Begin typing your search above and press return to search.

జగన్ పెద్దన్నలాంటివారు.. చంద్రబాబుతో గ్యాప్ అందుకే: కేటీఆర్

By:  Tupaki Desk   |   2 Jun 2022 4:23 AM GMT
జగన్ పెద్దన్నలాంటివారు.. చంద్రబాబుతో గ్యాప్ అందుకే: కేటీఆర్
X
ఎన్నో సుదీర్ఘ పోరాటాల తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. తద్వారా తెలంగాణలో సకల జనుల కల సాకారమైంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ, మున్సిపల్, పట్టణాభిృద్ధిశాఖల మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు పెద్దన్నలాంటి వారని కేటీఆర్ చెప్పారు. అలాగే జగన్ అంటే తన తండ్రి కేసీఆర్ కూడా ఆప్యాయత చూపుతారని అన్నారు. ఏపీలో జగన్ సీఎం అయిన తరువాత కేసీఆర్ తో సత్సంబంధాలు కొనసాగించారని గుర్తు చేశారు. జగన్ ప్రమాణ స్వీకారానికి సైతం హాజరైన కేసీఆర్ పలు సందర్భాల్లో అమరావతికి వచ్చారన్నారు. జగన్ సైతం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కేసీఆర్ తో కలిసి ఉమ్మడి రాష్ట్రాల అంశాల పైన సమావేశాలకు హాజరయ్యారని తెలిపారు.

రాజకీయాల్లో శత్రువులు ఎవరూ ఉండరని.. ప్రత్యర్థులు మాత్రమే ఉంటారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో తమకు మంచి సంబధాలున్నాయని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కూడా ఎలాంటి విభేదాలు లేవని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే ఆయన తమను ఓడించడానికి తమ ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్ తో చేతులు కలిపారని గుర్తు చేశారు. దీంతో సహజంగానే ఆయనతో తమకు కొంత గ్యాప్ వచ్చిందన్నారు.

కాగా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రాలో విద్యుత్ కోతలు, రోడ్ల దుస్థితి దారుణంగా ఉన్నాయని ఆంధ్రలోని తన స్నేహితులు చెప్పారంటూ బాంబు పేల్చారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. వైఎస్సార్సీపీ నేతలు, మంత్రులు కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి, ఆంధ్రాలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో కేటీఆర్ వివరణ ఇచ్చారు. పిచ్చాపాటీగా చేసిన వ్యాఖ్యలని.. తన మాటల వెనుక ఎలాంటి ఉద్దేశం లేదన్నారు. ఎవరైనా తన మాటలకు బాధపడితే క్షమించాలని కోరారు.

ఈ నేపథ్యంలో ఇటీవల కేటీఆర్, వైఎస్ జగన్ స్విట్జర్లాండ్ లోని దావోస్ లో కలిశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న వారిద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఈ మేరకు కేటీఆర్ జగన్ తో దావోస్ లో దిగిన ఫోటోను ట్విట్టర్ లో పంచుకున్నారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

కాగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో గెలిచి తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే మళ్ళీ 2018లోనూ గెలిచి రెండోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కేసీఆర్ రెండు క్యాబినెట్ లలో కేటీఆర్, హరీష్ రావులకు చోటు లభించిన సంగతి తెలిసిందే.