Begin typing your search above and press return to search.

బిగ్ నంబర్ తో పవన్...తమ్ముళ్ళకు తడిసిపోతోందిట...!

By:  Tupaki Desk   |   21 May 2023 1:12 PM GMT
బిగ్ నంబర్ తో పవన్...తమ్ముళ్ళకు తడిసిపోతోందిట...!
X
పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా రాజకీయం బాగానే చేస్తున్నారు. పవన్ కి ఏమీ తెలియదు అని చాలా మంది అనుకోవచ్చు. కానీ పవన్ అతి తక్కువ సమయంలోనే రాజకీయం నేర్చేశారు. ఆయన చంద్రబాబుతో చెట్టాపట్టాలు వేసుకునేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. చాలా మంది మాత్రం బాబుది దృత రాష్ట్ర కౌగిలి. ఆ పొత్తులతో జనసేన నలిగిపోతుంది అని చెబుతున్నారు.

కానీ పవన్ మాత్రం మాకేమీ తెలియదు అనుకుంటున్నారా. మేము చిన్న పిల్లలమా అని ఇటీవల మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలోనే చెప్పుకొచ్చారు. అంటే బాబు కంటే తాను నాలుగాకులు ఎక్కువ చదివాను తనకు కూడా ఎత్తులు పై ఎత్తులు తెలుసు అని పవన్ అంటున్నారన్న మాటేగా.

ఇదిలా ఉంటే పవన్ పొత్తులు సీట్ల రాయబేరాలు అన్నీ కూడా మహా భారతంలో పాండవులు అయిదూళ్ళు ఇవ్వమంటూ కోరినట్లుగానే ఉందని అంటున్నారు. అయిదుళ్ళూ అంటే అవన్నీ మొత్తం ఆనాటి దేశంతో సమానం. ఇపుడు పవన్ కూడా మాకు బలమున్న చోటనే సీట్లు అంటున్నారు. అవన్నీ కలిపి కూడితే టీడీపీ కంచుకోటలలో జనసేన తిష్ట వేసేలాగానే సీన్ ఉందని అంటున్నారు.

పవన్ చెబుతున్నది చూస్తే ఆయన సీట్ల కంటే ముందు ఓట్ల ప్రస్థావనను తెలివిగా తెచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలలో 36 శాతం ఓటు బ్యాంక్ జనసేనకు ఉందని అన్నారు. అంతే కాదు అటు క్రిష్ణా నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లా వరకూ చూసుకుంటే ప్రతీ జిల్లాలో సగటున పాతిక శాతం ఓటు బ్యాంక్ ఉందని కూడా చెప్పుకొచ్చారు.

అదే సమయంలో రాయలసీమ సహా ఏపీ మొత్తం ఏవరేజి గా చూస్తే 18 శాతం ఓటు బ్యాంక్ ఉందని అంటున్నారు. వీటిని అన్నింటినీ చూసుకుంటే జనసేన ఈ ఓట్ల శాతాన్ని చూపించి బిగ్ నంబర్ నే పొత్తులలో భాగంగా టీడీపీ నుంచి డిమాండ్ చేయబోతోంది అని అంటున్నారు.

జనసేన డిమాండ్ చేయబోయే సీట్లు ఎలా ఉంటాయని ఒక అంచనాగా చూస్తే కనుక ఉభయ గోదావరి జిల్లాల నుంచి పది సీట్లు, ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి మరో ఎనిమిది సీట్లు, అలాగే కోస్తా జిల్లాల్లో మరో పది సీట్లు, ఇక రాయలసీమలో మరో పది సీట్లు ఇలా చెప్పుకుంటూ పోతే 45 సీట్లకు తక్కువ కాకుండా పవన్ టీడీపీ నుంచి డిమాండ్ పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇంత పెద్ద నంబర్ అందునా టీడీపీకి పట్టున్న గోదావరి, ఉత్తరాంధ్రా కోస్తా జిల్లాలలో ఇచ్చేసుకుంటే తమ్ముళ్లకు మిగిలేది తడిగుడ్డ అని అంటున్నారు. ఇక ఇక్కడితో ఈ పొత్తు కధ ఆగడంలేదు. పవన్ తనతో పాటు బీజేపీని కూడా తీసుకుని వస్తానని అంటున్నారు. ఆ పార్టీకి ఎలా చూసుకున్నా పదిహేను సీట్లకు తక్కువ లేకుండా ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.

అంటే ఓవరాల్ గా పొత్తులలో భాగంగా అరవై సీట్లను తెలుగుదేశం అర్పించేసుకోవాల్సిందే అన్న మాట. ఇవన్నీ కూడా గెలిచే సీట్లు, టీడీపీకి బలమున్న సీట్లు, గట్టి నాయకులు ఉన్న సీట్లు, ఇలా తమ ఆస్తిగా దశాబ్దాలుగా కాపాడుకుంటున్న సీట్లను పొత్తు పేరుతో దారాదత్తం చేస్తే తామేమి చేయాలని తమ్ముళ్ళు అపుడే బుర్ర గోక్కుంటున్నారుట. ఇక చంద్రబాబు తీరు చూస్తే ఈసారి కచ్చితంగా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు.

దాంతో కాస్తా ఉదారంగా వ్యవహరిస్తారు అని అంటున్నారు. అంటే పవన్ నలభై అయిదు అంటో అటుగానో ఇటుగానో సీట్లు ఇచ్చేసేటట్టే కనిపిస్తోందిట. మరి బీజేపీకి సీట్లు ఇచ్చుకుపోతే తమ్ముళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం ఏంటి అంటే అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని ఒక పొడి హామీ మాత్రం దక్కే చాన్స్ ఉంది అంటున్నారు. దీంతో తమ్ముళ్లలో ఎక్కడ లేని టెన్షన్ పెరిగిపోతోందిట.

తమకు పదవి లేని చోట, మరో పార్టీకి పల్లకీ మోసి అక్కడ తమ పార్టీని పలుకుబడిని అంతా సమర్పించేసుకున్న తరువాత ఇక రాజకీయం ఎందుకు తమకు ఎందుకీ కంచి గరుడ సేవ అని కూడా కొందరు తమ్ముళ్లలో వైరాగ్య భావాలు కలుగుతున్నాయట. ఏది ఏమైనా జనసేన్ పొత్తు పవన్ కళ్యాణ్ పెద్ద నంబర్ తో రెడీగా ఉన్నారన్న వార్తలు తమ్ముళ్లకు తెగ కలవరం పెడుతున్నాయట.