Begin typing your search above and press return to search.

పవన్ సీఎం.. బాబు తోనా మైండ్ గేమ్...?

By:  Tupaki Desk   |   5 May 2023 6:20 PM GMT
పవన్ సీఎం.. బాబు తోనా మైండ్ గేమ్...?
X
ఏపీలో ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావాలీ అంటే మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు రావాల్సి ఉంటుంది. ఆ సంగతి నాలుగవ క్లాస్ పౌర శాస్త్రం పుస్తకంలో పాఠం చదివిన ప్రతీ వారికీ అర్ధమయ్యే విషయమే. ఏపీలో చూస్తే ఈ రోజుకు ఉన్న క్లారిటీ వైసీపీ మాత్రమే 175 సీట్లకే పోటీ చేస్తోంది. ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోవడంలేదు. పదే పదే మేము సింగిల్ గా వస్తామని వైసీపీ నేతలు చెబుతూ ఉంటారు.

తెలుగుదేశం అయితే 2019 ఎన్నికల్లో మొత్తానికి మొత్తం సీట్లకు పోటీ చేసింది. 23 సీట్లతో సరిపెట్టుకుంది. ఈసారి ఆ తప్పు చేయకూడదు అని తెలుగుదేశం భావిస్తోంది. పొత్తులతోనే ముందుకు పోవాలని చూస్తోంది. కలసివచ్చిన అన్ని పార్టీలకు కలుపుకుని పోవాలని చూస్తఒంది. ఇక జనసేన విషయానికి వస్తే ఆ పార్టీకి మొత్తం అన్ని నియోజకవర్గాలలో ఇంచార్జిలు కూడా లేరు. పార్టీ కమిటీలను కూడా నియమించుకోలేదు. గ్రౌండ్ లెవెల్ దాకా పార్టీని తీసుకెళ్లలేదు అని అంతా అనే విషయం.

ఇక జనసేన కూడా 2019 ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసింది. బీఎస్పీ, వామపక్షాలకు సీట్లు పంచి 137 చోట్ల ఆ పార్టీ పోటీ చేసిందని ఒక లెక్క ఉంది అందులో డిపాజిట్లు దక్కినవి సింగిల్ డిజిట్ లోపే. ఇక ఈ నాలుగేళ్లలో చూసుకుంటే జనసేన గ్రాఫ్ పెరిగింది అని అంటున్నారు. కానీ ఆ పార్టీని దానికి తగినట్లుగా పటిష్టం చేసుకున్న సూచనలు అయితే లేవు.

ఇక పవన్ కళ్యాణ్ వారాహి రధమెక్కి ఏపీ అంతా చుట్టేస్తారు పార్టీలోకి చాలా మంది ఇతర పార్టీల నేతలు జాయిన్ అవుతారు అని కూడా అప్పట్లో ప్రచారం సాగింది. కానీ కొత్త ఏడాది లో మూడవ వంతు పూర్తి అయినా వారాహి జాడ లేదు. ఈ మధ్యలో రాజకీయ డెవలప్మెంట్ ఏంటి అంటే పవన్ రెండు సార్లు తానే స్వయంగా చంద్రబాబు వద్దకు వెళ్లి ఆయన నివాసంలో చర్చలు జరిపి వచ్చారు.

ఆ వివరాలు బయటకు తెలియకపోయినా పొత్తులకు సంబంధించి రెండు పార్టీల మధ్య మరో అడుగు పడింది అని అంటున్నారు. ఏది ఏమైనా ఈ పొత్తులలో జనసేన పై చేయి సాధిస్తుందని, కాపు సేన అధ్యక్షుడు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య వంటి వారు భావిస్తున్నారు. పవన్ సైతం ఆ మధ్య నిర్వహించిన ఎచ్చెర్ల సభలో కానీ మచిలీపట్నంలో జరిపిన పార్టీ ఆవిర్భావ సభలో కానీ గౌరవ ప్రదంగా ఉంటేనే పొత్తులు అని మాట్లాడారు.

