Begin typing your search above and press return to search.

బాబుకు నాగ‌బాబు ట్వీట్ సాంత్వ‌న‌!

By:  Tupaki Desk   |   28 May 2019 11:54 AM GMT
బాబుకు నాగ‌బాబు ట్వీట్ సాంత్వ‌న‌!
X
గెలుపు టానిక్ లాంటిది. ఓట‌మి విషం లాంటిది. ఒక్క‌సారి ఫెయిల్ అయితే.. అప్ప‌టివ‌ర‌కూ చుట్టూ ఉన్న కీర్తి క‌రిగిపోయి.. క‌ఠిన వాస్త‌వం బ‌య‌ట‌కు వ‌స్తుంది. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో అత్యంత దారుణంగా ఓడిన ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును.. ఫ‌లితాలు వెలువ‌డిన నాటి నుంచి సోష‌ల్ మీడియాలో ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు. కొన్ని మీమ్స్ తో పాటు.. కార్టూన్లో ఎట‌కారం ఆడేస్తున్నారు.

ఇలాంటివేళ‌.. బాబుకు సాంత్వ‌న క‌లిగేలా జ‌న‌సేన పార్టీ ఎంపీ అభ్య‌ర్థి క‌మ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సోద‌రుడు నాగ‌బాబు ఒక ట్వీట్ చేశారు. బాబు ప‌వ‌ర్లో ఉన్న‌ప్పుడు తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన నాగ‌బాబు.. తాజాగా మాత్రం బాబుకు మ‌ద్ద‌తు ప‌లుకుతూ ట్వీట్ చేశారు. నిరాయుధుడైన ప్ర‌త్య‌ర్థి ఎదురు నిలుచున్న‌ప్పుడు వారిని.. ట్రోల్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొంద‌టం శాడిజం అంటూ మండిప‌డ్డారు.

సోష‌ల్ మీడియాలో బాబును ట్రోల్ చేస్తున్న వారిపై నాగ‌బాబు పెట్టిన ట్వీట్ లో కొన్ని అచ్చుత‌ప్పులు.. తెలుగు మ‌ధ్య‌లో ఇంగిలిపీసుతో తాను చెప్పానుకున్న‌ది చెప్పేశారు. ఆయ‌నేమ‌న్నార‌న్న‌ది చూస్తే.. చంద్ర‌బాబుగారు మ‌న మాజీ సీఎం. ఇప్పుడు ఓట‌మిపాలైనంత మాత్రాన ఆయ‌న్ను దారుణంగా విమ‌ర్శించ‌టం త‌ప్పు. మ‌నిషి ప‌వ‌ర్లో ఉండ‌గా విమ‌ర్శించ‌టం వేరు.. ఓడాక విమ‌ర్శించ‌టం చేత‌కానిత‌నం. ప్ర‌త్య‌ర్థి నిరాయుధుడై నిల‌బ‌డితే వ‌దిలేయాలి. అంతేకానీ.. అవ‌కాశం దొరికింది క‌దా అని ట్రోల్ చేయ‌టం ఒక శాడిజంగా నాగ‌బాబు పోస్ట్ చేశారు. సాపేక్షంగా చూస్తే.. ఈ వాద‌న‌లో అంతో ఇంతో నిజ‌ముంది. కానీ.. రాజ‌కీయ శ‌త్రుత్వం వ్య‌క్తిగ‌త స్థాయికి వెళ్లిపోయిన స‌మూహంలో ఇలాంటి ఉన్న‌త భావాల్ని ఆశించ‌టం అత్యాశే అవుతుందేమో?