Begin typing your search above and press return to search.

నిర్ణయం తీసుకోవాల్సింది కాపులేనా ?

By:  Tupaki Desk   |   12 May 2023 10:25 AM GMT
నిర్ణయం తీసుకోవాల్సింది కాపులేనా ?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా ప్రకటనతో నిర్ణయం కాపులదే అన్నట్లుగా ఉంది. ముఖ్యమంత్రి రేసులో లేనని పవన్ ప్రకటించేశారు. సీఎం పోస్టు అడగాలంటే అందుకు ఒక స్ధాయి ఉండాలన్నారు. తనచేతిలో కనీసం 30-40 సీట్లుంటే అప్పుడు ముఖ్యమంత్రి పదవి అడిగే వాడినని పవన్ మీడియా సమావేశంలో చెప్పారు. సీఎం పోస్టు కావాలని పట్టుబడితే చివరకు పొత్తుకూడా ఉంటుందో ఉండదో అన్నట్లుగా పవన్ అనుమానం వ్యక్తంచేశారు.

సో, పవన్ తాజా మాటలతో ముఖ్యమంత్రి రేసులో తాను లేనని, తాను సీఎం కాలేనని స్పష్టంగా చెప్పేశారు. మరిపుడు కాపు సామాజికవర్గం ఏమిచేస్తుంది ? పవన్ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి టీడీపీతో పొత్తుపెట్టుకుంటేనే కాపులు ఓట్లేస్తారని కాపు సంక్షేమ సమితి అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య చాలాసార్లు చెప్పారు. పొత్తులుంటాయి కానీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగానే తనను ప్రకటించటం సాధ్యంకాదని పవనే అంగీకరించారు.

మరిపుడు జోగయ్య ఏమిచేస్తారు ? జనసేనకు సగటున 18 శాతం ఓట్లున్నాయని పవన్ చెప్పారు. 2019 ఎన్నికల్లో 7 శాతం ఉన్న ఓటుబ్యాంకు ఇపుడు 18 శాతానికి చేరిందన్నారు. ఓటు బ్యాంకు పెరిగిందనేందుకు పవన్ దగ్గరున్న ఆధారం ఏమిటో తెలీదు.

పైగా రాయలసీమలో పార్టీకి బలంలేదని పవనే ప్రకటించారు. తమకు బలమున్న స్ధానాల్లో మాత్రమే పోటీచేస్తామన్నారు. ఎన్నిస్లానాల్లో బలముందో లెక్కలు లేవు. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పార్టీకి బలముందన్నారు. అంటే పవన్ ఉద్దేశ్యం ఉభయగోదావరి జాల్లాలు, ఉత్తరాంధ్ర మాత్రమేనా ?

ఏమో ఏ విషయంపైనా క్లారిటి ఇవ్వకుండా బహిరంగసభలు, మీడియాతో మాట్లాడటం పవన్ కు మాత్రమే చెల్లుతుంది. ఇంత అయోమయంలో ఇంకెవరు మాట్లాడలేరు. తాను అయోమయంలో మాట్లాడేస్తు తన మాటల్లో పిచ్చ క్లారిటి ఉంటుందని అనుకోవటమే పవన్ గొప్పదనం.

పైగా జనాలను అర్ధంచేసుకోమని పదే పదే చెబుతున్నారు. నాగబాబు అయితే ఎక్కడ మాట్లాడినా కాబోయే ముఖ్యమంత్రి పవన్ కల్యాణే అని ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. మరి పవన్ తాజా ప్రకటనతో నాగబాబు తమ నేతలకు, కార్యకర్తలకు ఏమి వివరణ ఇచ్చుకుంటారో చూడాలి.