Begin typing your search above and press return to search.

ఉచిత రవాణా.. తొలిసారి ఆ దేశంలోనే స్టార్ట్ చేశారు

By:  Tupaki Desk   |   1 March 2020 11:20 AM IST
ఉచిత రవాణా.. తొలిసారి ఆ దేశంలోనే స్టార్ట్ చేశారు
X
కొన్ని దేశాల్లో అమలయ్యే పథకాల గురించి విన్నంతనే నిజమా? అన్న ఆశ్చర్యంతో పాటు.. ఇలా సాధ్యమేనా? అన్న భావన కలుగుతుంది. ప్రపంచంలో మరే దేశంలోనూ లేని ఒక ఉచిత పథకాన్ని అమలు చేస్తూ ఒక బుల్లి దేశం సంచలనంగా మారటమే కాదు.. అన్ని దేశాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అంతకంతకూ పెరుగుతున్న వాహనాల రద్దీ.. ట్రాఫిక్ జాం.. వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకు వీలుగా ప్రజా రవాణాను ఉచితంగా ప్రకటించిన లగ్జెంబర్గ్ సంచలనంగా మారింది.

మన విశాఖపట్నానికి కాస్త పెద్దదిగా ఉండే ఈ బుల్లి దేశం ఇప్పుడు వాయు కాలుష్యాన్ని.. విపరీతమైన ట్రాఫిక్ జాంను ఎదుర్కొంటోంది. ఈ దేశానికి చుట్టూ ఉండే ఫ్రాన్స్.. జర్మనీ.. బెల్జియం దేశాల నుంచి నిత్యం రెండు లక్షల మంది ఈ అందమైన దేశానికి వస్తుంటారు. దీంతో.. ట్రాఫిక్ ఒత్తిడి రోజురోజుకీ పెరిగిపోతోంది.

దీంతో.. ప్రజా రవాణాను వదిలేసి.. ఎవరికి వారు సొంత వాహనాల్ని రోడ్ల మీదకు తీసుకురావటంతో ట్రాఫిక్ మరింత దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేలా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. వాహన యజమానులు తమ సొంత వాహనాల్ని రోడ్ల మీదకు తగ్గించేందుకు వీలుగా.. ప్రజా రవాణా అయిన రైలు.. బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.

అంటే.. ఈ దేశంలో రైళ్లు.. బస్సులు.. ఏం ఎక్కినా ఉచితమే. దీంతో.. దేశంలోని ప్రతి పౌరుడికి ఏడాదికి రూ.8వేల వరకూ ఆదా అవుతుందని చెబుతున్నారు. ప్రజా రవాణా ఉచితమే అయినా.. కొన్ని కండిషన్లను పెట్టారు. ఉదాహరణకు రైళ్లల్లో ఫస్ట్ క్లాస్ ప్రయాణం చేయాలంటే టికెట్ కొనుగోలు చేయాల్సిందే.

అదే విధంగా రాత్రివేళలో బస్సుల్లో.. రైళ్లల్లో ప్రయాణించాలంటే తప్పనిసరిగా డబ్బులు చెల్లించాల్సిందే. మొత్తంగా చూసినప్పుడు మాత్రం.. మరే దేశంలో లేని రీతిలో ప్రజా రవాణా ఉచితం కావటంపై మాత్రం లగ్జెంబర్గ్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకంతో ప్రజలు తమ సొంతవాహనాల్ని వినియోగించటం తగ్గిపోవటం ఖాయమంటున్నారు.