మరి ఇవన్నీ చూస్తే పొత్తుల విషయంలో జనసేన చాలా ఆశలు పెట్టుకుంది అని అంటున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లాలైన పదమూడింటిలో జిల్లాకు అయిదు వంతుల అరవై సీట్ల దాకా టీడీపీ నుంచి పొత్తు రూపంలో తీసుకోవాలని అలాగే సీఎం పొస్టు కూడా పవర్ షేరింగ్ ద్వారా అందుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. ఈ రకమైన ధీమా జనసేనకు ఉండడానికి ఒక లాజిక్ ఉంది.

అదేంటి అంటే ఒంటరిగా టీడీపీ పోటీ చేయలేదు అనే. పోటీ చేస్తే కనుక కచ్చితంగా ఓట్లు చీలి మరోమారు జగన్ సీఎం అవుతారు అన్న సర్వే లెక్కలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ సాహసం చేయదనే భావిస్తోంది అని అంటున్నారు. ఇక 2024లో ఓడితే జనసేన కంటే టీడీపీకే రాజకీయంగా ఎక్కువ ఇబ్బంది కాబట్టి ఆ విధంగా ఆ పార్టీ బిగ్ రిస్క్ కి దిగదు అని కూడా జనసేన అంచనా వేసుకుంటోంది అని అంటున్నారు.

అయితే లాజిక్కులు పాలిటిక్స్ లో ఎంత మేరకు పనిచేస్తాయి అన్నది కూడా చూడాలని అంటున్నారు. పైగా పవన్ సీఎం అంటూ ఒక వైపు జోగయ్యలు మరో వైపు నాదెండ్లలూ, నాగబాబులూ ఇంకో వైపు ఆ పార్టీ నాయకులు స్టేట్మెంట్స్ ఇచ్చినంత మాత్రాన టీడీపీ ఆ ప్రతిపాదనకు ఒప్పుకుంటుందని భావించడం సాధ్యమా అన్న ప్రశ్న తలెత్తుతోంది. పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ ఈ నాలుగేళ్లలో తమ పార్టీ బలం ఇంత అని నిరూపించుకోలేదు.

దానికి తోడు పవన్ ప్రజా బలాన్ని కూడా నిరూపించుకునేలా ఏపీ అంతా దుమ్మెత్తిపోయేలా వారాహి రధ యాత్ర చేసి ఉంటే ఈ పాటికి టీడీపీకి గుబులు ఎంతో కొంత పుట్టి ఉండేది. ఇవన్నీ పక్కన పెట్టి తామే ఒకటికి పది సార్లు టీడీపీ పెద్దల వద్దకు వెళ్లి ముచ్చట్లు పెట్టి వస్తూ ఉంటే సీఎం సీటు షేరింగ్ కుదిరే వ్యవహారమేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మేము అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్రా అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ అని ఇటీవలే జనసేన నేత నాదెండ్ల మనోహర్ గంభీరంగా ప్రకటించారు.

మా పవన్ కళ్యాణ్ సీఎం అయితే టీటీడీని పూర్తిగా ప్రక్షాళన చేసి అభివృద్ధి చేస్తామని ఆయన అన్న గారు, జనసేన నేత నాగబాబు అంటున్నారు. ఇలా పవన్ సీఎం అంటూ ఆ పార్టీ నేతలు అనడం ఏ వ్యూహంలో భాగం అంటే అదంతా మైండ్ గేమ్ లో భాగమా అన్న చర్చ కూడా వస్తోంది. పవన్ని సీఎం గా ప్రకటించకపోతే కాపులు ఒప్పుకోరు అంటూ జోగయ్య వంటి వారు విడుదల చేస్తున్న లేఖల సారాంశం అదే అనుకున్నా ఇలాంటి మైండ్ గేమ్ కి చంద్రబాబు పడతారా అన్నదే అసలైన చర్చ. అసలు ఇంతకీ పవన్ కళ్యాణ్ నేనే ఏపీకి కాబోయే సీఎం అని ఎక్కడైనా ప్రకటించారా అన్న ప్రశ్నకు కూడా జవాబు వెతకాల్సి ఉంది.