Begin typing your search above and press return to search.

అక్కకే ప్రచారం..కాదు కాదు అందరికీ..!?

By:  Tupaki Desk   |   19 Nov 2018 5:42 AM GMT
అక్కకే ప్రచారం..కాదు కాదు అందరికీ..!?
X
మహాకూటమిలో ప్రచారానికి గ్రహచారం పట్టుకుంటోంది. అనూహ్యంగా ఎన్నికల తెర పైకి వచ్చిన నందమూరి హరిక్రిష్ణ కుమార్తె నందమూరి సుహాసినికి కూకట్‌పల్లిలో భారీగా ప్రచారం చేయాలని ఆమె తమ్ముళ్లు నందమూరి కల్యాణ్ రామ్, తారక్ రామ్‌లు నిర్ణయించారు. నిజానికి నందమూరి సుహాసినిని ఎన్నికల బరిలో.... అందులోనూ కూకట్‌ పల్లి నుంచి పోటీ చేయించడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం నగరంలోని శేరిలింగంపల్లి - సనత్‌ నగర్ - జూబ్లీహిల్స్ - పటాన్‌ చెరుతో పాటు మల్కాజిగిరి - ఖైరతాబాద్ - ఉప్పల్ లో కూడా సినీ హీరోలయిన‌ నందమూరి బ్రదర్స్ చేత ప్రచారం చేయించి వాటిల్లో విజయం సాధించాలని బాబు వ్యూహం. అయితే ఇత‌ర‌ నియోజకవర్గాల్లో ప్రచారానికి మాత్రం నందమూరి కల్యాణ్ రామ్ - నందమూరి తారక రామ్ ససేమిరా అంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

దీనికి కారణం తమను సంప్రదించకుండా తమ అక్క భర్త - మామలతో మాట్లాడి ఆమెను కూకట్ పల్లి బరిలోకి దింపారని నందమూరి బ్రదర్స్ అలిగారట. ముందుగా నందమూరి కల్యాణ్ రామ్ చేత పోటీ చేయించాలని తెలుగుదేశం తెలంగాణ నాయకులు భావించారు. అయితే ఆయనను నామ్ కె వాస్తే గా అడిగి ఆ తర్వాత ఆయన అంగీకరించడం లేదంటూ లీకులు వదిలారంటున్నారు. దీంతో నందమూరి బ్రదర్స్ తమ మామ నారా చంద్రబాబు నాయుడు వేస్తున్న ఎత్తుగడలు అర్ధం అయి మిన్నకుండిపోయారంటున్నారు.

ఎప్పుడో పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన తమ అక్కను ముందస్తు ఎన్నికల్లో తెరపైకి తీసుకువచ్చిన చంద్రబాబు నాయుడు తమ ఆడపడచును అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారంటున్నారు. ఇదే సాకుగా తాము తమ అక్క కోసం ప్రచారం చేస్తాం కాని మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం తిరిగేది లేదని తేల్చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు... ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు - ఆయన తనయుడు తారక రామారావు తమ తండ్రి మరణించిన సమయంలో తమకు ఇచ్చిన అండ తాము మరచిపోలేమని నందమూరి బ్రదర్స్ తెలుగుదేశం నాయకుల వద్ద తెగేసి చెప్పినట్లుగా చెబుతున్నారు. నిజానికి తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకూడదు అని భావించడానికి కారణం తెలంగాణ రాష్ట్ర సమితి అధినాయకత్వం తమపై చూపించిన వాత్సల్యమేనని - దాన్ని చీల్చేందుకే చంద్రబాబు నాయుడు తమకు తెలియకుండా తమ అక్కను ఎన్నికల బరిలో దింపారని అన్నారట. ఇందుకే తాము తమ అక్కకు మాత్రమే ప్రచారం చేస్తామని - వేరెవరికి ప్రచారం చేసేది లేదని తేల్చేశారు. అయితే వారిద్దరి ప్రచారారినికి ఒప్పించే బాధ్యతను బాలక్రిష్ణకు అప్పగించాలని తెలంగాణ తెలుగుదేశం నాయకులు తమ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడ్ని కోరాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అయినా ఈ రాయబారం ఫలిస్తుందనే నమ్మకం లేదని పార్టీలో ఓ వర్గం వారు చెబుతున్నారు.