Begin typing your search above and press return to search.

పెద్ద‌చేప జంపింగ్‌ను మిస్ చేసుకున్న బీజేపీ

By:  Tupaki Desk   |   2 July 2019 3:30 PM IST
పెద్ద‌చేప జంపింగ్‌ను మిస్ చేసుకున్న బీజేపీ
X
వ‌రుస జంపింగ్‌ లతో కుదేల‌వుతున్న కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ....ఆ పార్టీ కీలకనేత మర్రి శిశిధర్‌ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేర‌నున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ లో భాగంగా,ఇప్పటికే పలువురు కీలకనేతలు, సిట్టింగ్‌ లు బీజేపీ తీర్థం పుచ్చుకోగా అదే ఒర‌వ‌డిలో మర్రి శశిధర్‌ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్‌ లో త‌న‌కు జ‌రిగిన అన్యాయం నేప‌థ్యంలో....ఆయ‌నీ నిర్ణ‌యం తీసుకుంటార‌ని కొంద‌రు అంచ‌నా వేశారు. అయితే, దీనిపై మ‌ర్రి స్పందిస్తూ కాషాయ కండువా కప్పుకుంటారని వ‌స్తున్న‌ వార్తలు నిజం కాద‌న్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో సనత్‌ న‌గర్ సీటు ఆశించి భంగపడ్డ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్ రెడ్డి అప్పటి నుంచి పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అదే స‌మ‌యంలో పార్టీ భ‌విష్య‌త్‌ పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో మర్రి శశిధర్ రెడ్డికి అమిత్ షా రెడ్ కార్పెట్ పరిచినట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కాంగ్రెస్ శ్రేణులు షాక్‌ కు గుర‌య్యాయి. పార్టీకి ముఖ్యనేత గుడ్‌ బై చెప్పేయ‌డం శ్రేణుల‌ను గంద‌ర‌గోళ‌ప‌రుస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో మ‌ర్రిశ‌శిధ‌ర్ రెడ్డి మీడియా ముందుకు వ‌చ్చి త‌న వాద‌న వినిపించారు.

తాను పార్టీ మారుతున్నానన్న వార్తలన్నీ అవాస్తవమేనని మర్రి కొట్టిపారేశారు. అసలు సిసలైన గాంధేయవాదినైన తాను విలువలకు, సిద్ధాంతాలకు రాజీపడని వ్యక్తిని తానని.. బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. లౌకికవాదమనేది కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయం వారసత్వంగా వచ్చిందని పేర్కొంటూ గాడ్సే వారసులతో చేతులు కలపడం జరగని పని అని మర్రి చెప్పుకొచ్చారు. కాగా, బీజేపీకి మ‌ర్రి ఊహించ‌ని షాక్ ఇచ్చార‌ని అంటున్నారు.