Begin typing your search above and press return to search.

అస్సలు పవన్ కు దమ్ము లేకేనా ఈ ఆప్షన్లు?!

By:  Tupaki Desk   |   6 Jun 2022 11:30 PM GMT
అస్సలు పవన్ కు దమ్ము లేకేనా ఈ ఆప్షన్లు?!
X
కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలకు సంబంధించి పొత్తులపై తన అభిప్రాయాలను పంచుకున్న సంగతి తెలిసిందే. ఆయా నియోజకవర్గాల ఇన్చార్జులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, వీర మహిళలు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఇలా జనసేనకు సంబంధించి నేతలంతా పాల్గొన్న ఈ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు ప్రకటించారు.

వచ్చే పొత్తులకు సంబంధించి పవన్ ప్రకటించిన ఆప్షన్లపై రాజకీయ పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. సొంతంగా పోటీ చేసే దమ్ము లేకే పవన్ ఆప్షన్లు అంటూ ఆయా పార్టీలతో పొత్తులంటూ వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని, ఈ రెండేళ్లలో పార్టీని బలోపేతం చేసుకుని, రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తే జనసేనకు మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. అలా చేయకుండా వేరే పార్టీలతో పొత్తులంటూ వాటి కోసం వెంపర్లాడటం ఏమిటని నిలదీస్తున్నారు.

పవన్ చెప్పిన ఆప్షన్లలో ఒకటి.. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి దాదాపు ఏడు శాతం ఓట్లు వచ్చాయి. ఒంటరిగా పోటీ చేసిన బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం రెండుకు మించలేదు. రెండు శాతం లోపే బీజేపీ ఓట్లు సాధించింది. అలాంటిది పవన్ చెప్పినట్టు బీజేపీ వినాలని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ పవన్ విచిత్రంగా బీజేపీ రోడ్ మ్యాప్ కోసం చూస్తున్నానని.. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే తన కార్యాచరణ మొదలుపెడతానని చెప్పడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

పవన్ కు సొంతంగా ఒక పార్టీ ఉండి, లక్షలాది మంది అభిమానులు ఉండి, 27 శాతం కాపు సామాజికవర్గం మొత్తం పవన్ వెంటే నడిచే పరిస్థితి ఉండి బీజేపీతో పొత్తు కోసం ప్రాధేయపడటమేంటని అంటున్నారు. పవన్ కల్యాణ్.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల వద్ద కాళ్ల బేరానికి రాడు కాబట్టి వాళ్లు పవన్ కు అపాయింట్మెంట్ ఇవ్వరని పేర్కొంటున్నారు. ఎందుకంటే పవన్ కల్యాణ్ పై జగన్, చంద్రబాబులపై ఉన్నట్టు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. చిన్న మచ్చ కూడా పవన్ పై లేదు. ఈ పరిస్థితుల్లో పవన్ తనమీద ఏదో సీబీఐ, ఈడీ కేసులున్నట్టు భయపడటమేంటో అర్థం కావడం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీతో పొత్తు కోసం ఎందుకు పాకులాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.

పవన్ చెప్పిన ఆప్షన్లలో మరొకటి.. టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. దీనిపైనా రాజకీయ విశ్లేషకుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కాలం, కర్మ కలసిరాక చంద్రబాబు స్తబ్ధుగా ఉంటున్నారని కానీ ఏమాత్రం ఆయనకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా చంద్రబాబు ఎంతటి చాణక్యుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని అంటున్నారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం టీడీపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నట్టు కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వచ్చే ఎన్నికల చివరి నిమిషం దాకా.. పొత్తుల విషయం నాన్చి జనసేనకు 15-20 సీట్లకు మించి కేటాయించకపోవచ్చని, వాటిలో కూడా టీడీపీ బలహీనంగా ఉన్నవి, అభ్యర్థులు లేని చోట మాత్రమే కేటాయిస్తారని బల్లగుద్ది చెబుతున్నారు. జనసేన గెలిచేవి ఖచ్చితంగా గెలుస్తుందని అనుకున్న సీట్లు 4-5 కి మించి కేటాయించరని ఢంకా బజాయిస్తున్నారు. తద్వారా పవన్ కల్యాణ్ కు ఉన్న 6 శాతం ఓట్లను టీడీపీ వైపు మళ్లించుకుంటారని అంటున్నారు.

