Begin typing your search above and press return to search.

ఆమె ద్రోహి...పంపిస్తేనే చ‌ర్చ‌లంటున్న సెల్వం

By:  Tupaki Desk   |   18 April 2017 11:48 AM GMT
ఆమె ద్రోహి...పంపిస్తేనే చ‌ర్చ‌లంటున్న సెల్వం
X
త‌మిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో రాజ‌కీయం ఊహించ‌ని మలుపులు తిరుగుతోంది. అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు కలిసే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్త‌ల నేప‌థ్యంలో మాజీ సీఎం అన్నాడీఎంకే పుర‌చ్చి త‌లైవి అమ్మ వ‌ర్గం నేత ప‌న్నీరు సెల్వం మీడియా ముందుకు వ‌చ్చారు. విలీనానికి ఓకే అంటూనే కీల‌క షరతు విధించారు. అన్నా డీఎంకే ఉప ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప్ర‌క‌టించుకున్న శ‌శిక‌ళ పార్టీలోనే ఉంటే విలీనం ప్ర‌స‌క్తే లేద‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు.

`అమ్మ` జయలలితకు శశికళ కుటుంబం ద్రోహం చేసిందని ప‌న్నీర్ సెల్వం మండిపడ్డారు. అది తెలిసే గతంలో శశికళ కుటుంబాన్ని అమ్మ బయటకు పంపించిందన్నారు. అందుకే శ‌శిక‌ళ‌తో పాటు ఆమె బంధువు అయిన‌ దిన‌క‌ర‌న్‌ - ఆమె కుటుంబ స‌భ్యులంద‌రినీ సాగ‌నంపాల‌ని ప‌న్నీర్ సెల్వం తేల్చి చెప్పారు. `ఎంజీఆర్‌ - జ‌య‌ల‌లిత కుటుంబ పాల‌న‌కు వ్య‌తిరేకం. అందుకే శ‌శిక‌ళ కుటుంబాన్ని పార్టీ నుంచి సాగనంపేవ‌ర‌కు విశ్ర‌మించం. పార్టీ ఓ కుటుంబం చేతిలో ఉండ‌కూడ‌దు` అని ప‌న్నీర్ సెల్వం స్ప‌ష్టం చేశారు. జ‌య‌ల‌లిత మ‌ర‌ణంపై సీబీఐ విచార‌ణ జ‌ర‌పాల‌న్న త‌న ప్ర‌ధాన డిమాండ్‌ పై కూడా వెన‌క్కి త‌గ్గేది లేద‌ని ప‌న్నీర్ స్ప‌ష్టంచేశారు.

ఎలాంటి ష‌ర‌తులు లేకుండా విలీనం అన్న వార్త‌లు ఒట్టి పుకార్లేన‌ని ప‌న్నీరు సెల్వం స్ప‌ష్టం చేశారు. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా శశికళ నియామకం ఏమాత్రం చెల్లదని ఆయ‌న వివ‌రించారు. ఈ పదవి విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని చెప్పారు. కుటుంబ రాజకీయాలు ఒప్పుకునేది లేదని చెప్పారు. టీవీవీ దినకరన్ పార్టీ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ వ‌చ్చిన స‌మ‌యంలోనే అవ‌కత‌వ‌క‌లు జ‌రుగుతున్న విష‌యాన్ని తాము ప్ర‌స్తావించామ‌ని సెల్వం చెప్పారు. ఇప్పుడు అది బ‌య‌ట ప‌డింద‌ని అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/