Begin typing your search above and press return to search.

టీడీపీకి జూనియర్ బ్రహ్మాస్రం ...?

By:  Tupaki Desk   |   19 Oct 2021 7:09 AM GMT
టీడీపీకి జూనియర్ బ్రహ్మాస్రం ...?
X
తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ ఎరగని అతి పెద్ద సంక్షోభం ఇపుడు ఎదుర్కోంటోంది. పార్టీ లీడర్లే కాదు, క్యాడర్ కూడా నిస్తేజంలోకి వెళ్ళిన సందర్భం బహుశా పార్టీకి ఇదే ఫస్ట్ టైమ్ అనుకోవాలి. తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎన్టీయార్ గ్లామర్ తో ఏర్పాటు అయినది. దానికి కావాల్సిన పొలిటికల్ గ్రామర్ చంద్రబాబు అద్దారు. ఎన్టీయార్ జమానా ముగిసాక బాబు ఎత్తులు వ్యూహాలే ఇంతదాకా టీడీపీని నిలబెట్టాయి. అయితే అవన్నీ కూడా ఇపుడు తుత్తునియలు అయ్యాయి. అవుట్ డేటెడ్ అయ్యాయి, దాంతో అవి ఎక్కడా పారడంలేదు. నిజానికి 2019 ఎన్నికల తరువాత తెలుగుదేశం దారుణంగా దెబ్బతింది. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ ఒక వ్యూహం ప్రకారం టీడీపీని ఏపీలో బలహీన పరుస్తూ వచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ మరింత బలంగా తయారవుతూండగా టీడీపీ అన్ని రకాలుగానూ క్షీణిస్తోంది.

ఈ నేపధ్యంలో టీడీపీకి 2024 ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా మారాయన్నది వాస్తవం. అందుకే చంద్రబాబు జనసేన మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అదే టైమ్ లో బీజేపీతో పొత్తు మీద ఇంకా ఆశలు కరిగిపోలేదు. ఈ ప్రయత్నం ఇలా చేస్తూనే తమ ఇంటి వారిని కూడా దువ్వే ప్రయత్నం మొదలెట్టారని టాక్. తెలుగు సినీ రంగాన‌ సూపర్ స్టార్ గా ఉన్న జూనియర్ ఎన్టీయార్ సేవలను మరో మారు వాడుకోవాలని బాబు దాదాపుగా డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. జూనియర్ కనుక కలసి వచ్చి టీడీపీ తరఫున దిగితే ఎదురు ఉండదని పార్టీ నేతలు అంతా అభిప్రాయపడుతున్నారు.

ఈ మేరకు తాజాగా జూనియర్ తో ఫోన్ ద్వారా మాటా మంతీ కలిపారని అంటున్నారు. దానికి జూనియర్ సానుకూలంగా స్పందించారు అన్న మాట కూడా వినిపిస్తోంది. అయితే జూనియర్ నిజంగా బాబు మాటను మన్నించి ఎన్నికల రాజకీయాల్లోకి వస్తారా అన్నది కూడా చర్చగానే ఉంది. జూనియర్ వయసు గట్టిగా నాలుగు పదులు లేవు. ఆయన చేతిలో బోలెడు సినిమాలు ఉన్నాయి. స్టార్ ఇమేజ్ ఉంది. ఆ క్రేజ్ ని మోజుని వదులుకుని ఒక రాజకీయ పార్టీ పక్షాన ప్రచారం చేయడం ద్వారా తాను కొందరి వాడినని చెప్పుకుంటారా అన్న ప్రశ్నలూ ఉన్నాయి.

అయితే జూనియర్ ని ఒక సెంటిమెంట్ తో బాబు తనవైపునకు తిప్పుకుంటారు అంటున్నారు. అదేంటి అంటే తాత ఎన్టీయార్. మీ తాత పెట్టిన పార్టీని కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత మీపైన కూడా ఎంతో ఉంది అని బాబు గట్టిగానే చెబుతారు అంటున్నారు. మొత్తానికి 2024 ఎన్నికల కోసం టీడీపీ తరఫున ప్రచారానికి జూనియర్ కనుక వస్తే ఆ ఊపే వేరుగా ఉంటుంది అంటున్నారు. ఒకవేళ అది జరిగితే మాత్రం టీడీపీకి జూనియర్ బ్రహ్మాస్రంగా మారుతారని, వైసీపీకి కూడా కొంచెం ఇది ఇబ్బందికరమే అవుతుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇంతకీ జూనియర్ చంద్రబాబు మామ మాట వింటారా.ఆయన బాటన నడుస్తారా అంటే ఈ రోజుకీ అది జవాబు లేని ప్రశ్నగానే చూడాలి. కానీ రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అన్నది ఎవరూ మరచిపోరాదు.