Begin typing your search above and press return to search.

జూన్ లో ప్రచారం.. పవన్ సినిమాల సంగతేంటి?

By:  Tupaki Desk   |   12 May 2023 12:44 PM GMT
జూన్ లో ప్రచారం.. పవన్ సినిమాల సంగతేంటి?
X
మంగళగిరిలో జరిగిన విలేకరుల సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎవరికి వారు తమకు తోచిన వాదనల్ని వినిపిస్తున్న నేపథ్యంలో.. రాజకీయం ఒక్కసారిగా హాట్ హాట్ గా మారింది. అదే సమయంలో సినిమా ఇండస్ట్రీలోనూ పవన్ వ్యాఖ్యలు కొత్త చర్చకు తెర తీశాయి.

జూన్ నుంచి తాను రాష్ట్రంలో పర్యటిస్తానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు.. ఆయన చేస్తున్న సినిమాల భవిష్యత్తు ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.

సాధారణంగా పవన్ కల్యాణ్ ఎప్పుడు ఒకటి తర్వాత ఒకటి చొప్పున చేస్తారే కానీ.. వరుసపెట్టి సినిమాలు చేయటం కనిపించదు. ఒకట్రెండు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆయన ఒకే టైంలో రెండు.. మూడు సినిమాలు చేసిన పరిస్థితి.

అందుకు భిన్నంగా ఒక సినిమా చేస్తూనే.. మరో మూడు సినిమాల్ని పట్టాలెక్కించిన మొదటి సందర్భం ఇదేనన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. పవన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్ని చూస్తే.. 'బ్రో'లో పవన్ పార్టు పూర్తి అయినా.. పూర్తి చేయాల్సిన పనులు.. సినిమా రిలీజ్ కు అవసరమైనవిచాలానే ఉన్నాయి. ఇవి కాకుండా హరిహర వీర మల్లు.. ఓజీ.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి.

ఈ సినిమాలన్ని కూడా వచ్చే ఎన్నికల నాటికి పూర్తి అయి.. బ్యాక్ టు బ్యాక్ విడుదలయ్యేలా ప్లానింగ్ ఉంది. దీనికి తగ్గట్లు షెడ్యూల్ సిద్దం చేసుకున్నారు. అయితే.. అనూహ్యంగా జూన్ ను ఏపీ వ్యాప్తంగా పర్యటనలు ఉన్నట్లు చెప్పిన పవన్ మాటల్ని చూస్తే.. ఆయనసినిమా షూటింగ్ లకు ప్రస్తుతానికి సెలవు ఇచ్చేసినట్లేనా? అన్నది సందేహం మారింది.

మరోవైపు.. నాలుగైదు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల వేళలోనే ఏపీలోనూ ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నారా? ముందస్తుకు ఆయన మొగ్గు చూపుతున్నట్లుగా మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో పవన్ తాజా వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ఒకవేళ.. జూన్ నుంచి పవన్ పర్యటనలు మొదలు పెడితే ఆయన సినిమా షూటింగ్ లు ఆగిపోయే అవకాశం ఉందంటున్నారు.