Begin typing your search above and press return to search.

చంద్రబాబును టెన్షన్లో పెట్టిన జేసీ

By:  Tupaki Desk   |   2 Dec 2021 6:30 AM GMT
చంద్రబాబును టెన్షన్లో పెట్టిన జేసీ
X
చంద్రబాబు నాయుడు ను సీనియర్ తమ్ముడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఒక్కసారిగా టెన్షన్లో పెట్టేశారు. అపాయిట్మెంట్ తీసుకుని తొందరలోనే జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని ఓ ఇంటర్వూలో చెప్పటం పార్టీలో చర్చనీయాంశమైంది. జగన్ను కలిసే విషయాన్ని ముందుగా చంద్రబాబుకు చెప్పే వెళ్ళి కలుస్తానన్నారు. తాను జగన్ ను కలవాలని అనుకున్నది తన సొంత పని మీద కాదని ప్రజల కోసమే కలుస్తానని చెప్పారు. జగన్ను కలవాల్సిన అవసరం కూడా వచ్చిందన్నారు.

జగన్ను ఎందుకు కలవకూడదు మన ముఖ్యమంత్రే కదా అంటూ జేసీ ఎదురు ప్రశ్నించారు. జగన్ పాలన అద్భుతంగా ఉందని, జనాలంతా చప్పట్లు కొడుతున్నారంటు చెప్పారు. కాకపోతే ఈ మాట చెబుతున్నపుడు సీఎంను జేసీ ఎగతాళి చేస్తున్నారా అనే అనుమానం వస్తుంది. ఈ మాట చెప్పిన తర్వాతే సీఎంను కలుస్తానని, చీకట్లో ముసుగేసుకుని అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి కలవాల్సిన అవసరం తనకు లేదని చెప్పటమంటే ఎవరినో ఎద్దేవా చేసినట్లే అనిపిస్తోంది. తాను నీలం సంజీవరెడ్డి నుండి మొన్నటి వైఎస్ రాజశేఖరరెడ్డి దాకా ఎందరో సీఎంల పరిపాలనను దగ్గరనుండి చూసినట్లు తెలిపారు. ప్రస్తుతం జగన్ పాలన మాత్రం అద్భుతంగా ఉందన్నారు.

భువనేశ్వరిపై వైసీపీ ఎంఎల్ఏలు చేసినట్లుగా ప్రచారంలో ఉన్న కామెంట్లు దానికి చంద్రబాబు భోరున ఏడ్చిన రియాక్షన్ పైన కూడా జేసీ ఈమధ్యనే చేసిన కామెంట్లు పార్టీలో పెద్ద సంచలనమైంది. చంద్రబాబు ఏడుపుపై తనకే స్పందన రాకపోతే ఇక జనాలకు ఏమొస్తుందంటు ఆ ఇంటర్వ్యూలో ఎదురు ప్రశ్నించారు. వైసీపీ ఎంఎల్ఏల కామెంట్లపై చంద్రబాబు ఏడ్చినంత మాత్రాన సెంటిమెంటు వస్తుందని తాను అనుకోవటం లేదని చేసిన కామెంట్ పై పార్టీలోనే పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

జేసీ కామెంట్ల వేడి పూర్తిగా చల్లారకముందే మళ్ళీ తాను జగన్ను కలుస్తానని చెప్పటం కలకలం రేపుతోంది. మార్చిలో జగన్ అపాయిట్మెంట్ కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. తాను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పటానికే ఒకసారి అపాయిట్మెంట్ తీసుకుని కలుస్తానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మరి జగన్ కలవాల్సినంత అవసరం ఏమొచ్చింది ? జగన్ కు తాను ఏమి చెప్పదలచుకున్నారు ? అన్న విషయాలు మాత్రం సస్పెన్సుగా మిగిలిపోయింది.

జేసీ తాజా కామెంట్లపై ఎవరి శక్తి కొద్దీ వారు ఊహాగానాలకు పదునుపెట్టారు. ఎందుకంటే జేసీ కొడుకు పవన్ రెడ్డి సీఎంకు బాగా సన్నిహితుడనే ప్రచారం ఉంది. నిజానికి పోయిన ఎన్నికల నాటికి పవన్ వైసీపీలో చేరుతారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఎందుకనో పవన్ టీడీపీ తరపునే అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. జగన్ పై గతంలో జేసీ సోదరులు ఎంత డ్యామేజింగ్ గా వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలిసిందే. దాంతో జగన్-జేసీ సోదరుల మధ్య వ్యవహారం ఉప్పు-నిప్పులాగుంది. ఈ నేపధ్యంలోనే హఠాత్తుగా జేసీ దివాకరరెడ్డి అపాయిట్మెంట్ తీసుకుని జగన్ను కలుస్తానని, చెప్పాల్సింది నేరుగానే చెబుతాను అన్న మాటలు తమ్ముళ్ళందరినీ టెన్షన్లోకి నెట్టేస్తున్నాయి.