Begin typing your search above and press return to search.

గులాబీ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి జగన్...?

By:  Tupaki Desk   |   29 April 2022 9:58 AM GMT
గులాబీ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి జగన్...?
X
అవును గులాబీ పువ్వు బాగుంటుంది. కంటికి ఇంపుగా ఉంటుంది. దాన్ని కోయాలంటే గులాబీ ముళ్ళు కాటేస్తాయి. టీయారెస్ ది గులాబీ రంగు, అదే వాటం. ఒకరికి గులాం గిరీ చేయం, తెలంగాణా మాదీ అని గట్టిగా సౌండ్ చేసిన గులాబీ దళం చివరికి రాష్ట్రమూ రాజ్యాధికారమూ సాధించింది.

ఎనిమిదేళ్ళ పాలన పూర్తి చేసుకున్న వేళ టీయారెస్ మీద జనాల్లో సహజంగా అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అదే టైమ్ లో యాంటీ ఇంకెంబెన్సీ ఈసారి ఎక్కువగానే ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. దాంతో అటు విపక్షాలను ఇటు జనాలను ఒకే సారి దారికి తేవడం కష్టమైన పనే.

ఈ నేపధ్యంలో దేశంలో మోడీతో పోల్చుకుని తమ పాలనే బెటర్ అని టీయారెస్ నేతలు తరచూ చెప్పుకుంటారు. అయితే దాని మీద పెద్దగా ఎవరికీ అవగాహన లేకపోవడంతో ఆ పోలిక హిట్ కాదు, అందుకే పొరుగున ఉన్న ఆంధ్రాతో పోలిక పెడితే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అన్నీ కలిసివస్తాయి.

బహుశా ఇదే ఎత్తుగడతో ఈ మధ్య వరసబెట్టి తెలంగాణా నేతలు ఏపీ మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఏపీలో నీళ్లు లేవు, విద్యుత్తు లేదు, రోడ్లు బాలేవు అని లేటెస్ట్ గా కేటీయార్ అన్నారూ అంటే అది రాజకీయ విమర్శలకే పెద్ద విమర్శ. మామూలుగా అయితే ఒక సాటి రాష్ట్రం మీద ఈ తరహా విమర్శలు చేయడానికి ఎవరూ సాహసించరు.

కానీ ఏపీలో రాజకీయం తమకు కలసి రాదు అని అనుకున్నపుడే ఈ తరహా విమర్శలు వస్తాయి. జగన్ తో జిగినీ దోస్త్ టీయారెస్ ది అని నాడు టీడీపీ చెప్పేది. జనమూ అదే అనుకునేవారు. కధ కూడా అలాగే సాగినట్లుగా అనిపించింది. ఏపీలో జగన్ అధికారంలోకి రావాలని 2014 నుంచి టీయారెస్ పెద్దలు కోరుకున్నారు అని చెబుతారు.

ఇక అది 2019 ఎన్నికల్లో సాకారం అయింది. దాని వెనక వారి సహకారం ఉందని అంటారు. మొత్తానికి తొలి ఏడాది కేసీయార్, జగన్ అన్నదమ్ముల అనుబంధం సినిమాను రెండు రాష్ట్రాల ప్రజలకు రుచి చూపించారు. ఆ తరువాతనే తేడా పాడాలు వచ్చినట్లున్నాయి.

ఈమధ్యన అయితే ఈ ఇద్దరి గ్రూప్ ఫోటో అన్నది అసలు కనిపించడంలేదు. పైగా కేసీయార్ దారి మోడీకి ఎదురెళ్ళే దారి, జగన్ ది మోడీతో కలసి నడచే దారిగా ఉంది. అదే విధంగా కేసీయార్ జాతీయ రాజకీయాల కలలను సాకారం చేసేందుకు తోటి తెలుగు రాష్ట్రం ముందుకు రాలేదు అన్న బాధ అయితే ఉండి ఉంటుంది.

దాంతో అన్నీ కలసి అలా ఏపీని కించపరచేలా కామెంట్స్ వచ్చేలా చేస్తున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా ఒక్క మాట ఉమ్మడి ఏపీగా ఉన్నపుడు హైదరాబాద్ కే అందరూ అన్నీ చేశారు. ఏపీకి పెద్దగా నాడు చేసింది లేదు, ఈ రోజు కూడా ఏపీలోని వారే మెజారిటీ హైదరాబాద్ లో ప్రగతి రధాన్ని నడుపుతున్నారన్న అతిశయోక్తి లేదు.

విభజన వల్ల ఏపీ నష్టపోయింది. తెలంగాణా బాగుంది. దాన్నికి సంతోషించాలి కానీ తోటి రాష్ట్రాన్ని కించపరచడం తప్పు అనే అంటున్నారు. ఇక జగన్ తో రాజకీయంగా ఉంటే ఆయన్ని విమర్శించవచ్చు కానీ ఏపీని ముందుకు తెచ్చి అంటే అయిదు కోట్ల మంది బాధపడతారు. మొత్తానికి ఇది ఆరంభం మాత్రమే. ఫ్యూచర్ లో జగన్ ని బదనాం చేసేందుకు మరిన్ని హాట్ కామెంట్స్ ఏపీ మీద చేసినా ఆశ్చర్యం లేదు.