Begin typing your search above and press return to search.

ఈ ఐదు చోట్ల ఎమ్మెల్సీలు ఏకగ్రీవం!

By:  Tupaki Desk   |   28 Feb 2023 11:11 AM GMT
ఈ ఐదు చోట్ల ఎమ్మెల్సీలు ఏకగ్రీవం!
X
ప్రస్తుతం ఏపీలో ఉపాధ్యాయుల కోటా, పట్టభద్రుల కోటా, స్థానిక సంస్థల కోటా, ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. వీటిని దక్కించుకోవడానికి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పోటీ పడుతున్నాయి.

అయితే స్థానిక సంస్థల కోటా, ఎమ్మెల్యేల కోటాలో వైసీపీకి అత్యధిక మెజారిటీ ఉండటంతో అన్ని సీట్లను ఆ పార్టీనే సులువుగా గెలుచుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల స్థానిక సంస్థల కోటాలో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

స్థానిక సంస్థల కోటాలో 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇందులో ఐదు స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. నామినేషన్ల పరిశీలన అనంతరం వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల స్థానిక సంస్థల కోటాలో వైసీపీ అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 27 వరకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఐదు జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండటంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 9 స్థానాల్లో 5 స్థానాలను అధికార వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్నట్టయింది.

వైఎస్సార్‌ జిల్లాలో వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే అనంతపురం జిల్లాలో కూడా వైసీపీ అభ్యర్థి ఎస్‌.మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అదేవిధంగా చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో నామినేషన్ల చివరి తేదీ నాటికి వైసీపీ అభ్యర్థి సిపాయి సుబ్రహ్మణ్యం ఒక్కరే బరిలో నిలిచారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇక శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేరిగ మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి దేవారెడ్డి నాగేంద్ర ప్రసాద్‌ అభ్యర్థిత్వాన్ని తాను బలపరచలేదని, తన సంతకాలు ఫోర్జరీ చేశారని సూళ్లూరుపేట కౌన్సిలర్‌ చెంగమ్మ రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో స్వతంత్ర అభ్యర్థి నాగేంద్ర ప్రసాద్‌ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దీంతో బరిలో వైసీపీ అభ్యర్థి మేరిగ మురళి మాత్రమే ఉండటంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అదేమాదిరిగా తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా కుడుపూడి సూర్యనారాయణరావు ఎన్నికయ్యారు. టీడీపీకి చెందిన కడలి శ్రీదుర్గ, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను సాంకేతిక కారణాలతో అధికారులు తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ నాటికి బరిలో వైసీపీ అభ్యర్థి కుడుపూడి సూర్యనారాయణరావు మాత్రమే ఉన్నారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.