Begin typing your search above and press return to search.

ఎన్టీయార్ ఆరాధ్య దైవం... వైఎస్సార్ బెస్ట్ ఫ్రెండ్....

By:  Tupaki Desk   |   11 Oct 2022 4:23 PM GMT
ఎన్టీయార్  ఆరాధ్య దైవం... వైఎస్సార్ బెస్ట్ ఫ్రెండ్....
X
ఎన్టీయార్ అనగానే ఆయన సినీ వైభవం గుర్తుకువస్తుంది. అంతే స్థాయిలో ఆయన రాజకీయ వైభోగం కూడా కనిపిస్తుంది. పార్టీ పెట్టి తొమ్మిది నెలలలోనే అధికారాన్ని హస్తగతం చేసుకుని ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన ఎన్టీయార్, ఇందిరా గాంధీ వంటి ఐరన్ లేడీని సైతం ఓడించిన ఎన్టీయార్, నెల తిరగకుండానే తనకు వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కరరావు నుంచి అధికారం సాధించుకున్న ఎన్టీయార్ ఇలా ఎన్నో జ్ఞప్తికి వస్తాయి.

అంతే కాదు, దేశమంతా ఇందిర దారుణ‌ హత్య సానుభూతిపవనాలు వీస్తే ఒక్క ఉమ్మడి ఏపీలోనే ఆ పవనాలు వీచకుండా ఆపగలిగింది ఎన్టీయార్ సమ్మోహనాస్త్రం. 1984లో ఏకంగా 42 ఎంపీ సీట్లకు గానూ 35 సీట్లను గెలుచుకుని ఢిల్లీలో కాంగ్రెస్ కి ప్రతిపక్షంగా అవతరించిన రికార్డుని ఎవరు మరచిపోగలరు. ఎన్టీయార్ నేషనల్ ఫ్రంట్ కట్టి వామపక్షాల బీజేపీలను అటూ ఇటూ పెట్టుకుని మరీ కాంగ్రెస్ ని గద్దె దించి దేశానికి రెండవ కాంగ్రెసేత సర్కార్ ని చూపించిన ఘనత కూడా గుర్తు రాక మానదు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్టీయార్ జీవితంలో వెన్నుపోట్లు రెండు జరిగాయి. మొదటి దాన్ని ఆయన జయించారు. రెండవ దానిలో ఓడిపోయి ఈ లోకం ఏకంగా వీడిపోయారు. మొదటిది బయట వారు చేస్తే రెండవ దాన్ని సొంత కుటుంబ సభ్యులే చేశారు. అది ఇంకా ఘోరం. అందుకే బాబుని ఔరంగజేబుతో ఎన్టీయార్ పోల్చారు. తాను బతికి ఉన్నంతకాలం ఎన్టీయార్ ని ఆయన క్షమించలేదు. అయితే సీఎం గా చంద్రబాబు ఎన్ని విజయాలు అందుకున్నా ఎన్ని మంచి పనులు చేసి గొప్ప ఇమేజ్ సాధించినా కూడా ఎన్టీయార్ వెన్నుపోటు ఎపిసోడ్ అయితే మాత్రం ఆయనకు జీవితాంతం మాయని మచ్చగానే మిగిలిపోతుంది అని రాజకీయ చరిత్రకారులు అంటారు.

ఇదిలా ఉంటే ఎన్టీయార్ వెన్నుపోటు విషయాన్ని టీడీపీని రక్షించుకునే విషయంగా చంద్రబాబు నాడూ చెప్పారు. ఎన్నో సార్లు చెప్పారు. కానీ జనాలు మాత్రం అది వెన్నుపోటే అన్నారు. ఎందుకంటే ఎన్టీయార్ లాంటి కురువృద్ధుడిని దించేసి పార్టీని ప్రభుత్వాన్ని లాక్కోవడం అన్నది మాత్రం ఎవరూ జీర్ణించుకోలేనిదే. కానీ చంద్రబాబు తన వాదనను ఆ ప్రశ్న ఎదురైనపుడల్లా వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా బాలయ్య అన్ స్టాపబుల్ షో సీజన్ టూ కి ఫస్ట్ గెస్ట్ గా వచ్చిన చంద్రబాబు తన జీవితంలో అత్యంత వివాదాస్పద సంఘటనగా దాన్ని చెప్పుకున్నారు.

