Begin typing your search above and press return to search.

బాబు అనుమానంలో నిజం లేద‌న్న‌ది తేలిపోయింది!

By:  Tupaki Desk   |   1 Jun 2019 5:39 AM GMT
బాబు అనుమానంలో నిజం లేద‌న్న‌ది తేలిపోయింది!
X
అనుమానం ఉండ‌టం త‌ప్పు కాదు. కానీ.. ఆధారాల్లేని అనుమానం అంత మంచిది కాదు. అనుమానం పెనుభూతంలా మారి వ్య‌వ‌స్థ‌ల మీద కొత్త సందేహాలు పుట్టుకొచ్చేలా చేయ‌టం వ‌ల్ల జ‌రిగే న‌ష్టం అంతా ఇంతా కాదు. త‌న మాట‌ల‌తో ఎన్నిక‌ల వేళ ఎన్నిక‌ల తీరు మీద అనుమానాలు వ‌చ్చేలా చేసిన బాబు మాట‌ల్లో అర్థం లేద‌న్న విష‌యం తాజాగా తేలిపోయింది.

ఈవీఎంల‌లో ఏదో జ‌రిగిపోయింద‌ని.. వీవీ ప్యాట్ ల‌లో 50 శాతం లెక్కించాలంటూ బాబు చేసిన యాగీలో అర్థం లేద‌ని తేలింది. త‌న బుర్ర‌లో తొలిచిన పురుగును దేశం మొత్తం తిరిగి.. వివిధ రాజ‌కీయ పార్టీల్ని వెంటేసుకున్న బాబు చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. సుప్రీంకోర్టు త‌లుపు రెండుసార్లు కొట్టి.. వారు కాస్తా నో అన్నాక కానీ త‌గ్గ‌లేదు. ఇంత చేసిన త‌ర్వాత బాబు వెలుబుచ్చిన అనుమానంలో పిస‌రంత అయినా నిజం ఉందా? అన్న‌ది చూస్తే.. లేద‌న్న విష‌యం తాజాగా తేలిపోయింది. ఎన్నిక‌ల వేళ‌లో ఈవీఎంల వినియోగంపై బాబు అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌టం.. కొత్త కొత్త సందేహాల్ని తెర మీద‌కు తేవ‌ట‌మే కాదు.. ఈవీఎంలో న‌మోదైన ఓట్ల‌కు వీవీ ప్యాట్ల‌లో న‌మోదైన ఓట్ల‌కు మ‌ధ్య తేడా ఉండేద‌న్న సందేహాం బాబు మాట‌ల్లో క‌నిపించింది.

అందుకే అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఐదు కాకుండా యాభై శాతం ఈవీఎంలు.. వీవీ ప్యాట్లు లెక్కించాల‌ని ఆయ‌న కోరారు. అయితే.. ఈ రెండింటి మ‌ధ్య ఓట్ల తేడా ఎక్క‌డా రాలేద‌న్న విష‌యం ఫ‌లితాల నాడే వెల్ల‌డైంది. ఒక‌వేళ ఈవీఎంల‌లో ఏదో జ‌రిగితే.. వీవీ ప్యాట్ల‌లో ప‌డే ఓట్ల‌తో లెక్క తేల‌కూడ‌దు. ఏదైనా తేడా వ‌స్తే.. ఏపీలో కాకున్నా తెలంగాణ‌లో కానీ.. ఆ రెండు రాష్ట్రాల్లోకాకున్నా.. దేశం మొత్తంలో ఎక్క‌డైనా తేడా వ‌చ్చే అవ‌కాశం ఉంది. కానీ.. అలాంటి వార్త ఏదీ రాక‌పోవ‌టం తెలిసిందే.

తాజాగా ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి గోపాల‌కృష్ణ ద్వివేది మాట్లాడుతూ..ఏపీ వ్యాప్తంగా నిర్వ‌హించిన ఎన్నిక‌ల్లో 23 ఎంపీ స్థానాల ప‌రిధిలో ఈవీఎంల‌లో పోలైన ఓట్ల‌కు.. వీవీ ప్యాట్లలో న‌మోదైన ఓట్ల‌కు తేడా లేద‌ని స్ప‌ష్టం చేశారు. అర‌కు ఎంపీ స్థానంలో పోలింగ్ స్టేష‌న్ 40.. న‌ర‌సాపురం లోక్ స‌భ ప‌రిధిలోని ఉండి పోలింగ్ బూత్ ల‌లో మాత్రం ఈవీఎంలు.. వీవీ ప్యాట్లు చెడిపోయాయ‌ని చెప్పారు. ఇందులో అర‌కు పోలింగ్ బూత్ లో న‌మోదైన ఓట్లు 384 కాగా.. ఉండిలో పోలైన ఓట్లు 119 మాత్ర‌మే. ఈ రెండు ఉదంతాలు మిన‌హా ఎక్క‌డా ఎలాంటి తేడా రాలేద‌న్నారు. మ‌రి..త‌న మాట‌ల‌తో ఆగ‌మాగం చేసిన చంద్ర‌బాబు ఇప్పుడేమంటారు..?