Begin typing your search above and press return to search.

గ్రీష్మ దెబ్బకు జగన్ పరివారానికి మర్యాద గుర్తుకొచ్చిందండోయ్

By:  Tupaki Desk   |   29 May 2022 11:48 AM GMT
గ్రీష్మ దెబ్బకు జగన్ పరివారానికి మర్యాద గుర్తుకొచ్చిందండోయ్
X
వజ్రాన్ని వజ్రంతో కోయాలంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏపీ రాజకీయాల్లో నెలకొంది. దివంగత మహానేత వైఎస్ తో మొదలైన దూకుడు రాజకీయాలు ఆయన పుత్రరత్నం జగన్ హయాంలో ఏ స్థాయికి వెళ్లిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ ప్రత్యర్థులను ఉద్దేశించి ఏమైనా అంటాం.. ఎన్నైనా అంటాం. కానీ.. తమను మాత్రం కించిత్ మాట అన్నా.. విలువల గురించి మాట్లాడే సిత్రమైన తీరు వారిలో కనిపిస్తుంటుంది. మర్యాదస్తుల మధ్య వెనుకా ముందు మాట్లాడే వాడు ఒకడు వస్తే ఎలా ఉంటుందో జగన్ పరివారం తీరు అలానే ఉంటుంది.

నోటికి పని చెప్పటమే తప్పించి.. మర్యాద అన్నది మిస్ కావటం మొదట్నించి ఉన్నదే. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తర్వాత అధికారంలో ఉన్న చంద్రబాబును.. ఆయన కుమారుడు లోకేశ్ ను ఉద్దేశించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు.. చేసిన విమర్శలు అన్ని ఇన్ని కావు. అన్నింటికి మించి లోకేశ్ ను చౌకబారుగా చిత్రీకరించేందుకు వారు పడిన అవస్థలు అన్ని ఇన్ని కావు. ఇక.. జగన్ కు అత్యంత సన్నిహితుడైన విజయసాయి రెడ్డి విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిపైనా.. ఆయన కుమారుడి పైనా దారుణ దూషణల్ని సంధిస్తూ చేతికి వచ్చినట్లుగా రాతలు రాసి డ్యామేజ్ చేస్తున్నప్పుడు.. ఈ కొత్త తరహా నిందాపర్వం అర్థం కావటానికి తెలుగుదేశం నేతలకు కాస్త సమయం పట్టింది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో అత్యద్భుత విజయం సాధించిన తర్వాత జగన్ మంత్రులు పలువురు నోటికి పని చెప్పిన వైనం కావొచ్చు.. ఈ మధ్యనే నిండు అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావొచ్చు.. ఆ మధ్యన వల్లభనేని వంశీ.. మాజీ మంత్రి కొడాలి నాని నోటి నుంచి వచ్చే బూతులు.. ఏపీ రాజకీయాల్లో నేతలకు అవసరమైన ప్రాథమిక లక్షణం ఏమిటన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసింది. మర్యాదస్తులకు ఏ మాత్రం చోటు లేని ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రాణించాలంటే నోటికి పని చెప్పే విషయంలో ప్రతిభ ఉన్న వారికి మాత్రమే సాధ్యమన్న పరిస్థితి.

జగన్ పరివారాన్ని.. వారి నోటికి ఉండే దురుసు.. మాటల్లో మిస్ అయ్యే మర్యాదను పుణికి పుచ్చుకుంటే తప్పించి మరో మార్గం లేదన్నట్లుగా పరిస్థితి మారింది. ఒక్కో కాలంలో ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. దాన్ని సరిగ్గా పట్టుకొని.. అప్డేటెడ్ వెర్షన్ తో మహానాడుకు హాజరైన టీడీపీ మహిళా నేత గ్రీష్మ (సీనియర్ నేత ప్రతిభాభారతి కుమార్తె) తన ఒక్క స్పీచ్ తో జగన్ బ్యాచ్ కు దిమ్మ తిరిగే షాకిచ్చారు. తెలుగు రాజకీయాల్లో తమకు మాత్రమే వచ్చిన భాషను.. తమకు మరింత బాగా అర్థమయ్యేలా మాట్లాడిన ఆమె మాటలు ఇప్పుడు వారి చేత హాహాకారాలు చేయిస్తున్నాయి.

అనిల్ కుమార్ యాదవ్.. కొడాలి నాని.. పేర్ని నాని.. వల్లభనేని వంశీ.. విజయసాయి రెడ్డి.. అంబటి రాంబాబు.. ఆర్కే రోజా.. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ బ్యాచ్ లో ఇలాంటి నోటి దూకుడు నేతలు చాలామందే కనిపిస్తారు. మైకు చేతికి అందితే చాలు.. వెనుకా ముందు చూసుకోకుండా ఊర మాస్ మాటలతో ప్రత్యర్థులను నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తారు. ఇంట్లో అందరూ కూర్చొని టీవీ చూస్తున్న వేళ.. పొరపాటున న్యూస్ చానల్ పెడితే.. వీరు మాట్లాడే మాటల్ని వింటే.. పిల్లలు ఎక్కడ పాడైపోతారో అన్న భయంతో రిమోట్ తో చానల్ వెంటనే మార్చేసే పరిస్థితి.

అలాంటి జగన్ బ్యాచ్ కు ఇప్పుడు టీడీపీ మహిళా నేత గ్రీష్మ కొత్తగా మారారు. ఇంతకాలం వైసీపీ నేతల నోటి దూకుడు ముందు టీడీపీ నేతల మర్యాద మాటలు ఒక పట్టాన నిలిచేవి కాదు. నువ్వెంత? అంటే నువ్వెంత? అన్న రీతిలో నువ్వు రెండు బూతులు తిడితే.. నేను ఇరవైరెండు బూతులు తిట్టేస్తా.. ఏనీ సెంటర్.. సింగిల్ హ్యాండ్.. గ్రీష్మ అన్న రీతిలో మహానాడులో చెలరేగిపోయిన ఆమె స్పీచ్ తో జగన్ పరివారానికి ఇప్పుడు అర్జెంట్ గా మర్యాద గుర్తుకు వచ్చింది.

ఎలాంటి కుటుంబం నుంచి వచ్చి ఎలా మాట్లాడుతుందో చూశారా? ఆమె మాటలు మరీ ఇంత ముతగ్గా ఉండటమా? రామ.. రామ.. అంటూ వైసీపీ నేతలు.. ఆ పార్టీ సానుభూతిపరులు తీస్తున్న రాగాలు వింటే.. జగన్ బ్యాచ్ కు వారి గురించి వారిని చూపించేస్తే ఇంతలా హడలిపోతారన్న మాట అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గ్రీష్మ స్పీచ్ కు హాహాకారాలు చేస్తున్న వైసీపీ పరివారం.. కొడాలి నాని.. వల్లభనేని వంశీ.. అనిల్ యాదవ్.. పేర్ని నాని.. లాంటి వారి వీడియోలు యూట్యూబ్ లో చూస్తే మంచిదన్న సలహా ఇస్తున్నారు.