాజీ పడటం జగన్ కు అస్సలు చేతకాదట

By:  Tupaki Desk   |   13 Jan 2020 4:43 AM GMT
బాబులా రాజీ పడటం జగన్ కు అస్సలు చేతకాదట
X
తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పని తీరు చాలా కొద్ది మందిలో ఉంటుంది. ఇవాల్టి రాజకీయాల్ని చూస్తే.. తప్పు చేసినోడు తనోడైతే చాలు.. ఎంత రచ్చ జరిగినా చర్యలు తీసుకోవటానికి ససేమిరా అనటం కామన్ గా మారింది. అందుకు భిన్నంగా.. తప్పు చేస్తే.. ఎంతటి వారినైనా ఉపేక్షించేదే లేదన్న విషయాన్ని తన చేతలతో చెప్పేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

తానెంతో అభిమానించి .. అక్కునచేర్చుకున్న సినీ నటుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాలిరెడ్డి పృథ్వీరాజ్ చేసిన తప్పు తెర మీదకు వచ్చినంతనే మరో మాటకు తావివ్వకుండా కరకుగా వ్యవహరించిన జగన్ తీరును ఇప్పుడు పలువురు ప్రశంసిస్తున్నారు. ఒక ఉద్యోగిని లో సరసంగా మాట్లాడారంటూ ఒక ఆడియో క్లిప్ బయటకు రావటం.. దాన్నో ఛానల్ ప్రసారం చేయటంతో మొదలైన ఇష్యూ పెరిగి.. పెద్దది కాకముందే చర్యల కత్తిని తీసేసి.. ఇష్యూను క్లోజ్ చేయటం ద్వారా సొంత వారికి సైతం తన చేతలతో క్లియర్ వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి.

తాను తప్పు చేయ లేదని.. విచారణ ముగిశాక మళ్లీ తాను ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తానని పృథ్వీ చెప్పినా.. అదంత తేలికైన విషయం కాదని చెప్పాలి. కేవలం ఆర్నెల్ల వ్యవధి లోనే కీలకమైన చానల్ ఛైర్మన్ బాధ్యతలకు రాజీనామా చేయటం వెనుక సీఎం జగన్ ఉన్నారని చెప్పక తప్పదు. పాదయాత్ర వేళ నుంచి తన వెనకే ఉన్న పృథ్వీ విషయంలో జగన్ ప్రదర్శించిన అభిమానం కారణంగానే ఆయనకు కీలక పదవి దక్కిందని చెప్పాలి. అయితే.. అవకాశమిస్తే.. దాన్ని దుర్వినియోగం చేస్తే తిప్పలు తప్పవన్న వైనాన్ని తన తాజా నిర్ణయంతో జగన్ స్పష్టం చేసినట్లే.

చంద్రబాబు హయాం లో తహిసిల్దార్ వనజాక్షి పై నాటి ఎమ్మెల్యే చింతమనేని దుర్మార్గం గా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవటానికి నాటి సీఎంకు చేతులు రాలేదు. తాను బాబు మాదిరి కానని.. అభిమానిస్తే ఎంతటి అందలమైనా ఎక్కిస్తానని.. అదే సమయంలో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా తేడా చేస్తే ఎలా ఉంటుందన్న విషయాన్ని జగన్ తన తాజా నిర్ణయంతో చెప్పేశారని చెప్పాలి. నమ్మినోళ్లపై అభిమానాన్ని మాత్రమే కాదు.. నమ్మకాన్ని వమ్ము చేసిన వారిపైనా ఆగ్రహపు వేటు ఎంతలా పడుతుందన్నది సీఎం జగన్ తన తాజా నిర్ణయంతో చెప్పేవారని చెప్పక తప్పదు.