Begin typing your search above and press return to search.

జగన్ ఝలక్ : గులాబీ బాస్ గుస్సా...?

By:  Tupaki Desk   |   25 Jun 2022 12:30 AM GMT
జగన్ ఝలక్ : గులాబీ బాస్ గుస్సా...?
X
నిన్నటి దాకా రెండు ఒకటిగానే ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గానే అంతా ఉండేది. అలాంటిది తెలంగాణా ఆంధ్రాగా విడిపోయాక రాజకీయం కూడా భిన్న పోకడలు పోతోంది. దానికి తాజా ఉదాహరణ చూస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే అభ్యర్ధికి వైసీపీ మద్దతు ఇస్తే విపక్షాల అభ్యర్ధికి టీయారెస్ మద్దతు ఇచ్చింది. ఇది నిజంగా చెప్పాలీ అంటే నిట్టనిలువు చీలికగానే చూడాలి.

దేశం గురించి తరువాత ముందు తెలుగు రాజకీయాల గురించి మాట్లాడుకుంటే కేసీయార్ జాతీయ పార్టీ పెట్టాలని తెగ ఉవ్విళ్ళూరుతున్నారు. ఆయనకు సొంత ఇంట అదీ తెలుగు నట్టింట మద్దతు లేదన్న మెసేజ్ అయితే దేశానికి వెళ్ళిపోయింది. రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములుగా కలసి ఉందామని అనుకున్న మాటలూ వీగిపోయాయి.

చంద్రబాబు కేసీయార్ల మధ్య అయితే కొంత అంతరం ఉంది. బాబు మీద తిరుగుబాటు చేసి కేసీయార్ బయటకు వచ్చారు.అదే జగన్ విషయంలో అయితే కేసీయార్ కి చనువు ఉంది. జగన్ సైతం ఆయనతో బాగా ఉంటారని అనుకునే పరిస్థితి. అలాంటిది కేసీయార్ జాతీయ జెండాకు రంగులు అద్దుతూంటే జగన్ జై కాషాయం అని నినదించడం నిజంగా ఝలక్ ఇచ్చినట్లే అంటున్నారు.

ఇది ఒక విధంగా కేసీయార్ కి ఇబ్బందికరమైన పరిస్థితిగానే అంతా చూస్తున్నారు. కేసీయార్ ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి. అంటే ఉమ్మడి ఏపీలో ఉన్న 42 ఎంపీ సీట్లను తన జేబులో వేసుకుని ఢిల్లీకి బయలుదేరితే ఆ పలుకుబడి ఆ పవర్ వేరే లెవెల్ లో ఉంటాయి. కేసీయార్ కూడా అలాంటి ఆశే పెట్టుకుని 2019 ఎన్నికల వేళ జగన్ని ప్రోత్సహించి ఉంటారని అంటున్నారు. కానీ జగన్ ఇపుడు తన దారి తాను చూసుకున్నారని అంటున్నారు.

ఆయన బీజేపీతోనే కలసి ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నట్లుగా ఉంది. ఏపీలో రాజకీయం తీసుకుంటే చంద్రబాబు పవన్ కూడా బీజేపీ వైపే చూస్తున్నారు. జగన్ కాదనుకుంటే వారు తమ వైపు లాక్కుంటారు. అంతే కాదు ఏపీలో ఆర్ధిక అవసరాలు, వైసీపీ అధినాయకత్వం సొంత అవసరాలు అన్నీ వెరసి చూస్తే బీజేపీ అండ కావాలి.

అందుకే జగన్ ఆ వైపు మొగ్గారు అని చెబుతున్నారు. ఇక ఏపీలో బీజేపీ రాజకీయంగా బలంగా లేదు. ఈ రోజుకు పోటీ కూడా ఇవ్వలేదు. దాంతో జై మోడీ అనేయడం వైసీపీకి సులువు. కానీ తెలంగాణా అలా కాదు, కేసీయార్ ని దించేసి తాము ఎక్కాలని చూస్తోంది. అక్కడ బాగానే బలం ఉంది. ఇక కేసీయార్ మీద నేరుగా మోడీ షాలు గురి పెట్టేశారు. దాంతో కేసీయార్ కి ఢిల్లీ ఫైటింగ్ అనివార్యం.

దాంతో ఆయన కూడా కత్తీ డాలూ తీసుకుని జాతీయ రాజకీయాలలోకే అని సమరం చేయకపోతే కుదిరే పని కాదు. అలాంటి అనివార్యతలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇద్దరి మధ్య ఉండడం వల్లనే రాష్ట్రపతి ఎన్నికల్లో చేరో దారీ తీసుకున్నారు అంటున్నారు. అలాగని కేసీయార్ కి విపక్ష శిబిరంలో అంతా బాగుందా అంటే అదేమీ లేదు. అన్ని పార్టీలూ కలసినా కాంగ్రెస్ మద్దతు తీసుకోవాల్సిందే. ఆ విషయంలో మమత, కేజ్రీవాల్, ఆర్జేడీ, ఎన్సీపీ, స్టాలిన్ లకు, అలాగే కమ్యూనిస్టులకు పెద్దగా అభ్యంతరాలు లేవు.

కానీ కేసీయార్ కి తెలంగాణాలో కాంగ్రెస్ తో ఫైటింగ్ ఉంది. దాంతో ఆయన పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉందని అంటున్నారు. దాంతో రెండు పార్టీలకు సమదూరం అని సొంతంగా జాతీయ పార్టీ అని ఆయన పిలుపు ఇస్తున్నారు. ఆ పిలుపునకు ఆంధ్రా మిత్రుడు కలసివస్తారు అనుకుంటే గట్టిగానే ఝలక్ ఇచ్చేశారు. దాంతో గులాబీ బాస్ గుస్సా మీద ఉన్నారని అంటున్నారు. అయినా ఎవరేమీ చేయలేని పరిస్థితి. ఇది రాజకీయం అంతే. ఎవరి సొంత లెక్కలే వారిని అలా నడిపిస్తాయిక్కడ.