Begin typing your search above and press return to search.

రాజీనామా ఆలోచనలో కడప ఎంఎల్ఏలు

By:  Tupaki Desk   |   27 April 2023 3:00 PM GMT
రాజీనామా ఆలోచనలో కడప ఎంఎల్ఏలు
X
వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని నిర్ధారణ అయితే వెంటనే తమ పదవులకు రాజీరామాలు చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రొద్దుటూరు ఎంఎల్ఏ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రకటించారు.

కోర్టులో అవినాష్ పాత్ర నిర్ధారణ కావటానికి ఎంఎల్ఏలు రాజీనామాలు చేయటానికి ఏమిటి సంబంధమో అర్ధంకావటంలేదు. ఒకవైపు కోర్టు విచారణలో అవినాష్ కడిగిన ముత్యంలాగ బయటకు వస్తారని సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇదే సమయంలో ఎంపీ దోషిగా తేలితే ఎంఎల్ఏ పదవులకు రాజీనామాలు చేస్తామని ప్రకటించారు.

ఇక్కడే రాచమల్లు ప్రకటనలో విరుద్ధమైన భావనలు కనబడుతున్నాయి. మొదటినుండి వివేకా హత్యతో అవినాష్ కు ఎలాంటి సంబంధంలేదనే తాను చెబుతున్న విషయాన్ని రాచమల్లు గుర్తుచేశారు. అవినాష్ ను హత్యకేసులో ఇరికించేందుకు చంద్రబాబునాయుడు, సుజనాచౌదరి, రఘు రామకృష్ణంరాజు లాంటి వాళ్ళు కుట్రచేస్తున్నట్లు ఆరోపించారు. వివేకా కూతురు సునీత వాళ్ళచేతిలో పావుగా మారిపోయిందని మండిపడ్డారు.

విచారణకు సీబీఐ పిలిపించి అవినాష్ ను అరెస్టుచేసినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదన్నారు. నిందితుడిగా చెప్పినంత మాత్రాన ఎంపీ దోషి అయిపోరని గుర్తుచేశారు. సీబీఐ అరెస్టుచేస్తే చేయనీయండి బెయిల్ తీసుకుని ఎంపీ బయటకు వస్తారని చెప్పారు.

ఎంపీని కేసులో ఇరికించేందుకు చూపిస్తున్న శ్రద్ధలో హత్యకేసును ఛేదించటంలో చూపించుంటే ఈపాటికే అసలు హంతకులు ఎవరు ? కారణం ఏమిటనేది బయటపడేదన్నారు. ఎలాంటి సంబంధంలేని ఎంపీని హత్యకేసులో అరెస్టుచేసేందుకు సీబీఐ ఎందుకింత ఉత్సాహం చూపిస్తోందో అర్ధంకావటంలేదని ఎంఎల్ఏ వాపోయారు.

అంతాబాగానే ఉంది కానీ ఎంపీ దోషిగా తేలితే ఎంఎల్ఏలందరు రాజీనామాలు ఎందుకు చేయాలో అర్ధంకావటంలేదు. ప్రభుత్వం ఎంపీని ఇరికించిందనే ఆరోపణలతో ఎంఎల్ఏలు రాజీనామాలు చేశారంటే అర్ధముంది.

కానీ అధికారంలో ఉన్నది వాళ్ళ ప్రభుత్వమే. కేంద్రంలోని ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి సఖ్యతగానే ఉంటున్నారు. కాబట్టి రాష్ట్రప్రభుత్వం మీద కానీ లేదా కేంద్రం మీద కానీ నిరసన చెప్పలేరు. ఎవరిమీదా నిరసన తెలియజేయలేనపుడు ఇక రాజీనామాలు చేయాలని ఎందుకు నిర్ణయించారు ? ఏమిటో రాచమల్లు రాజీనామాల ప్రకటన మాత్రం విచిత్రంగానే ఉంది.