Begin typing your search above and press return to search.

ఆన్‌లైన్ మోసానికి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శ్వేతా చౌదరి ఆత్మహత్య!

By:  Tupaki Desk   |   4 July 2022 10:18 AM GMT
ఆన్‌లైన్ మోసానికి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శ్వేతా చౌదరి ఆత్మహత్య!
X
22 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆన్‌లైన్ మోసానికి గురైందని తెలిసి ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నువులూరుకు చెందిన జాస్తి శ్వేతాచౌదరి మృతి చెందింది.

శ్వేత హైదరాబాద్‌లోని ఒక టెక్ కంపెనీలో పనిచేస్తోంది. కానీ కోవిడ్ -19 కారణంగా ఆమె గత మూడు నెలలుగా తన స్వస్థలం నుండి పని చేస్తోంది. ఆమె ఆన్‌లైన్‌లో గుర్తుతెలియని వ్యక్తిని కలుసుకుంది. వాడి చేతిలో దారుణంగా మోసపోయింది. రూ. 1.2 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 7 లక్షలు తిరిగి ఇస్తానని ఎర వేయగా ఆ బుట్టలో శ్వేత పడిపోయింది.

మొదట్లో శ్వేత సంశయించినా మోసగాడు ఈ పథకం నిజమేనని నమ్మించాడు. శ్వేత వద్ద డబ్బులు సరిపోకపోవడంతో మోసగాడు రూ.50వేలు బదిలీ చేశాడు. తరువాత శ్వేత మోసగాడికి రూ. 1.3 లక్షలు చెల్లించింది.

ఆ తర్వాత ఆమె తనకు రావాల్సిన రూ.7 లక్షల రిటర్న్స్ కోసం ఎదురుచూసింది. అయితే డబ్బులు పడకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిని సంప్రదించడానికి ప్రయత్నించింది. కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది.

తాను మోసపోయానని తెలుసుకున్న శ్వేత మోసాన్ని తట్టుకోలేకపోయింది. తన జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ వారాంతంలో బంధువులతో కలిసి శ్వేత హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. శనివారం సాయంత్రం స్కూటీ తీసుకుని రాత్రి 8 గంటల సమయంలో చిల్లకల్లు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అంతకు ముందు శ్వేత తన ఆత్మహత్య గురించి తల్లికి మెసేజ్ పంపింది.

శ్వేత తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు వెంటనే స్పందించారు కానీ వారు ఆమెను రక్షించలేకపోయారు. ఆదివారం ఉదయం సరస్సులో శ్వేత మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేశారు. ఆన్‌లైన్ మోసాలు చాలా జరుగుతున్నాయి. అనేక సార్లు సంఘటనలు నకిలీవని రుజువు అయినప్పటికీ ప్రజలు ఇప్పటికీ ఈ మోసాల బారిన పడుతున్నారు. ఇలా ప్రాణాలు కోల్పోతున్నారు.