Begin typing your search above and press return to search.

జన యాత్రికుడు : ఏపీని దున్నేస్తానంటున్న పవన్....?

By:  Tupaki Desk   |   4 Jun 2022 11:30 PM GMT
జన యాత్రికుడు : ఏపీని దున్నేస్తానంటున్న పవన్....?
X
ఎన్నికలు అంటే ఒకపుడు రాష్ట్ర నాయకులు ఒకటో రెండో సభలు పెట్టి ఓటేయండని జనాలు చెప్పే రోజులు కావు. ఎన్టీయార్ ఆరు పదుల వయసులో చైతన్యరధాన్ని తెచ్చి ఉమ్మడి ఏపీ అంతటా కలియతిరిగారు. ఆయన చేసిన ఆ అద్బుత రాజకీయ ప్రయోగమే తెలుగుదేశాన్ని పార్టీ పెట్టిన తొమ్మిది నెలల కాలంలో అధికారంలోకి తెచ్చి కూర్చోబెట్టింది. ఆ తరువాత జనంలోకి ఎలా వెళ్ళాలన్నది కాంగ్రెస్ కి కూడా ఎన్టీయార్ పాఠాలు చెప్పారు.

ఇక గడచిన మూడు దశాబ్దాల కాలంలో దానికి మించి ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. వైఎస్సార్ ఇలా లాభం లేదని పాదయాత్రకు శ్రీకారం చుట్టాక అంతా అదే బాటన నడవడం మొదలెట్టారు. పాదయాత్ర చేసి అధికారం అందుకున్న వారిలో వైఎస్సార్ చంద్రబాబు తరువాత జగన్ కనిపిస్తారు. దాంతో ఇపుడు మరోమారు టీడీపీలో పాదయాత్ర గురించిన చర్చ సాగుతోంది. అది చంద్రబాబు చేయాలా లోకేష్ చేయాలా అన్నది ఇంకా తేలలేదు.

ఆ సంగతి అలా ఉంటే మరో ప్రధాన పార్టీ జనసేన జనాలకు ఏ విధంగా చేరుతుంది అన్న విషయం మీద కూడా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. విశాఖ వచ్చిన మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు అయితే పవన్ పాదయాత్ర చేయడం కష్టమే అని తేల్చేశారు. ఆయన పాదయాత్ర చేస్తే జనాలను కంట్రోల్ చేయడం కష్టమని కూడా పేర్కొన్నారు.

దాంతో పాదయాత్రకు ధీటుగా మరో యాత్రను తాము రెడీ చేస్తున్నామని కూడా అన్నారు. తప్పకుండా పవన్ కళ్యాణ్ యాత్ర చేసి తీరుతారని, అది ఏ రూపంలో ఉంటుందో అన్ని వివరాలు సమయం వచ్చినపుడు చెబుతామని కూడా నాగబాబు చెప్పారు.

ఇదిలా ఉంటే పాదయాత్ర కాకపోతే బస్సు యాత్ర చేస్తారా పవన్ అన్న చర్చ ఇపుడు మొదలైంది. బస్సుయాత్ర చేసినా ఇంపాక్ట్ పెద్దగా రాదు కాబట్టి నాడు ఎన్టీయార్ తరహాలో సొంతంగా ఒక రధాన్ని తయారు చేయించుకుని ఏపీలోని మొత్తం జిల్లాలను చుట్టుముట్టాలని పవన్ మార్క్ ప్లాన్ గా ఉంది అంటున్నారు. అంటే ఆ రధంలోనే బస, భోజనం, విశ్రాంతి అన్న మాట. ఇలా అన్నీ అందులోనే సమకూర్చుకుని రాష్ట్రమంతా తిరిగితే ఏపీవ్యాప్తంగా జనాలను కదిలించగలమని పవన్ భావిస్తున్నారుట.

అదే టైమ్ లో వైసీపీకి యాంటీగా వాతావరణం కూడా క్రియేట్ అవుతుందని, జనసేన బ్రహ్మాండమైన బలాన్ని పుంజుకుంటుంది అని కూడా భావిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కోసం ఒక రధం రెడీ అవుతోంది అన్న మాట. మరి ఆయన ఏపీవ్యాప్త టూర్లు ఎపుడు అంటే బహుశా వచ్చే సంవత్స‌రం సగం పూర్తి అయ్యాక ఉండవచ్చు అంటున్నారు. అప్పటికి ఎన్నికలు పది నెలలు ఉన్నాయనగా పవన్ సినిమాలు వదిలేసి పూర్తిగా రాజకీయాలకు అంకితం అవుతారని అంటున్నారు. మరి పవన్ మార్క్ చైతన్య రధ యాత్ర ఏపీలో ఎలాంటి రాజకీయ సంచలనాన్ని నమోదు చేస్తుందో చూడాలి.