మీకు తెలుసు కదా నాడు ఏం జరిగిందో అంటూ ప్రొమోలో బాబు బాలయ్యతో చెప్పడం జరిగింది. ఆనాడు ఎంతలా ప్రాధేయపడ్డాం, కాళ్ళు పట్టుకున్నామని కూడా బాబు చెప్పడం ప్రోమోలో కనిపిస్తుంది. దీనిని బట్టి చూస్తే ఎన్టీయార్ కి వెన్నుపోటు జరగకముందు పెద్దాయన్ని ఫ్యామిలీ సభ్యులుగా బాగా కన్విన్స్ చేశామని బాబు ఏదో చెప్పబోతున్నట్లుగా ఉంది ప్రోమోలో చూస్తే అంతే కాదు ఇదే ప్రోమోలో మరో సందర్భంలో నా ఆరాధ్య దైవం అని ఎన్టీయార్ గురించే బాబు చెప్పినట్లుగా ఉంది. అంటే వెన్నుపోటు ఉదంతం మీద నాడు ఏమి జరిగింది అన్నది బాలయ్య సాక్షిగా చంద్రబాబు మరోసారి తెలుగు ఆడియన్స్ కి చెప్పబోతున్నారు అన్న మాట.

నిజానికి బాబు మీద ఈ నింద పడినా ఈ విషయంలో చాలా మంది ఉన్నారు. అసలు కధ ఏమి జరిగింది అన్న దాని మీద వివిధ రకాలైన వాదనలు ఉన్నాయి. బాబు ఇలా తన మనసు విప్పి మరీ చెబుతున్నా ఈ విషయాలలో ఎన్టీయార్ ని దించడం వెనక ఏమి జరిగి ఉంటుంది అన్నదే ఇపుడు ఆసక్తిని పెంచుతోంది. ఈ మధ్యనే వైసీపీ వారు ఎన్టీయార్ పేరు ఎత్తడానికి బాబుకు హక్కు లేదని అన్నారు. అలాగే బాలయ్యకు కూడా లేనేలేదని అందరూ కలిసే ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడిచారు అని కూడా విమర్శించారు.

బహుశా వాటికి సరైన సమాధానం బాబు అన్ స్టాపబుల్ షో సీజన్ టూ ఫస్ట్ ఎపిసోడ్ ద్వారా ఇస్తారనుకోవాలేమో. ఇక రాజశేఖరరెడ్డి తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడం ద్వారా వ్హ్యూహాత్మకంగానే బాబు వైసీపీ కూశాలు కదిలించే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్పబోతున్నాట్లుగా అర్ధమవుతోంది. నిజానికి 1978లో యువ ఎమ్మెల్యేలుగా బాబు వైఎస్సార్ ఉండేవారు. వారి మధ్య మంచి స్నేహం ఉందని అందరికీ తెలుసు.

ఆ విషయాలు ఎపుడూ బాగా లోతుగా అయితే బాబు ఎక్కడా పంచుకోలేదు. ఇపుడు రివీల్ చేస్తున్నారు అంటే రాజకీయ బాణం పక్కాగా వైసీపీ మీద గురి పెట్టబోతున్నారు అనుకోవాలి. అంతే కాదు వైఎస్సార్ మంచివారు జగన్ ఇలా అని ఏమైనా చెప్పబోతున్నారా అన్నదే ఆసక్తిని పెంచే అంశం. ఏది ఏమైనా చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. వాటిని బాలయ్య ఈ ఎపిసోడ్ లో ఆవిష్కరిస్తే మాత్రం రాజకీయ మసాలా ప్రత్యర్ధులకు నసాలానికి అంటడం ఖాయమే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.