Begin typing your search above and press return to search.

జూనియర్ టార్గెట్ 2029...?

By:  Tupaki Desk   |   1 April 2022 9:46 AM GMT
జూనియర్ టార్గెట్ 2029...?
X
అన్న గారి పార్టీకి అండగా ఉండాల్సిన మనవడు, నందమూరి వారి మూడవ తరం హీరో జూనియర్ ఎన్టీయార్ నో పాలిటిక్స్ అనేసి తమ్ముళ్ళకు నిరాశ మిగిల్చాడనే చెప్పాలి. ఒక వైపు చూస్తే ఎన్టీయార్ నటించిన ట్రిపుల్ ఆర్ రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఇక ఎన్టీయార్ నుంచి వరసబెట్టి వచ్చే సినిమాల లిస్ట్ చూస్తే ఆయన సూపర్ స్టార్ డం ని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టేవే. మరి అలాంటి బ్రహ్మాండమైన ఇమేజ్ కలిగిన జూనియర్ ఎంటీయార్ 2024 ఎన్నికల ముందు జనంలోకి వచ్చి టీడీపీ కొమ్ము కాస్తే కచ్చితంగా ఏపీలో సైకిల్ దూసుకుపోతుంది.

ఇది తమ్ముళ్ల మాట కూడా. అయితే ఎన్టీయార్ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. కుప్పంలో చంద్రబాబు ఆ మధ్యన టూర్ చేసినపుడు కూడా జూనియర్ ని తీసుకురండి సారూ అంటూ ఏకంగా బాహాటంగానే క్యాడర్ రిక్వెస్ట్ పెట్టేసింది. అడపా తడపా టీడీపీ ఫ్లెక్సీల మీద జూనియర్ హల్ చల్ చేస్తూ నారా వారి నాయకత్వాన్ని ఆలోచనలో పడేస్తున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో ఈసారి టీడీపీ కచ్చితంగా అధికారంలోకి రావాలీ అని ఒక బలమైన సామాజిక వర్గం ఆశిస్తోంది. వారు అటు టీడీపీ అధినాయకత్వంతోనూ మాట్లాడుతున్నారు. ఇటు జూనియర్ మీద కూడా వత్తిడి తెస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. ఏపీలో టీడీపీని ఈసారి గెలిపించుకోకపోతే ఉనికి దెబ్బతినే ప్రమాదం ఉందన్నది ఆ సామాజికవర్గం బాధ, ఆవేదన.

అందుకే ఇపుడు కాకపోతే మరెప్పుడు అని జూనియర్ ని టీడీపీ వైపుగా లాగే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. కానీ జూనియర్ మాత్రం రాజకీయాల మీద, తన ఎంట్రీ మీద పక్కా క్లారిటీతో ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఆయన రీసెంట్ గా మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనకు సినిమాలే ఇష్టమని చెప్పేసారు. ఇపుడు తనకు బాగా ఉందని, సినీ జీవితంతో సంతృప్తి చెందుతున్నాను అని అన్నారు.

అయితే ప్రస్తుతం, ఇపుడు అన్న మాటలే ఆయన వాడారు. అదే టైం లో ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అని ఆలోచించను అని కుండబద్ధలు కొట్టారు. దీన్ని బట్టి చూస్తూంటే జూనియర్ ఎన్టీయార్ కి రాజకీయాల మీద ఆసక్తి ఉంది కానీ ప్రస్తుతం మాత్రం ఆయన సినిమాలు చేసుకుంటారు అని అర్ధం చేసుకోవాలి.

మరో రెండేళ్లలో జరిగే ఎన్నికల విషయం తీసుకుంటే వైసీపీ టీడీపీల మధ్య భీకరమైన పోరు సాగే అవకాశం ఉంది. అయినా సరే వైసీపీకే కొంత ఎడ్జ్ ఉంటుంది అని కూడా అంటున్నారు. దాంతో పాటు ఇపుడు ఎన్నికల ప్రచారం చేస్తే టీడీపీలో లోకేష్ స్ట్రాంగ్ అవుతారు తప్ప ఎన్టీయార్ కి ఏమీ లాభం లేదు. ఒకవేళ టీడీపీ ఓడిపోతే తన ఇమేజ్ కూడా దెబ్బ తింటుంది అన్న అలోచనలు ఏవో జూనియర్ కి ఉన్నాయని అంటున్నారు.

అందుకే ఆయన మరింత కాలం అంటే 2029 ఎన్నికల దాకా వరసబెట్టి సినిమాలు చేసుకుంటూ అపుడు పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు అని అంటున్నరు. అప్పటికి జూనియర్ మరింతగా రాటుదేలతాడు. ఈలోగా టీడీపీలో నాయకత్వ సమస్య కూడా పూర్తిగా కొలిక్కి వస్తుంది. దానికి తోడు ఆ ఎన్నికల నాటికి వైసీపీ పూర్తిగా వీక్ అవుతుంది. ఇలా అన్ని రకాలుగా ఆలోచించే ఇప్పటికి జూనియర్ నో పాలిటిక్స్ అనేశారు అని అంటున్నారు.

మొత్తానికి జూనియర్ మాటల నుంచి ఎవరికి వారు అర్ధాలు వెతుక్కుంటున్నారు. అయితే జూనియర్ కి రాజకీయాల మీద ఆసక్తి ఉంది. కానీ సరైన టైం లోనే ఆయన రంగ ప్రవేశం చేస్తారు అన్నదే ప్రస్తుతం సాగుతున్న విశ్లేషణ. అదే నిజమైతే జూనియర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. అయితే కొంత కాలం వెయిట్ చేయకతప్పదు కూడా.