Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల టెన్ష‌న్‌.. గుబులు రేపుతున్న బాబు వ్యూహం!

By:  Tupaki Desk   |   16 March 2023 6:00 AM GMT
జ‌గ‌న్‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల టెన్ష‌న్‌.. గుబులు రేపుతున్న బాబు వ్యూహం!
X
ఫ‌స్ట్ టైమ్‌.. తొట్ట తొలిసారి..వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం జ‌గ‌న్ ఎన్నిక‌లంటే భ‌య‌ప‌డుతున్నారా? అందునా.. 151 మంది ఉన్న సొంత పార్టీ ఎమ్మెల్యేలే త‌న పుట్టి ముంచేస్తార‌ని తిక‌మ‌క ప‌డుతున్నారా? పైగా.. రాజ‌కీయ దిట్ట చంద్ర‌బాబు వ్యూహంతో జ‌గ‌న్ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఉపాధ్యాయ‌, గ్రాడ్యుయేట్ ఎన్నిక‌లు ఎలా ఉన్నా.. ఎమ్మెల్యే కోటాలో ఉన్న ఏడు స్థానాల‌కు జ‌రుగుతున్న పోలింగ్ కీల‌కంగా మారింది.

కాదు.. కాదు.. చంద్ర‌బాబు వ్యూహంతో ఈ ఎన్నిక కీల‌కంగా మారిపోయింది. ఇదే ఇప్పుడు జ‌గ‌న్ ను తీవ్ర ఇర‌కాటంలోకి నెట్టేస్తోంది. ఆ.. టీడీపీకి సంఖ్యాబలం ఏముంది లే! అని లైట్ తీసుకున్న జ‌గ‌న్‌ కు.. ఇప్పుడు బాబు చుక్క‌లు చూపిస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో మొత్తం 7 స్థానాల‌కు ఈ నెల 23న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. సంఖ్యా ప‌రంగా చూస్తే.. ఒక్కొక్క ఎమ్మెల్సీ అభ్య‌ర్థికి 23 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు అవ‌స‌రం. అయితే.. టీడీపీ కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. ఒక స్థానానికి పంచుమ‌ర్తి అనురాధ‌తో నామినేష‌న్ వేయించింది.

ఈమె బీసీ(ప‌ద్మ‌శాలి) వ‌ర్గానికి చెందిన విజ‌య‌వాడ మాజీ మేయ‌ర్‌. పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్. స‌రే.. టీడీపీఆమెను ఎలా గెలిపించు కుంటుంది? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఆమె గెల‌వాలంటే.. 23 మంది ఎమ్మెల్యేలు కావాలి. టీడీపీ 23 మందిని గ‌త ఎన్నిక‌ల్లో గెలిపించుకున్నా.. న‌లుగురు వైసీపీకి మ‌ద్దతు దారులుగా మారిపోయారు. అయినా.. కూడా చంద్ర‌బాబు దూకుడుగా పంచు మ‌ర్తిని రంగంలోకి దింపారు. అంతేకాదు.. ఇటీవ‌ల కాలంలో వైసీపీకి రెబ‌ల్‌ గా మారిన వారు త‌మ‌కు అనుకూలంగా ఓటేస్తార‌ని కూడా చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌లు లీకు చేస్తున్నారు.

దీంతోకోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి, ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి వంటివారు టీడీపీకి అనుకూలంగా ఓటేసే అవ‌కాశం ఉంది. అదేస‌మ‌యం లో చాలా మంది ఎమ్మెల్యేలు అంటే.. మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌నివారు.. ప్రాధాన్యం లేని వారు.. అసంతృప్తితో ర‌గులుతున్నప్ప‌టికీ పైకి క‌నిపించ‌ని వారు క్రాస్ ఓటింగ్ చేసే అవ‌కాశం ఉంది. దీనిని గ్ర‌హించిన సీఎం జ‌గ‌న్ తాజాగా జ‌రిగిన కేబినెట్ భేటీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల‌ను గెలిపించే బాద్య‌త‌ల‌ను సీఎం జ‌గ‌న్‌.. మంత్రుల భుజాల‌పైనే మోపేశారు. దీంతో మంత్రులు రంగంలోకి దిగి ఎమ్మెల్యేల‌ను త‌మ‌వైపు తిప్పుకొని ఎక్క‌డా ఓట్లు చేజార‌కుండా చూడాల్సి ఉంటుంద‌న్న మాట‌. మ‌రి ఈ వ్యూహం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.