Begin typing your search above and press return to search.

శభాష్ కేటీఆర్.. మరోసారి మనసు దోచేశాడు

By:  Tupaki Desk   |   18 Nov 2021 12:03 PM IST
శభాష్ కేటీఆర్.. మరోసారి మనసు దోచేశాడు
X
రాజకీయాల్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. అందులో మంచి చెడుల గురించి వెతకటం.. దాని గురించి చెప్పటం లాంటివి కాస్తంత కష్టమైన పని. రాజకీయ నాయకుడు వ్యక్తిగతంగా వ్యవహరించే కొన్ని పనులు వారు ఎలాంటి వారన్న విషయాన్ని తెలియజేస్తుంటాయి.

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను మాత్రం ఒక విషయంలో ఆయన్ను అభినందించాల్సిందే. ఆయన కాన్వాయ్ ఎంత వేగంగా వెళుతుందో తెలిసిందే. ఆ వేగంలోనూ రోడ్ల మీద ఏదైనా యాక్సిడెంట్ జరిగినట్లుగా గుర్తించినంతనే తన కాన్వాయ్ ను ఆపేసి మరీ.. సాయం చేసే తీరు ఆయనకు ఎక్కువ.

గతంలోనూ పలు సందర్భాల్లోనూ రోడ్డు ప్రమాదాల్లో గాయపడి.. సాయం కోసం చూస్తున్న వారిని వెంటనే తన వాహన శ్రేణి ద్వారా సాయం చేయటం తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి పనే చేసి మానవత్వాన్ని ప్రదర్శించారు. బుధవారం రాత్రి మియాపూర్ కు చెందిన ఇద్దరు (పవన్.. నగేష్) శామీర్ పేటకు వెళ్లి తిరిగి వస్తున్నారు. హకీంపేట నిషా వద్ద వారు ప్రయాణిస్తున్న బైక్ పట్టు తప్పి జారి కిందకు పడిపోయింది.

దీంతో.. వారు తీవ్ర గాయాలపాలయ్యారు. రాత్రి వేళ కావటం.. ఎవరూ వారికి సాయం అందించని పరిస్థితి.ఇలాంటి వేళ.. మంత్రి కేటీఆర్ కాన్వాయ్ అదే దారిలో వెళుతోంది. రోడ్డు మీద జరిగిన ప్రమాదాన్ని గుర్తించిన ఆయన.. వెంటనే తన కాన్వాయ్ ను నిలిపేశారు.

ప్రమాదం బారిన పడిన వారి వద్దకు స్వయంగా వెళ్లటమే కాదు.. వారికి అవసరమైన వైద్య సాయం కోసం తన కాన్వాయ్ లోని వాహనంలో వారిని చేర్చి.. దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మరోసారి మానవత్వాన్ని చాటారు. రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లుగా గుర్తించినంతనే.. కాన్వాయ్ ను ఆపి సాయం చేయటంలో కేటీఆర్ ఎప్పుడూ ముందుంటారు. ఈ విషయంలో మాత్రం ఆయనకు శభాష్ అని అభినందించాల్సిందే.