Begin typing your search above and press return to search.

సీఎంగా సెల్వం..ఓట‌మి భారంలో దిన‌క‌ర‌న్‌

By:  Tupaki Desk   |   19 April 2017 11:10 AM GMT
సీఎంగా సెల్వం..ఓట‌మి భారంలో దిన‌క‌ర‌న్‌
X
అన్నాడీఎంకేలో నెల‌కొన్న సంక్షోభం ఒక కొలిక్కి వ‌చ్చింది. చిన్న‌మ్మ శ‌శిక‌ళ వ‌ర్గాన్నిమాజీ ముఖ్యమంత్రి, దివంగ‌త జ‌య‌ల‌లిత న‌మ్మిన‌బంటు ప‌న్నీర్ సెల్వం విజ‌య‌వంతంగా ప‌క్క‌కు త‌ప్పించ‌గ‌లిగారు. తాజాగా సెల్వం మీడియాతో మాట్లాడుతూ...ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. శశికళ - ఆమె కుటుంబ సభ్యులకు పార్టీ నుంచి ఉద్వాసన పలికామని తెలిపారు. మన్నార్ గుడి మాఫియా నుంచి పార్టీని విముక్తి చేయాలన్న తమ పోరాటంలో ఇది తొలి విజయమని పేర్కొన్నారు. ఇక అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు కలిసి కూర్చుని చర్చించుకుంటామని, లక్షలాది మంది పార్టీ కార్యకర్తల ఆకాంక్షమేరకు పార్టీని నడిపిస్తామని పన్నీర్ సెల్వం చెప్పారు. ఈ విష‌యంలో పార్టీ నేత‌లంద‌రి స‌మ‌న్వ‌యంతోనే ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు సెల్వం తెలిపారు

మ‌రోవైపు శ‌శిక‌ళ స‌మీప బంధువు అన్నాడీఎంకే నాయకుడు దినకరన్ ఎట్టకేలకు దిగి వచ్చారు. పార్టీ నుంచి తనకూ, శశికళకూ ఉద్వాసన చెప్పాలన్న ఎమ్మెల్యేల నిర్ణయం పై తీవ్ర అసంతృప్తి - ఆగ్రహం వ్యక్తం చేసి పార్టీ ఎమ్మెల్యేలు - జిల్లా కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేసిన దినకరన్ చివరకు మెట్టు దిగారు. తాను ఏర్పాటు చేసిన సమావేశం ప్రారంభం కాకుండానే…పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తాను పాల్పడలేదనీ, పార్టీకి మేలు చేసే విధంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా సంపూర్ణ మద్దతు ఇస్తానని పేర్కొన్నారు. ఫెరా నిబంధనల ఉల్లంఘన కేసులో ఆయన ఎగ్మూర్ కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. పార్టీ వ్యవహారాల నుంచి నిన్ననే దూరం జరిగానని దినకరన్ అన్నారు. ఇక నుంచి మంత్రులంతా ఎటువంటి భయాలూ, ప్రలోభాలూ లేకుండా ప్రభుత్వాన్ని సజావుగా నడపాలని దినకరన్ విలేకరుల సమావేశంలో అన్నారు. అమ్మ జయలలితను దృష్టిలో ఉంచుకుని, పార్టీలోని రెండు వర్గాలు సమష్టిగా పని చేయాలని దినకరన్ కోరారు. అమ్మకు నివాళిగా పార్టీ - ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పని చేయాలన్నారు. కాగా అంత‌కుముందు పార్టీకి శశికళను, ఆమె మేనళ్లుడు దినకరన్ ను దూరం పెట్టాలని అన్నాడీఎంకేకు చెందిన 122 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానించారు. అయిన‌ప్ప‌టికీ దినకరన్ తగ్గలేదు. పార్టీలో తనకు వ్యతిరేకత లేదని, తనకు పూర్తి మద్దతు ఉందని చెబుతూ పార్టీ కార్యాలయంలో అన్నాడీఎంకే శశికళ వర్గం ఎమ్మెల్యేలు - పార్టీ జిల్లా కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముందే ప్ర‌క‌ట‌న చేశారు.

ఇదిలాఉండ‌గా... అన్నాడీఎంకేలోని రెండు గ్రూపుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. సమష్టిగా పని చేసి ప్రభుత్వం - పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో రెండు గ్రూపులూ సమావేశమయ్యాయి. అయితే సీఎం పదవి కోసం పన్నీర్ సెల్వం వర్గం పట్టుబడుతుండగా పళని స్వామి వర్గం మాత్రం అందుకు ససేమిరా అంటున్నది. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి విషయంలో కూడా ఇరు వర్గాల మధ్యా చర్చలలో పీటముడి పడినట్లు తెలుస్తోంది. అయితే మెజార్టీ స‌భ్యుల అభిప్రాయం మేర‌కు సెల్వంకు చాన్స్ ద‌క్క‌వ‌చ్చ‌ని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/