Begin typing your search above and press return to search.

సర్వే వివరాల మీద కాకుండా సర్వే సంస్థ మీద పేర్ని నాని ఫైర్

By:  Tupaki Desk   |   14 July 2022 10:08 AM IST
సర్వే వివరాల మీద కాకుండా సర్వే సంస్థ మీద పేర్ని నాని ఫైర్
X
రాజకీయ నేతలు రెండు రకాలుగా ఉంటారు. వాస్తవాన్ని ఒప్పుకోవటం.. అందుకు భిన్నంగా కింద పడ్డా తమదే పైచేయి అని మొండిగా వాదించటం. సౌమ్యుడిగా పేరున్న కొందరు నేతలు సైతం ఈ మధ్య కాలంలో మారిన రాజకీయ ముఖచిత్రానికి తగ్గట్లుగా తమ తీరును మార్చేసుకుంటున్నారు. ఆ కోవలోకే వస్తారు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని. జగన్ కు వీర విధేయుడైన ఆయన.. తమ రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడేందుకు తెగ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు.

టీడీపీ అధినేత చంద్రబాబును మిగిలిన నేతల మాదిరే ఫైర్ అయ్యే ఆయనలో మరో గుణం ఏమంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరెత్తితే చాలు.. ఆయన మాటల ప్రవాహం ఆగకుండా సాగుతుంది. అదే పనిగా పవన్ మీద ఆయన చేసే వ్యాఖ్యలు.. డ్యామేజింగ్ గానే కాదు.. జనసేన క్యాడర్ కు ప్రధమ శత్రువుగా ఆయన మారటంలో పేర్ని నాని మాటలే కీలకమయ్యాయని చెప్పక తప్పదు.

వైసీపీ ప్లీనరీ అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు.. కొన్ని సర్వే రిపోర్టులు బయటకు వచ్చి.. వైఎస్ గ్రాఫ్ తగ్గిందంటూ వెల్లడైన వైనంపై తాజాగా ఆయన స్పందించారు. సదరు సర్వే రిపోర్టులో చెప్పిన అంశాలపై వివరణ కంటే కూడా.. సదరు సర్వే వెల్లడించిన సంస్థ మీద ఆయన విరుచుకుపడ్డారు.ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ తగ్గిపోతుందంటూ సెంటర్ ఫర్ నేషనల్ స్టడీస్ సంస్థపై పేర్ని నాని విరుచుకుపడ్డారు.

సదరు సంస్థ టీడీపీ జీతగాడు రాబిన్ శర్మదేనని.. టీడీపీని కాపాడుకోవటానికి చేయించిన సర్వేగా అభివర్ణించారు. ఈ కారణంతోనే సర్వే రిపోర్టును ఆ తీరులో ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు. పవన్ తో టీడీపీ గ్రాఫ్ పెంచుకోవాలని చంద్రబాబు అనుకున్నారని.. అది సాధ్యం కాకపోవటంతో ఇలా సర్వేలను నమ్ముకున్నారన్నారు.

తండ్రీ కొడుకులు ఎంతలా లేపాలని చూస్తున్నా.. పార్టీ గ్రాఫ్ లేవటం లేదని.. అందుకే జీతగాళ్లను పెట్టుకొని.. వారిచ్చే సర్వేలతో ఆనందపడిపోతున్నట్లు మండిపడ్డారు.

జగన్ గ్రాఫ్ ను ఎవరూ తగ్గించలేరని.. ఇలాంటి సర్వే రిపోర్టులు ఏం చేయవన్న పేర్ని నాని వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఏమైనా చంద్రబాబును తిట్టే వేళలో.. ఏదోలా పవన్ ప్రస్తావన తెచ్చి.. మరీ ఏసుకోవటం పేర్ని నాని స్పెషాలిటీగా చెప్పక తప్పదు.