2009 ఎన్నికలను ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. నాడు టీఆర్ఎస్, వామపక్షాలతో కలిసి మహాకూటమి పేరుతో పోటీ చేసిన చంద్రబాబు టీఆర్ఎస్ కు చివరి నిమిషం దాకా చుక్కలు చూపించారని గుర్తు చేస్తున్నారు. చివరి క్షణం వరకు టీఆర్ఎస్ కు సీట్లు కేటాయించకుండా ఆలస్యం చేశారని.. చివరలో ఆదరాబాదరాగా టీఆర్ఎస్ కు ఏమాత్రం బలం లేని సీట్లను కేటాయించారని అంటున్నారు. దీంతో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే సీట్లను గెలుచుకుందని గుర్తు చేస్తున్నారు. వారిలో కూడా చాలామంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని నాటి పరిణామాలను వివరిస్తున్నారు. ఈసారి కూడా పవన్ కల్యాణ్ అసమర్థతను కాపు నేతలకు చూపి కాపుల్లో ప్రధాన నేతలనంతా టీడీపీలోకి లాక్కుంటారని చెబుతున్నారు. జగన్ ను ఓడించడం తమ వల్లే అవుతుందని, పవన్ కల్యాణ్ వల్ల కాదని చెప్పడం ద్వారా కాపు సామాజికవర్గంలో భారీ ఎత్తున చీలిక తీసుకురావడానికి చంద్రబాబు ప్రయత్నించవచ్చని అంటున్నారు. అప్పుడు అంతిమంగా నష్టపోయేది పవన్ కల్యాణేనని పేర్కొంటున్నారు. అసలు జనసేనను అటు ఇటు కాకుండా చేస్తేనే తమ పార్టీ బలపడుతుందని చంద్రబాబు తలపోస్తున్నారని వివరిస్తున్నారు.

ఇక పవన్ కల్యాణ్ చెప్పిన మూడో ఆప్షన్.. బీజేపీ, టీడీపీలతో కలసి జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం. అయితే దీనికి బీజేపీ ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే బీజేపీకి ఉన్న సానుభూతి పవనాలను ఉపయోగించుకుని 1999 (అటల్ బిహారి వాజ్ పేయి ఇమేజ్), 2014 (నరేంద్ర మోదీ ఇమేజ్) ఎన్నికల్లో చంద్రబాబు ఎలా లాభపడ్డారో బీజేపీకి తెలుసంటున్నారు. అందుకే జనసేన, బీజేపీ కూటమిలో చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దని కోరుకుంటున్నారు. తమను వాడుకుని కేంద్రంలోకి వచ్చేసరికి చంద్రబాబు మళ్లీ కాంగ్రెస్ కు ఎక్కడ జై కొడతారేమోనని బీజేపీ భయంగా ఉందని చెబుతున్నారు. ఒకవేళ టీడీపీ కంటే బీజేపీకి తక్కువ సీట్లు వస్తే బీజేపీ మాట టీడీపీ వినదని పేర్కొంటున్నారు. ఒకవేళ వైఎస్సార్సీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే బీజేపీకి ఆ పార్టీ జై కొడుతుందని అంటున్నారు. కాబట్టి చంద్రబాబును బీజేపీ ఎప్పటికీ నమ్మదని అంటున్నారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించడాన్ని బీజేపీ ఇప్పట్లో మర్చిపోదని బల్లగుద్ది చెబుతున్నారు. కాబట్టి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి సాధ్యం కాదని ఢంకా బజాయించి వివరిస్తున్నారు.

ఇక పవన్ చెప్పిన ఆప్షన్లలో చివరిది జనసేన ఒంటరిగా పోటీ చేయడం. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి మళ్లీ వైఎస్సార్సీపీ మంచి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని జనసేన శ్రేణులు నమ్ముతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ప్రతిపక్షాలు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లన్నీ చీలిపోతాయని.. తద్వారా వైఎస్సార్సీపీకే లాభం చేకూరుతుందని పవన్ నమ్ముతున్నారని చెబుతున్నారు. అందువల్ల ఒంటరిగా పోటీ చేయడానికి పవన్ మొగ్గు చూపడం లేదని వివరిస్తున్నారు.

అంతేకాకుండా ఇంకా జనసేన క్షేత్ర స్థాయిలో బలపడాల్సి ఉంది. చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఇనచార్జులు లేరని అంటున్నారు. స్వయంగా ఇదే విషయాన్ని ఇటీవల ఉత్తరాంధ్రలో పర్యటించి వచ్చిన పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన ముఖ్య నేత నాగబాబు చెప్పారని గుర్తు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ, టీడీపీలో అసమ్మతి నాయకులు, వచ్చే ఎన్నికల్లో సీట్లు రావని అనుకునేవారే జనసేనలో చేరే అవకాశముందని పేర్కొంటున్నారు. అందువల్ల పవన్ ఒంటరిగా పోటీ చేయడానికి మొగ్గు చూపడం లేదని చెబుతున్నారు.