Begin typing your search above and press return to search.

చినబాబు ఈ రేంజిలో...పరువు తీసేశారుగా ... ?

By:  Tupaki Desk   |   18 Feb 2022 4:30 PM GMT
చినబాబు ఈ రేంజిలో...పరువు తీసేశారుగా ... ?
X
చిన బాబుకు పప్పు అని రాజకీయాలు తెలియవని ఏవేవో అంటూంటారు. కానీ సరిగ్గా పాయింట్ పట్టుకుని గురి చూసి కొట్టడంలో ఆయన బాగా ఆరితేరిపోతున్నారు. జగన్ మీద మాటల దాడి చేయాలీ అంటే చినబాబే సూటబుల్ అనిపించేసుకుంటున్నారు. ఏపీలో ఉద్యోగాల కల్పన వెరీ పూర్ అని జాతీయ స్థాయిలో వచ్చిన ఒక నివేదికను పట్టుకుని లోకేష్ బాబు జగన్ ప్రభుత్వాన్ని ఒక దుమ్ము దులిపేశారు.

ఏకంగా తల ఎక్కడ పెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. మూడేళ్ల పాలన అవుతున్నా కొత్తగా ఒక్క ఉద్యోగాన్ని కూడా కల్పించలేకపొయారెందుకు అని చీల్చిచెండాడేశారు. చంద్రబాబు ఏలుబడిలో అంటే 2018లో ఏపీ ఉద్యోగాల కల్పనలో ఏకంగా ఫస్ట్ ర్యాంక్ ని సాధిస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అది కాస్తా నాలుగు, అయిదు నుంచి దిగజారుతూ తాజా నివేదిక ప్రకారం ఏడవ ర్యాంక్ కి పాకి పాతాళానికి చేరుకోవడం పైన లోకేష్ మండిపడ్డారు.

ఇదేనా ఉపాధి కల్పించడం, ఇదేనా ఏపీని బాగా అభివృద్ధి చేయడం అంటూ నిప్పులు చెరిగారు. తాను సీఎం అయ్యాక ఏపీకి దేశమంతా చూసేలా చేస్తాను జగన్ చెప్పిన మాటలను రివర్స్ లో ఆయన అప్పచెప్పారు. అవును ఇపుడు దేశమేమిటి ఖర్మ, యావత్తు ప్రపంచమే ఏపీ వైపు జాలిగా చూస్తోంది జగన్ గారూ అంటూ లోకేష్ తనదైన పంచులు వేసేశారు.

ఉపాధి కల్పన అంటే తన వారికి, తన మనుషులకు పదవులు ఇచ్చినంత ఈజీ కాదు ముఖ్యమంత్రి గారూ అంటూ దెప్పిపొడిచారు. విజన్ ఉండాలని, ఏపీని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన ఉండాలని కూడా సూచించారు. ఏపీ ఉద్యోగార్థుల్లో నైపుణ్యం, ఆంగ్ల ప‌రిజ్ఞానం శూన్యం అని జాతీయ నైపుణ్యాల నివేదిక‌-2022 వెల్ల‌డించిందని ఆయ‌న చెప్పుకొచ్చారు. అంతే కాదు ఏపీలో పరిస్థితుల మీద ఈ నివేదిక లో పేర్కొన్న ప్రకారం దారుణమని కూడా ఆయన అన్నారు.

ఏపీని తిరిగి నిర్మిస్తామని చెప్పారు, కానీ ప్రజా వేదికను చిటికలో కూల్చేశారు అని ఆయన ఎత్తి చూపారు. ఏపీని అగ్రగామిగా నిలబెట్టాలన్న చిత్తశుద్ధి వైసీపీ పాలకులకు లేకపోవడం వల్లనే ఈ దుస్థితి అని ఆయన విమర్శించారు. మొత్తానికి మూడేళ్ళ పాలనను తొందరలో పూర్తి చేసుకోబోతున్న జగన్ సర్కార్ కి మిగిలింది చాలా తక్కువ టైమ్. ఒక విధంగా అభివృద్ధి సూచీలు కానీ ఉపాధి కల్పన సహా ఇతర సూచీలు కానీ ఏపీని వెనక్కి నెట్టేస్తున్నాయి.

ఇవే విపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయి. ఇక అధికారంలో ఉండేది తక్కువ టైమ్. ఈ విలువైన టైమ్ లోనే జగన్ మార్క్ మ్యాజిక్ చూపించాలి. లేకపోతే ఈ రోజు లోకేష్ ఆవేశం రేపటి రోజున జనావేశంగా మారే ప్రమాదం కూడా ఉంది అన్నది విశ్లేషణ.