Begin typing your search above and press return to search.

విశాఖ అంటే మా చెడ్డ లవ్వు...?

By:  Tupaki Desk   |   27 April 2022 2:30 AM GMT
విశాఖ అంటే మా చెడ్డ లవ్వు...?
X
విశాఖ అంటే ఎవరికి ప్రేమ ఉండదు, అది సిటీ ఆఫ్ డెస్టినీ. ఒకసారి విశాఖ వచ్చిన వారు మళ్ళీ వెళ్లిపోవాలనుకోరు. ఇక విశాఖ మీద అధికారుల ప్రేమలు చాలా ఉన్నాయి. ఇక్కడ పనిచేసిన ప్రతీ వారూ సొంత ఇల్లు కట్టుకోవాలని ఆలోచించేవారు. ఇక సినీ పరిశ్రమకూ గొప్పగా ప్రేమలు ఉన్నాయి. సినిమాలు ఎన్నో విశాఖ వేదికగానే జరుగుతూ ఉంటాయి. అలాగే రాజకీయ పార్టీల ప్రేమలు కూడా విశాఖ మీద చాలానే ఉన్నాయి.

ఇపుడు అలాంటి ప్రేమలతో పోటీ పడుతున్నారు అధికార వైసీపీ, విపక్ష టీడీపీ. విశాఖ అంటే మాకు పీకల దాకా లవ్వు అని వైసీపీ అంటే మీ కంటే మాకే ఎక్కువ లవ్వు అని టీడీపీ నేతలు బదులిస్తున్నారు. విశాఖకు చంద్రబాబు ఏమీ చేయలేదని మంత్రి గుడివాడ ఆమరనాధ్ ఘాటైన మాటలతో విరుచుకుపడ్డారు.

విభజన తరువాత తొలి చాన్స్ బాబుకు వస్తే ఆయన అధికారంలో ఉన్నపుడు విశాఖను అన్ని విధాలుగా నిర్లక్ష్యం చేశారని నిందించారు. విశాఖ దేశంలో ముంబై చెన్నై, కోల్ కటా. హైదరాబాద్, బెంగుళూరు నగరాలకు ధీటుగా ఎదిగే నగరమని గుడివాడ అన్నారు. అలాంటి అవకాశం ఉన్నా విశాఖ విషయంలో మాత్రం టీడీపీ పూర్తి నిర్లక్ష్యం వహించిందని ఆయన విమర్శించారు.

ఇక విశాఖను పరిపాలనా రాజధానిగా చేద్దామనుకుంటే కోర్టులో కేసులు వేశారని, లక్షల మంది పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలనుకుంటే కూడా అడ్డుకున్నారని ఆయన మండిపడ్డారు. ఇపుడు విశాఖను టూరిజం పరనగా అభివృద్ధి చేస్తూంటే కేంద్రం నుంచి సీఆర్‌జెడ్‌ అనుమతులున్నా ఏమీ లేవని టీడీపీ అనుకూల మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారని ఆయన అంటున్నారు.

విశాఖ అంటే ఎందుకంత అక్కసు టీడీపీ నేతలకు అని ఆయన నిలదీస్తున్నారు. ఇక విశాఖ అంటే మాకే ఎక్కువ ప్రేమ ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. విశాఖను తాము అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే ఉన్న కట్టడాలను కూల్చేస్తున్నారని, పర్యావరణ నిబంధనలకు తూట్లు పొడిచి విద్వంశం సృష్టిస్తున్నారని వారు అంటున్నారు. విశాఖలో పెద్ద ఎత్తున కబ్జాలు వైసీపీ హయాంలో జరిగాయి తప్ప అభివృద్ధి అన్నది లేనే లేదని తమ్ముళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి చూస్తే అమాయకమైన పదహారణాల విశాఖ అమ్మాయి మీద అటూ ఇటూ బాగానే లవ్వు చూపిస్తున్నారు. మనసు పారేసుకుంటున్నారు. అయితే నాడూ నేడూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి మీద ఎవరూ పెద్దగా శ్రద్ధ చూపించలేదు అన్నది సగటు పౌరుడి కామెంట్. విశాఖను నంబర్ వన్ సిటీగా చేయాలన్న ఆలోచన ఏ కోశానా ఎవరికీ లేదని, అందుకే రైల్వే జోన్ కి అతీ గతీ లేదని, ఉన్న బంగారం లాంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతోందని, విశాఖ ప్రగతి దారి తప్పి కుంటుతోందని అంటున్నారు. సో విశాఖ మీద ఎవరికి ఎంత లవ్వు అని పందేలు కాసుకోవడం కంటే కలసికట్టుగా నగరాభివృద్ధి రెండు పార్టీలు పనిచేయడం బెస్ట్ ఏమో కదా.