Begin typing your search above and press return to search.

చైనాకు గువ్వల బాలరాజు

By:  Tupaki Desk   |   8 Sep 2015 12:27 PM GMT
చైనాకు గువ్వల బాలరాజు
X
మాజీ మంత్రి డీకే అరుణ సోదరుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని చెంప దెబ్బ కొట్టిన గువ్వల బాలరాజును ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తన వెంట చైనాకు తీసుకుని వెళ్లిపోయారు. అయితే, చైనా పర్యటన ఎప్పుడో ఖరారవుతుంది కదా.. ఆయన పర్యటన కూడా ఎప్పుడో ఖరారయ్యే ఉంటుందని చాలామంది భావించారు. కానీ, చివరి నిమిషంలో మార్పులతోనే బాలరాజును కేసీఆర్ తన వెంట తీసుకెళ్లారని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రామ్మోహన రెడ్డిని కొట్టిన గువ్వల బాలరాజుపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తోంది. రాస్తారోకోలు, ధర్నాలతో వేడి పుట్టిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో బాలరాజు ఇక్కడే ఉంటే అతడిపై మరింత ఒత్తిడి పడుతుంది. అది కూడా దాదాపు 20 రోజులపాటు తాను లేకుండా ఉన్నప్పుడు బాలరాజు ఇక్కడే ఉండడం అంత మంచిది కూడా కాదని కేసీఆర్ భావించారని చెబుతున్నారు. అందుకే చివరి నిమిషం మార్పులతో బాలరాజును చైనా విమానం ఎక్కించేశారని అధికార పార్టీలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 20 రోజులపాటు విదేశీ ప్రయాణం చేసి వస్తే.. కాంగ్రెస్ ఆందోళనలు ఇక్కడ చల్లబడతాయని, ఆ పార్టీ అప్పుడు మరో అంశంపై ఆందోళనలు చేస్తుందని, తద్వారా చెంప దెబ్బ కొట్టిన అంశం వెనక్కి పోతుందనేది కేసీఆర్ ఆలోచనగా వివరిస్తున్నారు.

వాస్తవానికి, చంద్రబాబును రెడ్ హ్యాండెడ్ గా పట్టిచ్చిన స్టీఫెన్సన్ కు పెద్దపీట వేస్తున్నట్లే కాంగ్రెస్ ఎమ్మెల్యే ను కొట్టిన బాలరాజుకు కూడా కేసీఆర్ ప్రయారిటీ ఇస్తున్నారని, అందుకే బాలరాజుకు బహుమతిగా కూడా ఆయన తన వెంట చైనాకు తీసుకుపోయారని చెబుతున్నారు. భవిష్యత్తులో అవకాశం ఉంటే ఎస్సీ కోటాలో బాలరాజు మంత్రి అయినా ఆశ్చర్యం లేదని ఆ పార్టీ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి.