Begin typing your search above and press return to search.

బీజేపీ నేత‌ల‌కు డిపాజిట్ వ‌స్తే గుండు గీసుకుంటా

By:  Tupaki Desk   |   3 Jun 2018 3:26 PM GMT
బీజేపీ నేత‌ల‌కు డిపాజిట్ వ‌స్తే గుండు గీసుకుంటా
X
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కుటుంబానికి వీర విధేయుడిగా పేరుండటమే కాకుండా కొన్ని సంద‌ర్భాల్లో అవ‌స‌రానికి మించి స్పందించే నాయ‌కుడిగా రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషించే టీడీపీ ఎమ్మెల్సీ - ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుపై బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు చేయడం నీచమైన చర్య అని అన్నారు. వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధ‌మైన కన్నా ఆ నిర్ణ‌యం ఉప‌సంహ‌రించుకొని బీజేపీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం వెనుక కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కన్నా మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అవినీతి చిట్టా అంతా ప్రజల దగ్గర ఉందని ప‌రోక్ష హెచ్చ‌రిక‌లు చేశారు. టీడీపీపై కన్నా లక్ష్మీనారాయణ‌ చేస్తున్న అవినీతి ఆరోపణలు అర్ధం లేనివని - మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతిని నిరూపించేందుకు తాము సిద్ధమ‌ని స‌వాల్ విసిరారు.

ప్రజల్లోకి వెళ్ళే హక్కు బీజేపీకి లేదని - బీజేపీ ఏపీలో అధికారంలోకి రావటం పగటి కలేన‌ని బుద్దా వెంక‌న్న ఎద్దేవా చేశారు. ``బీజేపీ సీనియ‌ర్ నేత‌లైన సోము వీర్రాజు - పురంధేశ్వరి - కన్నా లక్ష్మీ నారాయణతో సహా ఇతర బీజేపీ నాయకుల్లో ఎవరికైనా ఏపీలోని 175 అసెంబ్లీ - 25 ఎంపీ స్ధానాల్లో పోటీ చేసి ఎవరికైనా డిపాజిట్ వస్తే గుండు గీయించుకుంటా`` అని సంచ‌ల‌న స‌వాల్ విసిరారు. కన్నా అవినీతి విచారణను తప్పించుకొనేందుకే బీజేపీలో చేరారని ఆరోపించారు. దేశంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, ఏపీలో బీజేపీ గ్రాఫ్ తగ్గింది చంద్రబాబు పోరాటం వ‌ల్లేన‌ని ఆశ్చ‌ర్య‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. చంద్రబాబు ఉన్నంత వరకూ ఆయనే ముఖ్యమంత్రి అని, దేశాన్ని శాసించేది చంద్రబాబేనని వ్యాఖ్యానించారు.

జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ వాణిజ్య కూడళ్ళలో మాత్రమే కార్యక్రమాలు నిర్వహిస్తూ జనసందోహం అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. `రెచ్చిపోతే అని చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదు. ప‌వ‌న్‌..నీ వల్ల ఏమీ కాదు`` బుద్దా వెంక‌న్న వ్యాఖ్యానించారు. `ఇంకానయం...నేను ప్రచారం చేయబట్టే అశొక్ గజపతి రాజు రాజు అయ్యాడని పవన్ అనలేదు``అని అన్నారు. టీడీపీని అధికారంలోకి తెచ్చానంటున్న చంద్ర‌బాబు చిరంజీవి ముఖ్యమంత్రిగా పవన్ ఎందుకు చేయలేదని బుద్దా వెంక‌న్న ప్ర‌శ్నించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ డైరెక్షన్‌లో జ‌గ‌న్‌ - ప‌వ‌న్ నడుస్తున్నారని వెంక‌న్న ఆరోపించారు.