Begin typing your search above and press return to search.

కోడెల శివరాం జనసేనకు జంప్ నా...?

By:  Tupaki Desk   |   15 Dec 2022 12:30 PM GMT
కోడెల శివరాం జనసేనకు జంప్ నా...?
X
మాజీ మంత్రి, విభజన ఏపీ ఫస్ట్ స్పీకర్ కోడెల శివప్రసాద్ అంటే పల్నాడు ప్రాంతంలో మంచి పేరు ఉంది. ఆయన డాక్టర్ గా కూడా ఎంతో సుపరిచితులు. ఎన్నో విజయవంతమైన శస్త్ర చికిత్సలు చేసి కీర్తి గడించారు. ఇక ఎన్టీయార్ పిలుపు మేరకు ఆయన రాజకీయాల్లోకి వచ్చి అక్కడా ఒక వెలుగు వెలిగారు. వృత్తి రిత్యా డాక్టర్ గా ఉన్నా ప్రవృత్తి రాజకీయం అయినా రెండింటికీ న్యాయం చేశారు.

ఆయనను అభిమానులు పల్నాడు పులి అని అంటారు. ఆయన తెలుగుదేశం పార్టీలో కూడా అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఆనాడు ఎన్టీయార్ తోనూ తరువాత రోజులల్లో చంద్రబాబుతో కూడా అంతే సన్నిహితంగా మెలిగారు. డేరింగ్ అండ్ డేషింగ్ గా పేరు గడిచిన కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకుని మరణించడం మాత్రం అందరికీ షాక్ కి గురి చేసింది. ఇక ఆయన 2014 నుంచి 2019 దాకా ఏపీ శాసన సభ స్పీకర్ గా ఉన్నపుడు ఆయన కొడుకు కూతురు ఇద్దరూ కూడా కోడెల సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో పెద్ద ఎత్తున రాజకీయ పెత్తనం చేశారని ప్రచారంలో ఉంది.

అంతే కాదు టాక్సుల పేరిట బాగా వసూళ్ళు చేసేవారు అని కధలుగా చెప్పుకున్నారు. ఫలితంగా సత్తెనప్పల్లిలో వారు చెడ్డ పేరు తెచ్చుకున్నారు. పెద్దాయన కోడెలకు కూడా తలవంపులు గా ఆనాటి వీరి రాజకీయ పెత్తనం మారింది అని అంటారు. ఇక కోడెల మరణించారు. ఆయన రాజకీయ వారసత్వం కోసం కొడుకు కోడెల శివరాం గట్టి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. సత్తెనపల్లిలో పోటీ చేసేది తానే అని ఆయన అంటున్నారు.

ఈ మధ్య తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని శివరాం కలసినపుడు సత్తెనపల్లిలో పోటీ విషయం ప్రస్తావించారని తెలిసింది. దానికి బదులిచ్చిన చంద్రబాబు మీ నాన్న అంటే నాకు చాలా గౌరవం ఉంది. అందువల్ల టికెట్ ఇవ్వలేను కానీ సత్తెనపల్లిలో పార్టీని బలోపేతం చేయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగా చూసుకుంటాను అని హామీ ఇచ్చారని ప్రచారం సాగుతోంది.

సీటు ఇవ్వను అని కోడెల శివరాం కి బాబు అలా పక్కా క్లారిటీతో చెప్పేశారు అని అంటున్నారు. దాంతో కోడెల ఫ్యామిలీ డీలా పడింది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో కోడెల కుటుంబం ఈ విషయం మీద సీరియస్ గానే డిస్కషన్ చేసింది అని అంటున్నారు. ఇక ఎటూ వైసీపీలోకి పోలేరు. అక్కడ సీటు ఇచ్చే చాన్స్ లేదు కాబట్టి జనసేనను ఆప్షన్ గా కోడెల ఫ్యామిలీ ఎంచుకుంది అని అంటున్నారు. కోడెల శివరాం దీని మీద జనసేనలో నంబర్ టూ గా ఉన్న నాదెండ్ల మనోహర్ తో చర్చించారని అంటున్నారు.

తనకు వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి టికెట్ విషయంలో గ్యారంటీ ఇస్తే కనుక జనసేనలోకి జంప్ అవుతాను అని శివరాం చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే నాదెండ్ల ఎటువంటి హామీ ఇవ్వలేదు కానీ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తో చెప్పి ఉంచుతాను అని మాత్రం అన్నారట. అంటే పవన్ కళ్యాణ్ కనుక ఓకే అంటే శివరాం జనసేనలోకి జంప్ అవడం గ్యారంటీ అని అంటున్నారు.

ఇక సత్తెనపల్లిలో చూస్తే అక్కడ టఫ్ కాంపిటేషన్ ఎపుడూ ఉంటుంది. కోడెల 2014లో గెలిచారు. అప్పట్లో ఆయన మీద వైసీపీ నుంచి పోటీ చేసిన అంబటి రాంబాబు ఓడారు. అయితే 2019 ఎన్నికల్లో అంబటి కోడెలను ఓడించారు. 2024లో ఈ సీటుని అంబటికి ఇస్తారో లేదో తెలియదు. అయితే టీడీపీ నుంచి పోటీ ఉంది. 2009 వరకూ ఇక్కడ ఎక్కువగా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్ధులే ఎక్కువగా గెలిచారు. 1983లో మాత్ర్రం టీడీపీ తరఫున నన్నపనేని రాజకుమారి గెలిచారు.

ఇక్కడ రెడ్డి సామాజికవర్గం అభ్యర్ధులు ఎక్కువగా గెలిచారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి పోటీ చేస్తారు అని అంటున్నారు. ఇక జనసేన తరఫున పోటీ చేసిన యెర్రం వెంకటేశ్వరరెడ్డి దాదాపుగా పదివేల ఓట్లు తెచ్చుకునారు. ఆయన 2004 2009లో కాంగ్రెస్ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన వారు. వచ్చే ఎన్నికల్లో ఆయన జనసేన తరఫున పోటీ అంటున్నారు. మరి ఆయన్ని కాదని, రాజకీయ సామాజిక పరిస్థితులను బేరీజు వేసుకోకుండా జనసేన ఈ టికెట్ శివరాం కి ఇస్తుందా అన్నది చూడాలి.

అదే టైంలో తెలుగుదేశంతో పొత్తు ఉంటే కచ్చితంగా టీడీపీ ఈ సీటు మీద పట్టుపడుతుంది. దాంతో కోడెల శివరాం ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో తెలియదు అంటున్నారు. ఏది ఏమైనా కోడెల అంటే ఎంతో ప్రేమ చూపించే చంద్రబాబు శివరాం కి టికెట్ నో చెప్పారూ అంటేనే అర్ధం చేసుకోవాలి అని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.