Begin typing your search above and press return to search.

పోలవరం... కొత్త ప్రభుత్వానిదే భారం!

By:  Tupaki Desk   |   2 Jun 2023 10:00 AM GMT
పోలవరం... కొత్త ప్రభుత్వానిదే భారం!
X
పోలవరం ప్రాజెక్ట్ అన్న ఆలోచనకు వయసు ఎనభై మూడేళ్ళుగా చెబుతారు. 1940 ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ ఆలోచన పుట్టింది. అది మరో నలభై ఏళ్ళకు అంటే 1980 నాటికి నాటి ఉమ్మడి ఏపీ సీఎం టీ అంజయ్య చేతుల మీదుగా పునాది రాయి దాకా వచ్చింది. అక్కడికి మరో పాతికేళ్ళకు వైఎస్సార్ సీఎం అయ్యాక కదలిక వచ్చింది. వైఎస్సార్ బతికుంటే పూర్తి అయ్యేదేమో కానీ అలా జరగలేదు. దాంతో పోలవరం ప్రారబ్దం ఏంటో కానీ అక్కడ నుంచి మరో రెండు దశాబ్దాలను ఈజీగా నెట్టుకుని వచ్చేసింది.

చంద్రబాబు సీఎం గా ఉండగా డెబ్బై శాతం పనులు పోలవరానికి పూర్తి అయ్యాయని చెప్పారు. అయితే ఆర్ ఆర్ ప్యాకేజి అన్నది ఇక్కడ కీలకం. అదే గుదిబండ కూడా. పోలవరం నిర్మాణానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా ఆర్ ఆర్ ప్యాకేజీకే ముప్పయి నుంచి ముప్పయి అయిదు వేల ఖర్చు ఉంది. దాంతోనే ఇపుడు ఈ ప్రాజెక్ట్ ఇబ్బందులో పడుతోంది.

పోలవరం ప్రాజెక్ట్ ని ఫేజ్ వన్ ని అంటే 41.15 మీటర్ల ఎత్తు వరకూ నిర్మించడం కోసం డెడ్ లైన్ 2025 జూన్ దాకా వైసీపీ ప్రభుత్వం పెట్టేసింది. గతంలో పోలవరం మీద సమీక్ష జరిగినపుడు 2024 జూన్ అన్నారు. ఇపుడు మరో ఏడాది పెంచేశారు అన్న మాట.

మొదటి దశ పూర్తి కావడానికి అక్కడ వరకూ ఉన్న గ్రామాల ప్రజలకు పునరావాస ప్యాకేజి కోసం అడహాక్ నిధులుగా 17 వేల 414 కోట్ల రూపాయల సాయాన్ని కేంద్రాన్ని ఏపీ సర్కార్ కోరింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన మీటింగులో ఈ నిధులను ఇచ్చేందుకు ఆయన అంగీకరించారని కూడా రాష్ట్ర జలవనరుల అధికారులు చెబుతున్నారు

అయితే ఈ నిధులు కేంద్రం చెప్పినట్లుగా ఇచ్చినా తొలిదశ నిర్మాణం పనులు పూర్తి అయ్యేటప్పటికి 2025 జూన్ వచ్చేస్తుంది అని అంటున్నారు. ఇక చూస్తే 2024లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగనున్నాయి. అంటే ఎలా చూసుకున్నా కొత్త ప్రభుత్వం మీదనే పోలవరం భారం పడనుంది అని అంటున్నారు.

వైఎస్ కుమారుడిగా పోలవరం తన హయాంలోనే జగన్ పూర్తి చేస్తారు అని వైసీపీ మంత్రులు నేతలు చెప్పేవారు. ఇపుడు మారిన డేట్, కొత్త డెడ్ లైన్ చూస్తుంటే మరోసారి జగన్ అధికారంలోకి వస్తే తప్ప పోలవరాన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమం ఉండదేమో అని అంటున్నారు. ఏది ఏమైనా పోలవరం ఏపీకి వరం అనుకున్నా ఆ ప్రాజెక్టుకే ఏవో శాపాలు పాపాలు తగులుతున్నాయని అంతున్నారు. అందుకే శతాబ్దలా కాలం అవుతున్నా మోక్షం లేకుండా పోతోంది అని అంటున్నారు.