Begin typing your search above and press return to search.

పవన్ వన్ చాన్స్...జగన్ వన్ మోర్ చాన్స్.. బాబు లాస్ట్ చాన్స్!

By:  Tupaki Desk   |   17 Nov 2022 9:58 AM GMT
పవన్ వన్ చాన్స్...జగన్ వన్ మోర్ చాన్స్.. బాబు లాస్ట్ చాన్స్!
X
ఏపీ రాజకీయం ఇపుడు కీలక ఘట్టానికి చేరిందనే భావిస్తున్నారు విభజన ఏపీలో రాజకీయాలకు ఒక క్లారిటీ ఇచ్చే ఎన్నికగా 2024ను అంతా చూస్తున్నారు. వెటరన్ పొలిటీషియన్ గా చంద్రబాబు ఉన్నారు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ గా జగన్, పవన్ ఉన్నారు. చంద్రబాబు రాజకీయ అనుభవం అంత వయసు ఈ ఇద్దరికీ లేదు అని చెప్పాలి.

అయినా సరే తన తండ్రి తరం నాయకుడు అయిన చంద్రబాబుని ఢీ కొట్టి మరీ జగన్ 2019 ఎన్నికల్లో జనాల చేత జేజేలు అందుకున్నారు. తాను కోరుకున్న సీఎం కుర్చీని ఆయన అధిష్టించారు. అయితే ముమ్మారు సీఎం అయిన చంద్రబాబుకు కూడా ముఖ్యమంత్రి పీఠం మీద మోజు పోలేదు. ఇక కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన జనసేన అధినేత ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మార్పుని తీసుకుని వస్తారు అంటున్నారు.

ఆయన కూడా సీఎం సీటు మీదనే గురి పెట్టారు. ఇపుడు చూస్తే 2024 ఎన్నికలలో త్రిముఖ పోరు సాగుతుందా లేక పోత్తులతో యాంటీ వైసీపీ గ్రూప్ అంతా ఒక్కటి అయి ఢీ కొడుతుందా అన్నది చూడాలి. ఆ విషయం పక్కన పెడితే గతంలో ఎన్నడూ చూడని రాజకీయాలు మాత్రం 2024 ఎన్నికల్లో చూస్తారు అని అంటున్నారు. 2024 ఎన్నికలు ఏపీని మరో మలుపునకు తిప్పుతాయని అంటున్నారు.

ఇక్కడ ముందుగా చెప్పుకోవాల్సింది చంద్రబాబు గురించి. ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు. 1975 టైం లోనే ఆయన రాజకీయాల్లో ప్రవేశించారు. విద్యార్ధి నాయకుడిగా, తరువాత కాలంలో కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నేతగా బాబు ఉంటూ వచ్చారు. 1978లో ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అయ్యారు. 1980లో మంత్రి కూడా అయ్యారు. ఆ విధంగా చూసుకుంటే కనుక ఏపీ రాజకీయల్లో బాబు సీనియర్ మోస్ట్. అంతే కాదు, ఆయన అర్ధ దశాబ్దం పైగా రాజకీయ జీవితాన్ని చూసిన లీడర్ గా చెప్పుకోవాలి.

చంద్రబాబు మూడు పదుల వయసులో మంత్రి అయ్యారు. నాలుగున్నర పదుల వయసులో సీఎం అయ్యారు. ఇపుడు ఏడు పదులు దాటిన వయసులో నాలుగవసారి సీఎం కావాలని చూస్తున్నరు. బాబు రాజకీయం చూసిన వారు అంతా చెప్పే మాట ఒక్కటే ఆయనకు 2024 ఎన్నికలు కీలకమైనవి అని. ఎందుకంటే 2029 నాటికి ఆయన ఇపుడు ఉన్నంత చురుకుగా రాజకీయాల్లో ఉండకపోవచ్చు అని. దాన్ని టీడీపీ వారు ఎపుడూ ఖండిస్తూ ఉండేవారు. బాబు మరో పది పన్నెండేళ్ళు రాజకీయం ఈజీగా చేస్తారు అని కూడా వాదిస్తూ ఉంటారు.

