Begin typing your search above and press return to search.

ఒక్క అడుగు.. ప్రపంచకప్‌ ను దూరం చేసింది

By:  Tupaki Desk   |   15 July 2019 9:30 AM GMT
ఒక్క అడుగు.. ప్రపంచకప్‌ ను దూరం చేసింది
X
అది మ్యాచ్‌ లో 49వ ఓవర్. బంతి బంతికీ ఇంగ్లాండ్‌ విజయావకాశాలు తగ్గిపోతున్నాయి. 9 బంతులే మిగిలాయి. ఇంకా 22 పరుగులు చేయాలి. క్రీజులో స్టోక్స్ ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ గెలుపు చాలా కష్టంగానే కనిపిస్తోంది. ఒకట్రెండు బౌండరీలు బాదితే తప్ప ఇంగ్లిష్ జట్టు పరిస్థితి మెరుగయ్యేలా లేదు. ఈ స్థితిలో భారీ షాట్‌ కు ప్రయత్నించాడు స్టోక్స్. బంతి లాంగాన్ వైపు గాల్లో లేచింది. స్టోక్స్ బంతిని సరిగ్గా అందుకుంటే బంతి స్టాండ్స్‌ లోనే తేలాలి. కానీ బంతి సరిగా కనెక్ట్ కాలేదని అర్థమైపోయింది. బంతి బౌండరీ హద్దుల్లోపే ఉంది. ఫీల్డర్ దాన్ని అందుకోవడానికి వస్తున్నాడు. వచ్చాడు. బంతిని ఒడిసి పట్టేశాడు. క్యాచ్ ఔట్. స్టోక్స్ వెనుదిరిగినట్లే. ఇంగ్లాండ్ కథ ముగిసినట్లే... అని అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు.

కానీ రెప్పపాటులో ఊహించనిది జరిగింది. క్యాచ్ అందుకున్న బౌల్ట్.. తాను ఎక్కడున్నది అంచనా వేయలేకపోయాడు. బౌండరీకి అడుగు దూరంలో అతను క్యాచ్ అందుకున్నాడు. వెనక్కి వెళ్తూ క్యాచ్ పట్టేసరికి తమాయించుకోవడం కష్టమైంది. అడుగు వేయబోతూ వెనక్కి చూశాడు.. ఆగుదామని చూసినా అవ్వలేదు. అవతల ఫీల్డర్‌ కు బంతి విసిరేశాడు కానీ.. ఆలోపే కాలు బౌండరీ హద్దును తాకేసింది. రీప్లే కూడా చూడాల్సిన అవసరం లేకుండా అది సిక్సర్ అని ప్రకటించేశాడు అంపైర్. బౌల్ట్ కాస్త తమాయించుకుని ఉంటే స్టోక్స్ ఔటయ్యేవాడు. ఇంగ్లాండ్ 8 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి వచ్చేది. మిగిలనవి 2 వికెట్లే. ఆడాల్సింది బౌలర్లే. కాబట్టి ఛేదన అసాధ్యమయ్యేది. మ్యాచ్ న్యూజిలాండ్ సొంతమయ్యేది. ఆ జట్టే ప్రపంచకప్‌‌ ను అందుకునేది. స్టోక్స్ ఔటవ్వాల్సిన బంతికి సిక్సర్ రావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఇంగ్లాండ్ మ్యాచ్‌ ను టై చేసింది. ఆ తర్వాత సూపర్ ఓవర్ కూడా టై అయినా.. బౌండరీలు ఎక్కువ బాదినందుకు ఇంగ్లాండ్ కప్పును అందుకుంది. గొప్ప క్యాచ్ పట్టినా.. తనను తాను నియంత్రించుకోలేకపోవడంతో బౌల్ట్ తన జట్టుకు ప్రపంచకప్‌ నే దూరం చేసినట్లయింది