Begin typing your search above and press return to search.

అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాతే కేసీఆర్ జాతీయ పార్టీ?

By:  Tupaki Desk   |   7 Sep 2022 6:38 AM GMT
అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాతే కేసీఆర్ జాతీయ పార్టీ?
X
గడిచిన సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలను గాలికి వదిలేసి ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా.. రాహుల్ ను ప్రధానిని చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు చేయని రాజకీయం లేదు. అదే ఆయన ఓటమికి దారితీసింది. కాంగ్రెస్ ఒకప్పుడు టీడీపీకి బద్ధశత్రువు. ఆ పార్టీ కోసం పనిచేసిన చంద్రబాబు నిండా మునిగారు. ఏపీలో అధికారం కోల్పోయి.. ఢిల్లీ పరపతి లేకుండా పోయారు.

అలాంటి తప్పు చేయకూడదనే కేసీఆర్ మొదట రాష్ట్ర రాజకీయాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. జిల్లాల్లో పర్యటిస్తున్న కేసీఆర్.. 'తెలంగాణ ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే దేశ రాజకీయాలను మారుస్తానంటూ' ప్రకటిస్తున్నారు. అంతే తప్పా తానే జాతీయ రాజకీయాల్లోకి వెళుతానని నేరుగా చెప్పడం లేదు.

ఇప్పటికీ జాతీయ రాజకీయాలపై కేసీఆర్ తేల్చుకోలేకపోతున్నారు. ఫ్రంట్ కట్టాలా? పార్టీ పెట్టాలా? అన్నది స్పష్టతకు రాలేకపోతున్నారు. జాతీయ స్థాయిలో రైతు పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర పార్టీలను కలిసి కూటమి కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అన్నింటికంటే ముందు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి అధికారంలోకి రావడం అన్నది కేసీఆర్ ముందున్న టార్గెట్. తెలంగాణలో అధికారం నిలబెట్టుకోకపోతే మొదటికే మోసం వస్తుందని.. మరో చంద్రబాబులా తన పరిస్థితి తయారవుతుందని కేసీఆర్ కు బాగా తెలుసు.

అందుకే జాతీయ రాజకీయాలకంటే మొదట రాష్ట్ర రాజకీయాలకే కేసీఆర్ ప్రాముఖ్యతనిస్తున్నాడు. రాష్ట్రంలో పట్టు కోల్పోతే దేశంలో ఎవరూ పట్టించుకోరన్న కారణంగా సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే రెండు సార్లు గెలిచిన వ్యతిరేకత కేసీఆర్ సర్కార్ పై బాగా ఉంది. ఇదే క్రమంలో బీజేపీ దూసుకొస్తోంది. కాంగ్రెస్ ను రేవంత్ పటిష్టంగా తయారు చేస్తున్నాడు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ ఓట్ల చీలికను తట్టుకొని గెలవడం కేసీఆర్ కు అంత ఈజీ కాదు.

దేశంలో పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. తెలంగాణలో మూడోసారి పార్టీని అధికారంలోకి తేవాలని కేసీఆర్ భావిస్తున్నారు. బీజేపీని టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తేనే కేసీఆర్ జాతీయపార్టీ గురించి కార్యాచరణలోకి దిగుతారని అంటున్నారు.

జాతీయ పార్టీ గురించి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైలెట్ చేయాలని చూస్తున్నారు. తెలంగాణ బిడ్డ ఢిల్లీలో చక్రం తిప్పుతారని.. ఓడిస్తే తెలంగాణ అస్తిత్వానికి ముప్పు అని ప్రచారం చేయడానికి కేసీఆర్ డీసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరీ కేసీఆర్ ప్రచారం కు ఓట్లు రాలుతాయా? మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తారా? జాతీయ రాజకీయాలను ఏలుతారా? అన్నది కాలమే సమాధానం చెబుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.