కానీ ఇపుడు చంద్రబాబే తన గురించి చెప్పేసుకున్నారు. తనకు 2024 ఎన్నికలు చివరి ఎన్నికలు అని ఆయన ప్రకటించి ఏపీ రాజకీయాలలో సంచలనం రేపారు. ఆయన ఎందుకు ఈ ప్రకటన చేశారు అన్నది పక్కన పెడితే అది బూమరాంగ్ అయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయని ప్రత్యర్హ్దులు అంటున్నారు. మొత్తానికి బాబు సానుభూతి కోసమే లాస్ట్ చాన్స్ అని ఒక బ్రహ్మాస్త్రాన్ని వాడారు. దీని మీద వచ్చే ఫీడ్ బ్యాక్ ని అనుసరించి ఆయన ఇదే మాట ప్రతీ చోటా చెబుతారా అన్నది కూడా చూడాలి.

ఇక ఇపుడు జగన్ గురించి చెప్పుకోవాలి. ఆయన సీఎం గా ఉన్నారు. ఆయన కూడా బాబు మాదిరిగానే ముఖ్యమంత్రి పీఠాన్ని అసలు విడవను అని అంటున్నారు. ఏకంగా మూడు దశాబ్దాల పాటు తానే ఏపీకి సీఎం అని కూడా జగన్ అంటున్నారు. 2024 ఎన్నికలలో తనకు మరో చాన్స్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అంటే జగన్ ది వన్స్ మోర్ అన్న నినాదం అన్న మాట. ముప్పయ్యేళ్ళు సీఎం గా ఉండాలంటే 2024 అన్నది చాలా కీలకం జగన్ కి. ఎలా ఉంటే ముందే చెప్పుకున్నట్లుగా బాబు ఈ ఎన్నికల్లో ఓడిపోతే అతి ప్రధాన ప్రత్యర్ధి జగన్ కి పోటీ నుంచి లేకుండా పోతారు అని ఒక విశ్లేషణ ఉంది.

అదే సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పోటీగా ఉన్నా కూడా టీడీపీతో పోలిస్తే అంత ప్రమాదం కాదు, పైగా పవన్ వి నిలకడ లేని రాజకీయాలు కాబట్టి జనాలు నమ్మరు అని వైసీపీ విశ్వసిస్తోంది. దాంతో 2024లో వన్స్ మోర్ అంటూ జనాల మెప్పు పొందితే కనుక ఇక ఏపీ రాజకీయాల్లో ఎప్పటికీ తిరుగు ఉండదని జగన్ గట్టి పట్టుదల మీద పనిచేసుకుని పోతున్నారు.

ఇపుడు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన 2019 ఎన్నికల్లో కూడా తానే సీఎం అభ్యర్ధిని తనను గెలిపించాలని కోరారు. కానీ నాడు జగన్ వేవ్ బలంగా ఉంది. దాంతో పవన్ ని పక్కన పెట్టారు. ఇపుడు పవన్ ఒక్క చాన్స్ ఇవ్వండి అని కోరుతున్నారు. ఈ సమయంలో అది చాలా అర్ధవంతమైన నినాదమే అని కూడా చెప్పాల్సి ఉంటుంది.

అదెలా అంటే ఏపీ రాజకీయాల్లో ముమ్మారు సీఎం గా బాబుని జనాలు చూశారు, జగన్ కి ఒక చాన్స్ ఇచ్చారు. అందువల్ల ప్రజాస్వామ్యంలో మార్పు కోరుకోవాలన్నా కొత్త ఎంపిక కోసం చూడాలన్నా కచ్చితంగా పవన్ వైపే జనాలు చూడాలి. అలా చూస్తారు అని నమ్మకంతోనే పవన్ ఒక్క చాన్స్ అని అంటున్నారు.

పవన్ కి ఆ విధంగా తనను తన పార్టీని ప్రమోట్ చేసుకునే వెసులుబాటు అవకాశాలు కూడా ఇపుడు ఉన్నాయి. ఆయన పొత్తుల సంగతి తేల్చుకుంటే ఆయన ఒక్క చాన్స్ నినాదం బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది అన్న విశ్లేషణ కూడా ఉంది. ఏది ఏమైనా మూడు పార్టీలు జనాలకు బాగానే రిక్వెస్ట్ చేస్తున్నాయి.

ఎవరి వాదనలతో వారు జనాల ముందుకు వస్తున్నారు. మరి ఏపీ జనాలు ఒక్క చాన్స్ అని జగన్ కి ఇచ్చినట్లుగా పవన్ కి ఇస్తారా. లేక జగన్ కే వన్స్ మోర్ కొడతారా లేక లాస్ట్ చాన్స్ అని అండుగుతున్నారు కాబట్టి పెద్దాయన మీద సానుభూతి చూపిస్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా ఏపీ జనాల చేతిలో ఈ విలక్షణమైన తీర్పు అన్నది ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.