Begin typing your search above and press return to search.

టీడీపీలో 'ప‌ల్లె' చుట్టూ.. ముళ్ల కంచెలు.. రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   5 Aug 2022 4:42 AM GMT
టీడీపీలో ప‌ల్లె చుట్టూ.. ముళ్ల కంచెలు.. రీజ‌నేంటి?
X
మాజీ మంత్రి.. పుట్టప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచి, చంద్ర‌బాబుకు, పార్టీకి ఎంతో విధేయుడ‌నే పేరు తెచ్చుకున్న ప‌ల్లె ర‌ఘునాథ రెడ్డి చుట్టూ.. ప్ర‌స్తుతం తీవ్ర విమ‌ర్శ‌లు.. వివాదాలు.. చుట్టుముట్టాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌రాదంటూ.. రోజుకొక కొత్త‌గ‌ళం వినిపిస్తోంది. ఆయ‌న‌కు టికెట్ ఇస్తే.. తాము ఓడించి తీరుతామ‌ని కూడా నాయ‌కులు బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. మ‌రి ఇంత జ‌రుగుతు న్నా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎందుకు మౌనం పాటిస్తున్నారు?

క‌నీసం.. ఇక్క‌డ రాజ‌కీయాల‌ను క‌ట్టడి చేయాల్సిన చంద్ర‌బాబు.. ఎందుకు.. ఇప్ప‌టి వ‌రకు స‌రిదిద్దే ప్ర య‌త్నం కూడా చేయ‌డం లేదు? అనే ప్ర‌శ్న స‌హ‌జంగానే తెర‌మీదికి వ‌చ్చింది. ఇక‌, ప‌ల్లెకు పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌ను గ‌మ‌నిస్తే.. కొన్ని రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించి.. ప‌ల్లెకు వ్య‌తిరేకంగా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న అనుచ‌రుడైన‌ సైకం శ్రీనివాస రెడ్డికే టికెట్‌ అని బాంబు పేల్చారు.

ఈ విష‌యంలో ప‌ల్లెకు, జేసీకి మ‌ధ్య తీవ్ర వాగ్యుద్దం చోటు చేసుకుంది. దీనిపైర‌గ‌డ కొన‌సాగుతుండ‌గానే.. పుట్టపర్తి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ పీసీ గంగన్న కూడా పల్లెపై తిరుగుబావుటా ఎగరేశారు.

బుక్కపట్నం మాజీ ఎంపీపీ పెదరాసు సుబ్రమణ్యం కూడా పల్లెకు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే పనిచేయబోనని స్పష్టం చేశారు. ఈ ప‌రిణామం పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో చాలా వివాదంగా మారింది. ప‌ల్లెకు అనుకూలంగా ఉన్న వ‌ర్గాలు కూడా ఇప్పుడు డోలాయ‌మానంలో ప‌డిపోయాయి.

ఓబుళదేవరచెరువు మండలానికి చెందిన మాజీ ఎంపీపీ ఇస్మాయిల్, కొత్తచెరువులో రఘుపతి (మార్కెట్‌ యార్డు మాజీ వైస్‌ చైర్మన్‌), పెద్దన్న(లోచెర్ల), నిషార్‌ అహ్మద్‌ (మాజీ డీలర్‌), మండల మాజీ కన్వీనర్‌ శ్రీనాథ్‌ తదితరులు పల్లె రఘునాథ రెడ్డికి దూరంగా ఉంటున్నారు. ఇంత జరుగుతున్నా చంద్ర‌బాబు కానీ, పార్టీ బాధ్యులు కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డి ప‌రిస్థితిని ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు ప‌ల్లె మాత్రం.. త‌న ఉత్సాహాన్ని కొన‌సాగిస్తున్నారు.

ఇక‌, ప‌ల్లెపై ఇంత వ్య‌తిరేక‌త రావ‌డానికి రీజ‌నేంటి? అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ఆయ‌న అధికారంలో ఉన్నా.. లేకున్నా.. నిజాయితీగా ప‌నిచేయ‌డం.. ఎవ‌రికీ అవినీతికి తావులేకుండా.. ప‌నిచేయ‌డమేన‌నే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. ప‌ల్లె క‌నుక మ‌ళ్లీ గెలిస్తే.. ఇక‌, త‌మ హ‌వా సాగ‌ద‌ని.. ఒక‌ప్పుడు ఇక్క‌డ చ‌క్రం తిప్పిన నాయ‌కులు కొంద‌రు భావిస్తుండ‌డం కూడా కార‌ణ‌మేన‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా.. చంద్ర‌బాబు స్పందించి.. పొరుగు పార్టీల నుంచి వ‌చ్చిన వారిని కాకుండా.. టీడీపీకి ఆదినుంచి అండ‌గా ఉన్న‌వారికి ప్రాధాన్యం ఇవ్వాల‌నే డిమాండ్ వినిపిస్తోంది.