Begin typing your search above and press return to search.

బాబు మార్కు ప్లాన్‌!.కూక‌ట్‌ ప‌ల్లి పోటీకి సుహాసిని సై!

By:  Tupaki Desk   |   15 Nov 2018 12:25 PM GMT
బాబు మార్కు ప్లాన్‌!.కూక‌ట్‌ ప‌ల్లి పోటీకి సుహాసిని సై!
X
తెలంగాణ అసెంబ్లీకి జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ర‌చిస్తున్న ప్ర‌ణాళిక‌లు నిజంగానే ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఏపీలో కాంగ్రెస్‌ తో దోస్తీకి రంగం సిద్ధం చేసుకునేందుకు అనువుగా తెలంగాణ‌లో హ‌స్తం పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్ర‌బాబు... సొంత పార్టీ నేత‌ల‌కు తీర‌ని అన్యాయం చేస్తున్నారు. ఈ త‌ర‌హా వ్యూహాలు ఒక ఎత్తైతే... కేవ‌లం కాంగ్రెస్ పార్టీ దోస్తీతోనే తాను బ‌తికి బ‌ట్ట క‌ట్ట‌గ‌న‌న్న ధీమా లేని కార‌ణంగా చంద్ర‌బాబు... మ‌రోమారు పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు - ఆంధ్రుల ఆరాధ్య న‌టుడు స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రారామావు ఫ్యామిలీ అండ కూడా కావాల్సిందేన‌ని గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. ఈ క్ర‌మంలోనే నంద‌మూరి ఫ్యామిలీ అడ‌క్కుండానే... ఇటీవ‌లే మృతి చెందిన పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు - మాజీ ఎంపీ నంద‌మూరి హ‌రికృష్ణ త‌న‌య సుహాసినిని తెలంగాణ బ‌రిలోకి దించేస్తున్నారు. త‌న అనుకూల మీడియా ద్వారా ఈ లీకుల‌ను ఇచ్చేసిన చంద్ర‌బాబు... సుహాసిని పోటీ విష‌యంలోనూ నంద‌మూరి ఫ్యామిలీని త‌న దారికి తెచ్చుకున్న‌ట్టుగా తెలుస్తోంది.

నిన్న‌టిదాకా సుహాసిని పోటీ విష‌యంలో నంద‌మూరి కుటుంబం అంత‌గా ఆస‌క్తి చూప‌లేదు. అయితే బాబు మార్కు రాజ‌కీయంతో తాజాగా సుహాసిని పోటీకి నంద‌మూరి ఫ్యామిలీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. టీడీపీకి బ‌ల‌మైన కోట‌గా ఉన్న కూక‌ట్ ప‌ల్లిలో క‌మ్మ సామాజిక ఓట‌ర్లు అధికంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అదే సామాజిక వ‌ర్గానికి చెందిన చంద్ర‌బాబు... త‌న కులం ఓట్లతో సుహాసిని ఈజీగానే గెలిపించేసుకుంటాన‌ని కూడా నంద‌మూరి ఫ్యామిలీకి గ‌ట్టి భ‌రోసా ఇచ్చిన‌ట్లుగానూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో త‌మ తండ్రి వార‌స‌త్వంతో సోద‌రిని కూక‌ట్‌ ప‌ల్లి బ‌రిలోకి దించేందుకు టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌ - ఆయ‌న సోద‌రుడు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ స‌సేమిరా అన్నా కూడా చంద్ర‌బాబు త‌న‌దైన మార్కు రాయ‌బారం న‌డిపి సుహాసిని చేత ఒకే అనిపించిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం విశాఖపట్నం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబును కలవడానికి నేటి ఉదయమే సుహాసిని ఆమె స్నేహితురాలితో కలసి విశాఖ బయలు దేరారు. అక్కడ చంద్రబాబు నాయుడి ఆశీర్వాదం తీసుకుని రేపు హైదరాబాద్ లో కూకట్ పల్లి నియోజకవర్గానికి సుహాసిని నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి కూకట్ పల్లి - శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒక దాని నుంచి హరికృష్ణ కుమారుడు నందమూరి కళ్యాణ్ రామ్ ని పోటీలోకి దింపాలని చంద్రబాబు భావించిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న కళ్యాణ్ రామ్ తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని... తానింకా పది - పదిహేనేళ్లు సినీ పరిశ్రమలోనే కొనసాగాలనుకుంటున్నట్లు చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారు. ఇదంతా జరిగి దాదాపు నెల రోజులు గడచి పోయింది. అయితే నంద‌మూరి ఫ్యామిలీ అండ లేనిదే తాను గెల‌వ‌లేన‌ని భావించిన చంద్ర‌బాబు... క‌ల్యాణ్ రామ్ కాక‌పోతే... ఆ కుటుంబం నుంచి ఇంకెవ‌రు ఉన్నార‌న్న కోణంలో ప‌రిశీల‌న జ‌రిపి సుహాసిని పేరును తెర‌పైకి తీసుకువ‌చ్చిన‌ట్లుగా స‌మాచారం. రాజీకీయంగా నంద‌మూరి ఫ్యామిలీ ప‌ట్ల చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన తీరుతో అస‌లు ఈ ఎన్నిక‌ల్లో ఆ ఫ్యామిలీ నుంచి ఎవ‌రు కూడా పోటీ చేయ‌ర‌న్న వాద‌న వినిపించింది.

అయితే రాజ‌కీయంగా త‌న‌కు అవ‌స‌ర‌మైన ప‌నిని జ‌రిపించుకునేందుకు చంద్ర‌బాబు మ‌రో మార్గాన్ని ఎంచుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలో సుహాసినికి ఉన్న కొన్ని బ్యాంకు రుణాల‌ను స‌ర్దుబాటు చేయించి... ఆమెకు త‌న ప‌ట్ల సానుకూల‌త క‌ల్పించిన‌ట్లుగా స‌మాచారం. అంతేకాకుండా సుహాసినికి ప్రాణ స్నేహితురాలైన ఓ మ‌హిళ‌ను కూడా చంద్ర‌బాబు ప్ర‌యోగించిన‌ట్లుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ సోద‌రుల నుంచి సుహాసిని గ్రీన్ సిగ్న‌ల్ రాకున్నా... పార్టీ గుంటూరు జిల్లా శాఖ‌కు చెందిన ఓ కీల‌క నేత సోద‌రిగా ఉన్న ఆ మ‌హిళ‌ను చంద్ర‌బాబు రాయ‌బారానికి ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. మొత్తంగా సుహాసిని పోటీకి ఒప్పుకోవడంతో చంద్ర‌బాబు ప్లాన్ వ‌ర్క‌వుటైన‌ట్లుగా చెప్పుకోవాల్సిందే. అదే స‌మ‌యంలో తాను గెల‌వాలంటే నంద‌మూరి ఫ్యామిలీ అండ కావాల్సిందేన‌న్న భావ‌న‌ను కూడా చంద్ర‌బాబు త‌న‌కు తానుగా బ‌య‌ట‌పెట్టుకున్న‌ట్టుగా కూడా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.